కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మే మే 6, 7 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దేశీయ పండ్ల రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేసేందుకు ఉద్దేశించిన “ఫ్రూట్ హారిజన్ 2026”కు సంబంధించిన కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రధానంగా దేశంలో పండ్ల ఉత్పత్తిని పెంచడం, నాణ్యతను మెరుగుపరచడం, శుద్ధి, ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సాగనుంది. పండ్ల రంగానికి కొత్త ఊపునిచ్చేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, ఇతర భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
పర్యటనలో భాగంగా మే 6న లక్నోలోని గోమతి నగర్‌లోని హోటల్ రినైసాన్స్‌లో ఎగుమతిదారులు, ఇతర భాగస్వాములతో కేంద్ర మంత్రి నేరుగా సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం ప్రగతిశీల ఎగుమతిదారులతో భేటీ అవుతారు. అనంతరం ఎగుమతిదారులు, డైరెక్టర్లు , ఇతర ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. పండ్ల ఎగుమతులను పెంచడం, అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకోవడం, ఈ రంగం కోసం మరింత మెరుగైన వ్యూహాలను రూపొందించడంపై ఈ సమావేశం దృష్టి సారించనుంది.
ఈ చర్చల ద్వారా దేశీయ పండ్ల వ్యాపారం బలోపేతం కావడమే కాకుండా, రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
ప్రధాన కార్యక్రమం మే 7న లక్నోలోని రెహమాన్ ఖేరాలో ఉన్న ఐసీఏఆర్-సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రోపికల్ హార్టికల్చర్ (కేంద్ర ఉప ఉష్ణమండల ఉద్యానవన సంస్థ)లో జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:00 గంటల నుంచి రైతులు, నర్సరీ నిర్వాహకులు, శుద్ధి రంగ ప్రతినిధులతో కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నేరుగా చర్చలు జరుపుతారు. అనంతరం జరిగే ప్రధాన సమావేశంలో ఉత్తరప్రదేశ్ మంత్రులు శ్రీ సూర్య ప్రతాప్ షాహి, శ్రీ దినేష్ ప్రతాప్ సింగ్‌లు కూడా పాల్గొంటారు.
ఈ కార్యక్రమం ప్రధాన ఎజెండాలో పండ్ల నాణ్యత పెంపుదల, ఎగుమతులు, విలువ జోడింపు, ఎగుమతుల్లో తిరస్కరణలు లేకుండా చూడటం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే పండ్ల రంగాన్ని బలోపేతం చేయడంలో ఎఫ్‌పీఓలు, ఎఫ్‌పీసీలు, స్వయం సహాయక సంఘాల పాత్రపై కూడా ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ సదస్సు ఉద్యానవన, పండ్ల ఎగుమతి రంగంలో నూతన ఆవిష్కరణలకు, సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి, కొత్త మార్కెట్ అవకాశాలకు బాటలు వేస్తుందని భావిస్తున్నారు.
లక్నో వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఉత్తర ప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా పండ్ల రంగం వృద్ధిని వేగవంతం చేసే దిశగా కీలక చర్యగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పలువురు సీనియర్ శాస్త్రవేత్తలు కూడా పాల్గొననున్నారు.
***