నీతి ఆయోగ్
రియల్ టైమ్ గవర్నెన్స్‌ను బలోపేతం చేసేందుకు, చివరి వ్యక్తి వరకూ సేవలు అందించేందుకు
సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్ (సీపీవో) పోర్టల్‌ను ప్రారంభించిన నీతి ఆయోగ్
నాడు పోస్టు చేయడమైనది:
05 MAY 2026 9:49PM by PIB Hyderabad
ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల కార్యక్రమం (ఏడీపీ/ఏబీపీ) పరిధిలో రియల్ టైమ్ గవర్నెన్స్‌ను బలోపేతం చేయడం, భాగస్వాముల మధ్య సమన్వయాన్ని పెంచడం, చివరి వ్యక్తి వరకు సేవలను వేగంగా అందించడమే లక్ష్యంగా సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్ (సీపీవో) వెబ్ సైటును నీతి ఆయోగ్ ఈ రోజు ప్రారంభించింది.
ఈ వెబ్ సైటును నీతి ఆయోగ్ సీఈవో నిధి చిబ్బర్ అధికారికంగా ప్రారంభించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధికారులు, కేంద్ర ప్రభారీ అధికారులు, ప్రణాళికా కార్యదర్శులు, జిల్లా న్యాయాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈవో ప్రసంగించారు. అత్యంత విశ్వసనీయమైన, పారదర్శకమైన, స్పందించే పరిపాలనా వ్యవస్థను నిర్మించే దిశగా చేపట్టిన కీలక చర్యను సీపీవో వెబ్ సైటు సూచిస్తుందన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనలను ఎప్పటికప్పుడు సమర్పించడానికి, పర్యవేక్షించడానికి ఈ వేదిక వీలు కల్పిస్తుందనీ, తద్వారా క్షేత్ర స్థాయి నుంచి అందిన సమాచారం విధానపరమైన, పరిపాలనాపరమైన చర్యలకు నేరుగా సహాయపడుతుందని తెలిపారు.
డేటా ఆధారిత పరిపాలన ప్రాధాన్యం, క్షేత్ర స్థాయి సమాచారాన్ని అందించడంలో కేంద్ర ప్రభారీ అధికారులు (సీపీవో) పోషించే కీలకపాత్ర గురించి నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి, ఏడీపీ/ఏబీపీ మిషన్ డైరెక్టర్ శ్రీ రోహిత్ కుమార్ వివరించారు. పాలనలోని అన్ని స్థాయుల్లోనూ వాస్తవ సమయంలో పరిశీలనలను సంగ్రహించడం, సమాచార ప్రసారాన్ని క్రమబద్ధీకరించడం, పరిపాలనాపరమైన స్పందనను వేగవంతం చేయడం కోసం అధునాతన డిజిటల్ వేదికగా సీపీవో పోర్టల్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు.
ఈ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ల నుంచే క్షేత్ర స్థాయిలో తమ పరిశీలనలను, సిఫారసులను సెంట్రల్ ప్రభారీ అధికారులు సమర్పిస్తారు. అనంతరం ఈ సమాచారం అందుబాటులోకి వస్తుంది. సీపీవోలు ఇచ్చిన సూచనలను జిల్లాలు స్వీకరించి, తగిన చర్యలు చేపట్టి, తదనుగుణంగా తమ స్పందనలను సమర్పించవచ్చు. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రణాళికా కార్యదర్శులు సమగ్రంగా పరిశీలిస్తారు. సూచనలను అమలు చేసి, తమ అభిప్రాయాలను నమోదు చేసేలా వివిధ విభాగాలతో సమన్వయం చేసుకుంటారు. అదే సమయంలో నీతి ఆయోగ్ అధికారులు, సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ సమాచారాన్ని పర్యవేక్షిస్తాయి. క్షేత్ర స్థాయి పరిశీలనలు, పరిపాలనా పరమైన చర్యల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే సమీకృత డిజిటల్ ఇంటర్‌ఫేస్‌గా ఈ పోర్టల్ పనిచేస్తుంది. తక్షణమే సమాచారం అందుబాటులోకి రావడం, నిర్మాణాత్మక పర్యవేక్షణనూ, పారదర్శకతనూ అందించడం ద్వారా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో అమలు సామర్థ్యాన్ని, ప్రతిస్పందనను గణనీయంగా మెరుగుపరుస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ పోర్టల్‌లో ఉన్న అంశాలు, పనిచేసే విధానాన్ని వివరించే లఘుచిత్రాన్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. భాగస్వాములందరూ ఈ వేదికను సమర్థంగా ఉపయోగించుకునేలా చేయడానికి ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తామని నీతి ఆయోగ్ తెలిపింది.
సమగ్రాభివృద్ధిని ముందుకు నడిపించడంలో, ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలనను వేగవంతం చేయడంలో సాంకేతికతను ఉపయోగించుకునే దిశగా చేపట్టిన చర్యను ఈ ప్రయత్నం సూచిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2258306)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8