రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లో దేశంలోని తొలి మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించిన ఎన్‌హెచ్ఏఐ
అమలు చేసిన మొదటి రోజే టోల్ ప్రాంతాన్ని దాటిన సుమారు 41,500 వాహనాలు
నాడు పోస్టు చేయడమైనది:
02 MAY 2026 4:36PM by PIB Hyderabad
దేశంలో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థను మార్చివేసే దిశగా ఒక పెద్ద అడుగు వేస్తూ, భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) గుజరాత్ లోని ఎన్-హెచ్ 48 సూరత్-భరూచ్ విభాగంలో గల చోరాసి టోల్ ప్లాజా వద్ద మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో ఆధారిత టోలింగ్ (ఎంఎల్ఎఫ్ఎఫ్) విధానాన్ని విజయవంతంగా ప్రారంభించింది. ఈ విధానం అమలు చేసిన మొదటి రోజే సుమారు 41,500 వాహనాలు ఈ టోల్ కేంద్రాన్ని దాటాయి.
ఎంఎల్ఎఫ్ఎఫ్ విధానం ఎటువంటి అడ్డంకులు లేని టోలింగ్ ప్రక్రియను పరిచయం చేస్తోంది. దీనివల్ల మానవ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది. వాహనాలు ఎక్కడా ఆగకుండా టోల్ కేంద్రాలను దాటి వెళ్లవచ్చు, ఫలితంగా ట్రాఫిక్ సాఫీగా సాగుతుంది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు, ఫాస్టాగ్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవస్థ స్వయంచాలిత, స్పర్శ రహిత టోలింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. నేషనల్ హైవే వినియోగదారుల ప్రయాణ అనుభవంలో ఎంఎల్ఎన్ఎఫ్ ఒక విప్లవాత్మక మార్పును సూచిస్తుంది. ఇది సామర్థ్యాన్ని, సౌకర్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఇది జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించడమే కాకుండా, ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది, ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గిస్తుంది.
మెరుగైన అనుభవం కోసం, జాతీయ రహదారి వినియోగదారులు తమ ఫాస్టాగ్ ఖాతాలలో తగినంత నగదు బ్యాలెన్స్ ఉంచుకోవాలని ఎన్హెచ్ఏఐ కోరింది. ఫాస్టాగ్ ఖాతాలో నిల్వ లేకపోవడం, చెల్లని లేదా పనిచేయని ఫాస్టాగ్ వంటి సందర్భాల్లో, వినియోగదారు రుసుము చెల్లించకపోతే వారికి ఎలక్ట్రానిక్ నోటీసు జారీ చేస్తారు. అటువంటి వినియోగదారులు ఇ-నోటీసు వచ్చిన 72 గంటలలోపు సాధారణ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 72 గంటల తర్వాత కూడా చెల్లించని పక్షంలో, ఆ వాహన శ్రేణికి నిర్ణయించిన సాధారణ రేటు కంటే రెండు రెట్లు ఎక్కువ రుసుము వసూలు చేస్తారు. నిర్ణీత పోర్టల్ https://nhfeenotice.parivahan.gov.in/#/ ద్వారా ఈ-నోటీసులను పొందవచ్చు. చెల్లించవచ్చు. వినియోగదారులు ఈ-నోటీసు జారీ చేసిన 72 గంటలలోపు తమ ఫిర్యాదులను కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ-నోటీసులకు సంబంధించిన బకాయిలు చెల్లించకపోతే, ఫాస్టాగ్‌ను బ్లాక్‌లిస్ట్ చేయడం, వాహన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా లభించే ఇతర వాహన సంబంధిత సేవలను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంటారు.
ఎంఎల్ఎఫ్ఎఫ్ వల్ల టోల్ ప్లాజాల ఏర్పాటుకు అయ్యే నిర్వహణ ఖర్చులు తగ్గడమే కాకుండా, పారదర్శకత పెరిగి టోల్ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయి. జాతీయ రహదారుల వ్యవస్థ అంతటా మరింత పటిష్టమైన, సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన టోలింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కూడా ఎంఎల్ఎఫ్ఎఫ్ తోడ్పడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2257581)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9