రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రాజెక్ట్ 17A స్వదేశీ అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ‘మహేంద్రగిరి’ నౌకాదళానికి అప్పగింత
ప్రధాన నౌకను అప్పగించిన 17 నెలల్లోనే ఆరో ప్రాజెక్ట్ 17A నౌక అప్పగింత
నాడు పోస్టు చేయడమైనది:
01 MAY 2026 2:34PM by PIB Hyderabad
మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎమ్‌డీఎస్ఎల్)లో నిర్మించిన నీలగిరి-శ్రేణి (ప్రాజెక్ట్ 17A)కి చెందిన ఆరో నౌకను, అదే శ్రేణికి చెందిన నాల్గో నౌక మహేంద్రగిరి (యార్డ్ 12654)ని 2026 ఏప్రిల్ 30న ముంబయిలోని ఎమ్‌డీఎస్ఎల్‌లో భారత నౌకాదళానికి అప్పగించారు. ఇది యుద్ధనౌకల రూపకల్పన, నిర్మాణ రంగంలో స్వయం-సమృద్ధి దిశగా కీలక ముందడుగును సూచిస్తుంది.
ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్‌లు నౌకా వాణిజ్య రంగంలో ప్రస్తుత, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి రూపొందించిన బహుముఖ, బహుళ-కార్యసాధక వేదికలుగా నిలుస్తాయి. ఈ అత్యాధునిక ఫ్రిగేట్... నౌకాదళ సరికొత్త నమూనా, స్టెల్త్, ఫైర్ పవర్, ఆటోమేషన్, సర్వైవెబిలిటీ పరంగా గొప్ప పురోగతిని ప్రతిబింబిస్తుంది. యుద్ధనౌకల నిర్మాణ రంగంలో స్వయం-సమృద్ధికి ప్రశంసనీయ చిహ్నంగా నిలుస్తుంది.
వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన, వార్‌షిప్ ఓవర్‌సీయింగ్ టీమ్ (ముంబయి) పర్యవేక్షణలో నిర్మించిన ఈ P17A ఫ్రిగేట్‌లు... దేశీయ నౌకా రూపకల్పన, స్టెల్త్, సర్వైవెబిలిటీ, పోరాట సామర్థ్యంలో ఒక తరం ముందడుగును ప్రతిబింబిస్తాయి. సమీకృత నిర్మాణ తత్వంతో... ఈ నౌకను అంచనా కాలవ్యవధిలోనే నిర్మించి, నౌకాదళానికి అప్పగించారు.
P17 (శివాలిక్-శ్రేణి) నౌకలతో పోలిస్తే P17A నౌకలు అధునాతన ఆయుధ, సెన్సార్ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ నౌకలను కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ (కోడాగ్) ప్రొపల్షన్ ప్లాంట్‌లతో రూపొందించారు. వీటిలో ప్రతి షాఫ్ట్‌పై కంట్రోలెబుల్ పిచ్ ప్రొపెల్లర్‌ను నడిపే ఒక డీజిల్ ఇంజిన్, ఒక గ్యాస్ టర్బైన్, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంటాయి. ఈ శక్తిమంతమైన ఆయుధ, సెన్సార్ వ్యవస్థలో యాంటీ-సర్ఫేస్, యాంటీ-ఎయిర్, యాంటీ-సబ్‌మెరైన్ యుద్ధ వ్యవస్థలు ఉంటాయి.
2024, డిసెంబర్ 20న ఎమ్‌డీఎస్ఎల్ ద్వారా మొదటి P17A (నీలగిరి) నౌకను అప్పగించినప్పటి నుంచి, 17 నెలల కంటే తక్కువ వ్యవధిలోనే భారత నౌకాదళానికి అందించిన ఆరో P17A నౌక మహేంద్రగిరి. మహేంద్రగిరిని నౌకాదళానికి అప్పగించడం దేశీయ రూపకల్పన, నౌకా నిర్మాణం, ఇంజనీరింగ్ పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది. నౌకా రూపకల్పన, నౌకా నిర్మాణం రెండింటిలోనూ స్వయం-సమృద్ధి సాధనపై నౌకాదళ నిరంతర దృష్టిని ఇది ప్రతిబింబిస్తుంది. 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 200కు పైగా ఎమ్ఎస్ఎమ్ఈలు ఎమ్‌డీఎస్ఎల్‌తో కలిసి పనిచేశాయి. దీని ద్వారా సుమారు 4,000 మంది ప్రత్యక్షంగా, 10,000 మందికి పైగా పరోక్ష ఉపాధిని పొందారు.




***
(రిలీజ్ ఐడి: 2257417)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8