బొగ్గు మంత్రిత్వ శాఖ
ఆర్థిక ప్రోత్సాహక పథకం రెండో రౌండ్‌లో మూడో కేటగిరీ కింద ఎంపికైన దరఖాస్తుదారుకు లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేసిన బొగ్గు మంత్రిత్వ శాఖ... బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు ప్రోత్సాహమే లక్ష్యం
నాడు పోస్టు చేయడమైనది:
29 APR 2026 6:28PM by PIB Hyderabad
బొగ్గు/లిగ్నైటు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సాహించేందుకు కేటాయించిన రూ. 8,500 కోట్ల ఆర్థిక ప్రోత్సాహక పథకంలో భాగంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కీలక మైలురాయిని చేరింది. ఈ పథకం రెండో రౌండ్, కేటగిరీ-III కింద లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేయడంతో దేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ మరో అడుగు ముందుకేసింది.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో బొగ్గు నుంచి ఎసిటిక్ ఆమ్ల (కోల్ టు ఎసిటిక్ యాసిడ్) చిన్న తరహా ప్లాంటును స్థాపించేందుకు గాను కార్తికేయ వాయునందన ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా ఈ ఎల్‌వోఏను అందించారు. రూ. 793 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 75,900 టన్నుల ఎసిటిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయనున్నారు. దేశంలో బొగ్గును అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చడంలో ఇదొక కీలక ముందడుగు.
ప్రస్తుతం ఈ పథకం వేగంగా పుంజుకుంటోంది. తొలి రౌండ్‌లో ఇప్పటికే ఏడు ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. పెట్టుబడులను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, రెండో రౌండ్ (కేటగిరీ-II, కేటగిరీ-III) కోసం ప్రభుత్వం ప్రతిపాదనలను ఆహ్వానించింది.
ప్రయోగాత్మక ప్రాజెక్టులు, చిన్న తరహా, ఉత్పత్తి ఆధారిత ప్లాంట్లు కేటగిరీ-III పరిధిలోకి వస్తాయి. ఇందులో భాగంగా ప్రతి ప్రాజెక్టుకు రూ. 100 కోట్ల వరకు లేదా మూలధన వ్యయంలో15 శాతం (ఏది తక్కువగా ఉంటే అది) ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇది కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే కాకుండా, గ్యాసిఫికేషన్ సాంకేతికతను వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు దోహదపడుతుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా దేశీయంగా అనుబంధ రసాయనాల ఉత్పత్తి పెరగడంతోపాటు, దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ఆత్మనిర్భర్ భారత్ దిశగా మన ప్రయాణాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా శుద్ధమైన, సమర్థమైన పద్ధతుల్లో బొగ్గు వనరులను వినియోగించుకుంటూ సుస్థిర పారిశ్రామిక వ్యవస్థను నిర్మించాలన్న ప్రభుత్వ దృఢనిశ్చయాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2256873)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12