రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
భయం నుంచి స్వేచ్ఛ దిశగా ప్రయాణం: ఘాట్లలో మరింత సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించనున్న కొత్త కంభత్కి ఘాట్ సొరంగ మార్గం
నాడు పోస్టు చేయడమైనది:
27 APR 2026 6:16PM by PIB Hyderabad
దశాబ్దాలుగా పుణె- సతారా రహదారిలోని కంభత్కి ఘాట్ మార్గం అంటేనే ధైర్యానికీ, ఓపికకీ పరీక్షగా ఉండేది. ఇరుకైన రోడ్లు, ప్రమాదకరంగా మెలికలు తిరిగిన మలుపులు, సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌లు, తరచుగా జరిగే ప్రమాదాలు.. ముఖ్యంగా వారాంతాలు, సెలవు దినాల్లో ప్రయాణాన్ని అత్యంత దారుణంగా మార్చాయి. చాలా తక్కువ సమయంలో పూర్తి కావాల్సిన ప్రయాణం.. తరచుగా రద్దీగా ఉండే సొరంగ మార్గాల గుండా గంటల తరబడి వెళ్లే నిరీక్షణగా మారేది.
నేడు ఈ పరిస్థితి మారుతోంది.
ఎన్‌హెచ్-4పై (కొత్త ఎన్‌హెచ్-48) జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఈ 6 వరుసల కంభత్కి ఘాట్ సొరంగ మార్గాన్ని (ట్విన్ ట్యూబ్ 6-లేన్ టన్నెల్ ప్రాజెక్ట్) కొత్తగా నిర్మించింది. ఇది మహారాష్ట్రలో ప్రయాణించేందుకు అత్యంత కష్టతరమైన రహదారి విభాగాలలో ఒకదానిని ఆధునిక, ప్రజలకు ప్రాధాన్యతనిచ్చే మౌలిక సదుపాయాలకు చిహ్నంగా మారుస్తోంది.
ప్రయోగాత్మక ప్రయాణం, భద్రతా పరీక్షలలో భాగంగా ఈ జంట సొరంగ మార్గంలో ఒక వైపు భాగాన్ని పరీక్షించేందుకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మెరుగైన ఈ మౌలిక సదుపాయాన్ని ప్రయాణికులు ప్రత్యక్షంగా అనుభూతి చెందొచ్చు.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 86 శాతం పూర్తయింది. 2026 ప్రథమార్ధంలో ఈ సొరంగ మార్గం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది.
ఆ ఘాట్ మార్గంలో క్రమం తప్పకుండా ప్రయాణించే ఒక ప్రయాణికుడు.. కొత్త టన్నెల్‌లోకి ప్రవేశించిన క్షణం నుంచే తేడాను గమనించారు.
“ఇక్కడ రిఫ్లెక్టర్లు ఎక్కువగా ఉన్నాయి. మెరుగైన లైటింగ్, సీసీటీవి కెమెరాలు, స్పష్టంగా కనిపించే సేఫ్టీ గార్డ్ రైలింగ్‌లు, సరైన అగ్ని మాపక (ఫైర్ ఎక్స్టింగ్విషర్) పాయింట్లు ఉన్నాయి. పాత సొరంగ మార్గంతో పోలిస్తే ఇది చాలా వెడల్పుగా ఉంది. భద్రతను దృష్టిలో ఉంచుకొని సరైన విధంగా డిజైన్ చేశారు."
సతారా నుంచి పుణెకు ప్రతి రోజు ప్రయాణించే మరొక ప్రయాణికుడు.. పాత మార్గంలో ఎదుర్కొన్న రోజువారీ ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు.
" గతంలో పాత సొరంగ మార్గంలో కేవలం రెండు వరుసలు మాత్రమే ఉండేవి. అందువల్ల ట్రాఫిక్ బాగా ఉండేది. ఏదైనా కారు లేదా ట్రక్కు పాడైతే పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యేది. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండేది. పాత సొరంగ మార్గంలో వెళ్లడానికి దాదాపు 15-20 నిమిషాలు పట్టేది. ఇప్పుడు ఈ కొత్త సొరంగ మార్గం వల్ల కేవలం 5-10 నిమిషాల్లోనే ప్రయాణం పూర్తవుతోంది."
ఒకప్పుడు ట్రాఫిక్ సమస్యలకు నిలయంగా ఉన్న ఈ మార్గం ఇప్పుడు అత్యంత వేగవంతమైన, సులభతరమైన రహదారిగా మారింది.
ఖండాల, సతారా మధ్య నిత్యం ప్రయాణించే సమీప గ్రామానికి చెందిన ఇద్దరు స్థానిక మహిళల రోజువారీ జీవితాన్ని ఈ సొరంగ మార్గం పూర్తిగా మార్చేసింది.
"ఈ కొత్త సొరంగ మార్గం ప్రయాణించేందుకు చాలా బాగుంది. చాలా సురక్షితంగా అనిపిస్తుంది. పాత టన్నెల్‌లో ప్రయాణ సమయం ఎక్కువగా ఉండేది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉండేది. మేం రోజూ ప్రయాణిస్తాం. కాబట్టి ఇప్పుడు మాకు చాలా సమయం ఆదా అవుతోంది. సొరంగ మార్గంలో లైటింగ్ చాలా అద్భుతంగా ఉంది. దీనివల్ల ప్రయాణం సురక్షితంగా అనిపిస్తుంది. గతంలో చీకటి పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు."
ఈ టన్నెల్ ఎందుకు ముఖ్యమైనది?
ప్రస్తుతం ఉన్న కంభత్కి ఘాట్ మార్గం ముంబయి-పుణె-బెంగళూరు కారిడార్‌లో ఒక కీలకమైన అనుసంధాన విభాగం. ఇది పూణె, సతారా, కొల్హాపూర్, బెల్గాం వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. అంతేకాకుండా పంచగని, మహాబలేశ్వర్, కాస్ పీఠభూమికి వెళ్లే వేలాది మంది పర్యాటకులతో పాటు సజ్జన్‌గఢ్ సందర్శించే భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది.
అయితే పాత మౌలిక సదుపాయాలు వాటి గరిష్ఠ సామర్థ్యాన్ని చేరుకున్నాయి:
-
ఒక వైపు 0.85 కి.మీ పొడవున్న రెండు-వరుసల సొరంగ మార్గం
-
వ్యతిరేకంగా 8 కి.మీ ఘాట్ రోడ్డు
-
ప్రమాదకరమైన మలుపులు, నిటారైన భూభాగం, తరచుగా ట్రాఫిక్ రద్దీ
-
అధిక ప్రమాదాల ముప్పు.. ఇంధనం, సమయం వృథా
ఈ సమస్యలన్నింటినీ కొత్త సొరంగ మార్గం ఒకేసారి పరిష్కరిస్తోంది.
ఇంజనీరింగ్ భద్రత, వేగం, స్థాయి
కొత్త ఆరు వరుసల జంట సొరంగ మార్గం నిర్మాణంతో పుణె, సతారా మధ్య ప్రయాణం గణనీయంగా మెరుగుపడుతుంది:
-
ప్రయాణ సమయం తగ్గటం
-
ప్రమాదాల ముప్పు గణనీయంగా తగ్గటం
-
ఇంధన వినియోగం, వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గటం
-
వాహనాలకు కలిగే నష్టం తగ్గటం
-
స్థానిక ప్రయాణికులు, వాణిజ్యం, పర్యాటక రంగానికి మెరుగైన అనుసంధానత
ఘాట్లలో మరింత సురక్షిత ప్రయాణం
మానవ అనుభూతిని దృష్టిలో పెట్టుకొని నిర్మించినట్లయితే ఆ మార్గం కేవలం వాహనాల రాకపోకలకే కాకుండా అంతకుమించిన పనులెన్నో చేస్తుందన్న విషయాన్ని కొత్త కంభత్కి ఘాట్ జంట సొరంగాల ప్రాజెక్టు నిరూపిస్తోంది. ఇది భయాన్ని తగ్గించటంతో పాటు సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది ప్రాణాలను కాపాడటంతో పాటు ప్రయాణంపై నమ్మకాన్ని పునరుద్ధరిస్తుంది.
(రిలీజ్ ఐడి: 2256161)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5