అంతరిక్ష విభాగం
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అంతరిక్ష ప్రయోగశాలలు... ప్రణాళికపై డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్ష: మొదటి దశలో ఏడు ప్రయోగశాలలు
అయిదేళ్లలో 600 మిలియన్ డాలర్లను దాటిన ప్రైవేటు రంగ అంతరిక్ష పెట్టుబడి
ఈ రంగంలో సంస్థల సంఖ్య 400 దాటిన నేపథ్యంలో దేశ అంతరిక్ష అంకుర సంస్థలకు ఊతమిచ్చేందుకు రూ. 1,000 కోట్ల వాణిజ్య విస్తరణ నిధి
సాంకేతిక నిధులు, ప్రాథమిక పెట్టుబడి మద్దతుతో భారత అంతరిక్ష ఆవిష్కరణలకు ఊతం..
పథకాలు, మౌలిక సదుపాయాల ద్వారా వృద్ధికి సారథిగా నిలుస్తున్న ఇన్‌స్పేస్: డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
26 APR 2026 2:02PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అంతరిక్ష ప్రయోగశాలలను ఏర్పాటు చేసే ప్రణాళికపై కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు సమీక్షించారు. ఉపగ్రహ వ్యవస్థలు, రాకెట్ సాంకేతికత, మిషన్ డిజైనింగ్‌లో విద్యార్థులకు ప్రయోగాత్మక అవగాహన కల్పించడం లక్ష్యంగా మొదటి దశలో ఈ తరహాలో ఏడు ప్రయోగశాలలను నెలకొల్పనున్నారు.
అంతరిక్ష రంగంలో ప్రభుత్వేతర సంస్థలనూ అనుమతించిన తర్వాత, గత అయిదేళ్లలో ఈ రంగం దాదాపు 600 మిలియన్ డాలర్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో.. క్రమంగా విస్తరిస్తున్న భారత అంతరిక్ష రంగం కోసం నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం.
ఇన్ స్పేస్ చైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకా క్లుప్తమైన వివరణ అనంతరం ఈ సమీక్ష కొనసాగింది. దేశ అంతరిక్ష సంస్కరణల్లో పురోగతిని, ఈ రంగంలోని ప్రతి దశలోనూ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరుగుతున్న తీరును ఆయన సంక్షిప్తంగా వివరించారు.
భారత ప్రైవేటు అంతరిక్ష వ్యవస్థ వేగంగా విస్తరించింది. ఈ రంగంలో అంకుర సంస్థల సంఖ్య 2019లో ఒక అంకెకే పరిమితమై ఉండగా.. 2026 ప్రారంభం నాటికి అది 400 దాటింది. ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాలు - పేలోడ్ తయారీ, భూతల మౌలిక సదుపాయాలు, డేటా సేవలు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న కక్ష్యాంతర్గత విభాగాల్లో ప్రస్తుతం ఈ అంకుర సంస్థలు క్రియాశీలకంగా సేవలందిస్తున్నాయి. అంతరిక్షయానంలో ఇప్పటికే బలమైన స్థానంలో ఉన్న దేశాలు సహా అంతర్జాతీయ క్లయింట్లతో సంబంధాలూ మెరుగుపడుతున్నాయి. ప్రపంచ దేశాలు మరింత ఆసక్తిగా భారత్ వైపు చూస్తున్నాయనేందుకు ఇది నిదర్శనం.
ఈ వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం నిర్దేశిత లక్ష్యంతో అనేక కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. వృద్ధి దశలో ఉన్న అంకుర సంస్థలకు దన్నుగా నిలిచేందుకు సిడ్బీతో కలిసి రూ. 1,000 కోట్ల వ్యాపార విస్తరణ నిధిని అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే, ప్రారంభ దశలో ఉన్న ఆవిష్కరణలను వాణిజ్యపరంగా లాభదాయకమైన ఉత్పత్తులుగా మార్చడం కోసం రూ. 500 కోట్ల సాంకేతికతా సహాయక నిధితో సహకరిస్తోంది. ఇక ఆలోచన, నమూనా దశలో ఉన్న అంకుర సంస్థలకు ప్రాథమిక పెట్టుబడి నిధి (సీడ్ ఫండ్) పథకం ద్వారా రూ. కోటి వరకు గ్రాంట్లు అందించడంతోపాటు.. మార్గదర్శకత్వాన్నీ, ఇతర వ్యవస్థాపరమైన చేయూతనూ అందిస్తోంది.
నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేసే ప్రయత్నాలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. 17 ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేయగా.. ఉపగ్రహ తయారీ, ప్రయోగ వాహన వ్యవస్థలు, అంతరిక్ష సైబర్ భద్రత వంటి విభాగాల్లో దాదాపు 900 మంది అభ్యర్థులు ధ్రువీకరణ సాధించారు. విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేయబోయే అంతరిక్ష ప్రయోగశాలలు.. విద్యార్థులకు ప్రయోగాత్మక అభ్యాస అవకాశాలను కల్పించడం ద్వారా ఈ ప్రతిభను మరింత బలోపేతం చేస్తాయని ఆశాభావంతో ఉన్నారు.
మౌలిక సదుపాయాల పరంగా చూస్తే.. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య నమూనాలో ప్రైవేటు సంస్థల నేతృత్వంలోని భూ పరిశీలక ఉపగ్రహాల సమూహం, అంకుర సంస్థల కోసం ఉమ్మడి ఉపగ్రహ బస్ ప్లాట్‌ఫారమ్ అభివృద్ధి, అహ్మదాబాద్‌లో ఇన్ స్పేస్ సాంకేతిక కేంద్రంలో డిజైన్, సమీకరణ, పరీక్ష సౌకర్యాల విస్తరణ వంటి కార్యక్రమాల ద్వారా సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే చిన్న ఉపగ్రహాల ప్రయోగ వాహనం (ఎస్ఎస్ఎల్వీ) సహా సాంకేతిక బదిలీ కార్యక్రమాలు కూడా పరిశ్రమల భాగస్వామ్యంతో వేగంగా పురోగమిస్తున్నాయి.
అంతరిక్ష రంగంలో భారత్ అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత బలపడుతోంది. ప్రస్తుతం భాగస్వామ్యాలు 45కు పైగా దేశాలకు విస్తరించాయి. సింగపూర్, యూఏఈలతో ఒప్పందాలు, అంతర్జాతీయ అంతరిక్ష వేదికల్లో భారతీయ కంపెనీల భాగస్వామ్యం, దేశీయ అంకుర సంస్థలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించే కార్యక్రమాలను ఇటీవల గమనించవచ్చు.
ఇన్ స్పేస్ ప్రారంభమైనప్పటి నుంచి.. అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు, విద్యా సంస్థలు, పరిశ్రమల నుంచి వెయ్యికి పైగా దరఖాస్తులను స్వీకరించి, 129 అనుమతులను మంజూరు చేసింది. సంస్కరణల అనంతరం భారత అంతరిక్ష వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
****
(రిలీజ్ ఐడి: 2255730)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6