యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
శ్రీనగర్‌లో కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రుల సమావేశం
ప్రపంచ స్థాయి క్రీడా శక్తిగా మారడానికి మన పదేళ్ల ప్రణాళిక కాగితాలకే పరిమితం కాకూడదు; అది ప్రతి క్రీడా
మైదానంలో, ప్రతి జిల్లాలో, ప్రతి యువ స్వప్నంలోనూ సజీవంగా ఉండాలి: డాక్టర్ మాండవీయ
ఖేలో భారత్ పథకం మన యువత శక్తికి, దేశ నిబద్ధతకు ప్రతిబింబం: మన్సుఖ్ మాండవీయ
క్రీడాకారులు, ఆటగాళ్ల కేంద్రంగా ఉండే విధానంపై ఏకాభిప్రాయం కోసం
తీసుకున్న చొరవకు వివిధ రాష్ట్రాల క్రీడల మంత్రుల ప్రశంస
నాడు పోస్టు చేయడమైనది:
25 APR 2026 6:05PM by PIB Hyderabad
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రుల చింతన్ శిబిరం ఈరోజు శ్రీనగర్‌లో ప్రారంభమైంది. సమన్వయ చర్యలు, వ్యవస్థాగత సంస్కరణలు, విధాన సమ్మేళనం, క్షేత్రస్థాయి అమలు ద్వారా భారత క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టితో ఈ ప్రత్యేక సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి.
ప్రారంభ సదస్సును ఉద్దేశించి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ ప్రసంగిస్తూ, భారత క్రీడా లక్ష్యాలు క్షేత్రస్థాయి అమలుతోనే సాకారమవుతాయని స్పష్టం చేస్తూ, చర్చలకు దిశానిర్దేశం చేశారు.
"ప్రపంచ క్రీడా శక్తిగా ఎదగడానికి మన పదేళ్ల ప్రణాళిక కాగితాలకే పరిమితం కాకూడదు. అది ప్రతి క్రీడా మైదానంలో, ప్రతి జిల్లాలో, ప్రతి యువ స్వప్నంలోనూ సజీవంగా ఉండాలి" అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు.
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా చింతన్ శిబిరానికి హాజరయ్యారు. భారతదేశాన్ని క్రీడా శక్తి కేంద్రంగా మార్చాలనే దార్శనికతను అభినందించారు.
విధానాలను స్వీకరించడమే కాకుండా చురుకుగా అమలు చేయాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. జిల్లాలు, శిక్షణ వ్యవస్థలు, క్షేత్రస్థాయి క్రీడా వ్యవస్థలలో కనిపించే ఫలితాల ద్వారానే నిజమైన పురోగతిని అంచనా వేస్తామని ఆయన చెప్పారు.
"ఖేలో భారత్ మిషన్ కేవలం అంకె మాత్రమే కాదు, ఇది మన యువత శక్తికి, దేశ నిబద్ధతకు ప్రతిబింబం" అని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా సమాఖ్యల మధ్య దశాబ్దాలుగా ఉన్న అంతరాన్ని తొలగించి, బలమైన సమగ్ర ప్రతిభా వనరులను నిర్మించే దిశగా మరింత సమన్వయం పెంచుకోవాలని డాక్టర్ మాండవీయ పిలుపునిచ్చారు.
సమన్వయం ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ, విద్యా వ్యవస్థతో సమన్వయం ప్రాథమిక దశలో ప్రతిభను గుర్తించడానికి అవసరమని, వ్యాయామ ఉపాధ్యాయులు క్షేత్రస్థాయి క్రీడా వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తారని ఆయన వివరించారు.
"అవకాశాలు అందక ఒక ప్రతిభావంతుడైన చిన్నారి వెనుకబడిపోయినా అది కేవలం వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు, దేశానికే నష్టం" అని ఆయన పేర్కొన్నారు.
జమ్ము కశ్మీర్ వంటి ప్రాంతాలు, ఇతర సవాళ్లతో కూడిన ప్రాంతాలలో క్రీడలు సామాజిక సామరస్యానికి, జాతీయ సమగ్రతకు తోడ్పడే పరివర్తన సాధనాలుగా పనిచేస్తాయని ఆయన అన్నారు.
వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడానికి శిక్షకులకు క్రమం తప్పకుండా ధృవీకరణ, నైపుణ్యాల పెంపు, క్రీడాకారులకు శాస్త్రీయ శిక్షణ, క్రీడా పరిపాలనలో సామర్థ్యాల పెంపు చేపట్టాలని మంత్రి డాక్టర్ మాండవీయ పిలుపునిచ్చారు.
అంతరాయాలు లేని వ్యవస్థ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, "మౌలిక సదుపాయాలు, ప్రతిభ గుర్తింపు, సుశిక్షిత సిబ్బంది ఒక అవిచ్ఛిన్న గొలుసులా కలిసినప్పుడు, ఒలింపిక్ పతకాలు తప్పక వస్తాయి" అని కేంద్ర మంత్రి అన్నారు. క్షేత్రస్థాయి భాగస్వామ్యాన్ని ఉన్నత స్థాయి ప్రదర్శనతో ఒక క్రమబద్ధమైన మార్గం ద్వారా అనుసంధానించాల్సిన అవసరాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.
గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రూపొందించిన యస్-పిఇ (యంగ్ ఎంగేజ్‌మెంట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కార్యక్రమాన్ని డాక్టర్ మాండవీయ ప్రారంభించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులలో క్రీడల్లో భాగస్వామ్యాన్ని, క్రీడాస్ఫూర్తిని నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
క్రీడా శాఖ కార్యదర్శి శ్రీ హరి రంజన్ రావు సమావేశానికి హాజరైన వారందరికీ స్వాగతం పలుకుతూ, సామూహిక ఆలోచనలు, కార్యాచరణకు ఈ శిబిరం ఒక వేదికగా ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.
చింతన్ శిబిరం ప్రాముఖ్యతను వివరిస్తూ, "ఈ సమావేశం కేవలం ఒక సదస్సు మాత్రమే కాదు. ఇది సామూహిక ఆలోచన, సంకల్పం నూతన నిబద్ధతలతో కూడిన సందర్భం" అని అన్నారు.
చింతన్ శిబిరంలో పతకాల సాధన వ్యూహం, విధానాల సమన్వయం, స్వచ్ఛమైన, సురక్షితమైన క్రీడలు, అలాగే ప్రతిభ గుర్తింపు, అభివృద్ధిపై దృష్టి సారించే ప్రత్యేక చర్చా సదస్సులు జరిగాయి.
15 మందికి పైగా రాష్ట్ర క్రీడా మంత్రులు, అడిల్ సుమరివాలా, అభినవ్ బింద్రా, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఈ చింతన్ శిబిరానికి హాజరయ్యారు. వీరు తమ ఆలోచనలను పంచుకోవడం ద్వారా, భారత క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడానికి, సహకార విధాన చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి ఉన్న సామూహిక నిబద్ధతను ప్రతిబింబించారు.
క్రీడాకారుల కోసం ఏకాభిప్రాయ విధానాలను రూపొందించే ఈ ప్రయత్నాన్ని వివిధ రాష్ట్రాల క్రీడా మంత్రులు,అభినందించారు. భారతదేశంలో పటిష్టమైన క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, బలోపేతం చేయడానికి ఈ నమూనాను దేశంలోని వివిధ ప్రాంతాలలో అమలు చేయవచ్చని వారు చెప్పారు.
మౌలిక సదుపాయాల బలోపేతం, కోచింగ్ వ్యవస్థల మెరుగుదల, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, నైతికమైన, సురక్షితమైన క్రీడా వాతావరణాన్ని నిర్ధారించడం, అలాగే పాఠశాలలు, అకాడమీలు, ఎలైట్ శిక్షణ కేంద్రాలను అనుసంధానిస్తూ శాస్త్రీయమైన, సాంకేతికతతో కూడిన ప్రతిభా వనరుల వ్యవస్థను నిర్మించడంపై ఈ చర్చలు ప్రత్యేక దృష్టి సారించాయి.
ఈ సమావేశాలు ప్రతిభను గుర్తించడం నుంచి ఉన్నత స్థాయి శిక్షణ వరకు క్రీడాకారుల అభివృద్ధిలో నిర్మాణాత్మక మార్గాల, సంస్థాగత అనుసంధానాల ప్రాముఖ్యతను కూడా స్పష్టం చేశాయి.
విధానాల అమలుతో క్షేత్రస్థాయిలో కొలవదగిన ఫలితాలను సాధించడానికి రాష్ట్రాల మధ్య స్థిరమైన పర్యవేక్షణ, మూల్యాంకనం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ఎంతో అవసరమని కూడా వక్తలు అభిప్రాయపడ్డారు.
భారత్ ను ప్రపంచ క్రీడా శక్తిగా మార్చాలనే దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా బలమైన, సమ్మిళితమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న క్రీడా వ్యవస్థను నిర్మించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత భాగస్వాములందరితో కూడిన సమైక్య , సమన్వయ విధానం ప్రాముఖ్యతను ఈ చర్చలు పునరుద్ఘాటించాయి.


***
(రిలీజ్ ఐడి: 2255638)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11