నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
పూణేలో లింగ సమానత్వంపై ఆసియాలోనే తొలి యునెస్కో చైర్‌ను ప్రారంభించిన శ్రీ జయంత్ చౌదరి
సమ్మిళిత నైపుణ్య వ్యవస్థల కోసం అంతర్జాతీయ నేతల పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
24 APR 2026 7:07PM by PIB Hyderabad
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి పూణేలో నేడు లింగ సమానత్వం, నైపుణ్యాభివృద్ధిపై ఆసియాలోనే మొట్టమొదటి యునెస్కో చైర్‌ను విజయవంతంగా ప్రారంభించారు. పూణేలోని సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (సింబయాసిస్ నైపుణ్యాల, వృత్తి విద్యా విశ్వవిద్యాలయం-ఎస్‌ఎస్‌పీయూ)లో యునెస్కో సహకారంతో నిర్వహించిన ‘‘ఉమెన్ లీడింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ వర్క్’’ అనే అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ప్రతిష్టాత్మక యునెస్కో చైర్‌ను శ్రీ జయంత్ చౌదరి అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అదితి తత్కరే, నార్వే కాన్సుల్ జనరల్ శ్రీమతి మోనికా నాగెల్‌గార్డ్ , ఎస్‌ఎస్‌పీయూ ప్రో-ఛాన్సలర్ డాక్టర్ స్వాతి ముజుందార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సదస్సును ఉద్దేశించి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి ప్రసంగిస్తూ.. ‘‘దేశ అభివృద్ధి పథం కేవలం విస్తరణపైనే కాకుండా, మన ప్రజలను మనం ఎంత సమగ్రంగా సాధికారులను చేస్తామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి యునెస్కో చైర్ వంటి కార్యక్రమాలు.. సెమీకండక్టర్లు, అధునాతన తయారీ, నూతన సాంకేతికతల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళలు ముందు వరుసలో ఉండేలా నిర్ధారిస్తాయి. నైపుణ్య శిక్షణ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా, సమానత్వ ప్రాతిపదికన ఉన్నప్పుడు, అది ఆర్థిక పురోగతికి, సామాజిక మార్పునకు శక్తిమంతమైన సాధనంగా మారుతుంది" అని పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గాల మహిళలకు చేరువవ్వడం, వారికి నిజమైన అవకాశాలను కల్పించే నైపుణ్యాలను అందించే దిశగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్నిమహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అదితి తత్కరే అభినందించారు. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్రతను, దీర్ఘకాలిక సాధికారతను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో కీలకమని ఆమె చెప్పారు.
‘‘విమెన్ లీడింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్” (ఉద్యోగ భవిష్యత్తుకు మహిళల నాయకత్వం) అనే అంశంపై నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు.. ప్రపంచ స్థాయి సంస్థలు, విధానకర్తలు, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. అభివృద్ధి చెందుతున్న రంగాల్లో, భవిష్యత్తు ఉద్యోగ పాత్రల్లో మహిళల భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంపై ఈ సదస్సు సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా యునెస్కో చైర్ విజయవంతంగా ప్రారంభం కావడం, ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, సమగ్ర శ్రామిక శక్తి మార్పులో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. ఈ సదస్సులో రక్షణ సాంకేతికత, రోబోటిక్స్ పరిశ్రమ 4.0, కృత్రిమ మేధ, సెమీ కండక్టర్, ప్రపంచ స్థాయి సామర్థ్య కేంద్రాలు వంటి అత్యాధునిక రంగాల్లో భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో ముఖ్య వక్తలుగా, ప్యానెలిస్టులుగా పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. వాణిజ్య, పెట్టుబడుల కమిషనర్ (దక్షిణాసియా) శ్రీమతి మేరీ ఓవరింగ్టన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ నైపుణ్య నిపుణుడు శ్రీ గాబ్రియేల్ బోర్డాడో, పారిస్‌లోని యునెస్కో గ్లోబల్ స్కిల్స్ అకాడమీకి చెందిన శ్రీమతి సోలెడాడ్ పాటినో, జర్మనీలోని యునెస్కో-యునెవోక్‌కు చెందిన శ్రీమతి ప్రిస్సిల్లా వాంజికు గటోన్యే వంటి ప్రపంచ నిపుణులు కీలక ప్రసంగాలు చేశారు. వీరితో పాటు అనేకమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2255519)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16