సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముంబయికి విస్తరించిన భారత్ టాక్సీ: ముంబయిలో భారత్ టాక్సీ డ్రైవర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ పీయూష్ గోయల్


డ్రైవర్ల సంక్షేమం, డిజిటల్ సాధికారత, వ్యవస్థీకృత పట్టణ రవాణా వ్యవస్థల విస్తరణపై దృష్టి సారించే కార్యక్రమం

నాడు పోస్టు చేయడమైనది: 24 APR 2026 5:12PM by PIB Hyderabad

నగర రవాణా వ్యవస్థను బలోపేతం చేసేలా, డ్రైవర్ల జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి, ముంబై ఉత్తర పార్లమెంటు సభ్యులు శ్రీ పీయూష్ గోయల్ గురువారం (ఏప్రిల్ 23) ముంబైలో ‘‘భారత్ టాక్సీ డ్రైవర్ల ఆన్‌బోర్డింగ్‘‘ (నమోదు) కార్యక్రమాన్ని ప్రారంభించారు. కండివలి పశ్చిమలోని కమలా విహార్ స్పోర్ట్స్ క్లబ్‌లో నిర్వహించిన  ఈ కార్యక్రమంలో  వందలాది మంది ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్లు, రవాణా సంఘాల ప్రతినిధులు, సహకార సంఘాల సభ్యులు భారీగా పాల్గొన్నారు. డ్రైవర్ల భాగస్వామ్యాన్ని పెంచే, పారదర్శకతను మెరుగుపరిచే, మెరుగైన సంపాదన అవకాశాలను కల్పించే వ్యవస్థీకృత డిజిటల్ వేదికల అందుబాటును విస్తరించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

 

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార, సాంకేతిక ఆధారిత నమూనాలు అత్యంత కీలకమని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. డిజిటల్ సాధనాల ద్వారా పారదర్శకతను పెంచడంలో, డ్రైవర్ల ఆదాయాన్ని, కార్మికుల గౌరవాన్ని పెంపొందించడంలో, డ్రైవర్లను భాగస్వాములుగా చేయడంలో భారత్‌ టాక్సీ వేదిక ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు దేశ పట్టణ రవాణా వ్యవస్థల భవిష్యత్తు దిశానిర్దేశాన్ని ప్రతిబింబిస్తాయని ఆయన తెలిపారు.

 

ప్రధాన నగరాల్లో డ్రైవర్లకు ప్రాధాన్యతనిచ్చే రవాణా వ్యవస్థలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకరించడం, పనితీరులో సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నిరంతరాయంగా రైడ్ డిమాండు‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డ్రైవర్లు, ప్రయాణికులకు ఒక స్థిరమైన, సమ్మిళిత వ్యవస్థను నిర్మించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే ఢిల్లీ ఎన్‌సీఆర్, గుజరాత్, చండీగఢ్, లక్నో వంటి నగరాల్లో విస్తరించిన ఈ వ్యవస్థలో ఇప్పుడు ముంబై కూడా చేరింది.

 

ఇటీవలి కార్యాచరణ సూచికలు ఈ వేదిక వృద్ధిని ప్రతిబింబిస్తున్నాయి. నగరాల వ్యాప్తంగా ప్రతి నెలా 5.17 లక్షలకు పైగా డ్రైవర్లు ఇందులో భాగస్వాములుగా ఉండగా, 50 లక్షలకు పైగా వినియోగదారులు ఇందులో నమోదయ్యారు. వివిధ నగరాల్లో ప్రతి నెల దాదాపు 10 లక్షల రైడ్లు విజయవంతంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా భారత్ టాక్సీ ముఖ్య కార్యనిర్వహక అధికారి శ్రీ వివేక్ పాండే మాట్లాడుతూ.. ముంబై తమకు అత్యంత కీలకమైన మార్కెట్ అని, ఇక్కడి స్థానిక డ్రైవర్ సంఘాల నుంచి లభించిన అపారమైన మద్దతు తమ విస్తరణ ప్రణాళికలపై నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. నగరంలో పటిష్టమైన డ్రైవర్ వ్యవస్థను నిర్మించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

 

రాబోయే మూడేళ్లలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో భారత్ టాక్సీ సేవలు విస్తరించాలన్న హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా  దార్శనికతకు అనుగుణంగా ఈ విస్తరణ ప్రణాళికలు సాగుతున్నాయి. ఈ జాతీయ వృద్ధి ప్రణాళికలో ముంబై ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. మహానగర ప్రాంతాల్లోని డ్రైవర్లు, ప్రయాణికుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా స్పందించే, సాంకేతికత ఆధారిత, సమ్మిళిత, సహకార రవాణా వ్యవస్థలను రూపొందించడంపై ప్రభుత్వం నిరంతరం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2255507) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati