PIB Backgrounder
జీఎస్టీ సంస్కరణలు: ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి, పోటీతత్వానికి తోడ్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2025 1:36PM by PIB Vijayawada
ముఖ్యాంశాలు
-
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం లోని 9 జిల్లాల్లో 14.5 లక్షల మందికి జీవనాధారం కలిగిస్తున్న మత్స్య రంగానికి ప్రోత్సాహం; పరికరాలు, పెట్టుబడి ఖర్చుల పై జీఎస్టీ తగ్గింపు వల్ల చేపల ఉత్పత్తి, ఎగుమతుల్లో రాష్ట్ర పాత్ర మరింత బలపడనుంది.
-
పాలు, పన్నీర్ పై పన్ను మినహాయింపు: నెయ్యి, వెన్న, ఐస్‌క్రీం ధరలు 5-7% తగ్గింపు. దీంతో 24 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి.
-
వాహన రంగానికి ప్రోత్సాహం - కార్లు, బైక్‌లు ఆటోల ధరలు దాదాపు 8% తగ్గాయి. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం లోని ఆటో హబ్ లకు మద్దతు.
-
ఫార్మా & మెడ్‌టెక్ రంగానికి ఉపశమనం : 250 పైగా ఔషధ యూనిట్లు, 100కి పైగా పరికరాల తయారీదారులకు ఊరట. 7-13% వరకు తగ్గిన ఆరోగ్య సంరక్షణ ఖర్చులు. 80కు పైగా దేశాలకు ఎగుమతులు విస్తరించే అవకాశం.
ప్రాథమిక సమాచారం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ విశాఖపట్నం మత్స్య నౌకాశ్రయాల నుంచి అనంతపురం, చిత్తూరులోని ఆటోమొబైల్ పరిశ్రమల వరకు, అరకు వ్యాలీ కాఫీ తోటల నుంచి కొండపల్లి, ఏటికొప్పాక హస్తకళా కేంద్రాల వరకు, సాంప్రదాయ జీవనోపాధులు ఆధునిక పరిశ్రమల ప్రత్యేకమైన సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. ఇటీవలి జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వల్ల ఈ రంగాలన్నిటికీ విస్తృతమైన ఊరటను అందిస్తోంది.
తక్కువ పన్ను రేట్లు వినియోగదారులకు ఖర్చులను తగ్గిస్తాయి, ఎమ్ఎన్ఎమ్ఈ (MSME)లకు మూలధనాన్ని అందించడం సులభతరం చేస్తాయి, ఎగుమతిదారులకు మార్కెట్ పోటీతత్వాన్ని పెంచుతాయి. ఈ ప్రభావం మత్స్య పెంపకం, పాడి పరిశ్రమ, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, పునరుత్పాదక శక్తి, హస్తకళలు, అలాగే నిత్యావసర వస్తువులు అన్నింటిలో కనిపిస్తుంది. ఈ సంస్కరణ గృహాలు, పరిశ్రమలు – రెండింటికీ చేరుకోవడంతో లక్షలాది మంది ఉపాధిని రక్షించే అవకాశముంది, జీవన వ్యయాన్ని తగ్గించి, గ్రామీణ, పట్టణ ఆంధ్రప్రదేశ్ అంతటా వృద్ధికి, కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తాయనే అంచనాలున్నాయి.

మత్స్య పెంపకం - తీర ఆర్థిక వ్యవస్థ
2022-23లో భారతదేశ మొత్తం చేపల ఉత్పత్తిలో 41% వాటాను ఆంధ్రప్రదేశ్ అందించింది. ఈ రంగం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP)లో 7.4% వాటాను కలిగి ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వంటి తొమ్మిది తీర ప్రాంత జిల్లాల్లో విస్తరించి, దాదాపు 14.5 లక్షల మందికి జీవనాధారంగా నిలుస్తోంది. ఇందులో చేపల్ని శుభ్రం చేయడం, ప్రాసెసింగ్ యూనిట్లు, సహకార సంఘాలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని, తమ కుటుంబాలకు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
చేపల నూనెలు, ఎక్స్‌ట్రాక్టర్లు, సంరక్షించిన ఉత్పత్తులు, ఫిషింగ్ గేర్, డీజిల్ ఇంజన్లు, పంపులు, ఏరేటర్లు, కీలక రసాయనాలపై జీఎస్టీ 12%/18% నుంచి 5% కి తగ్గించారు. దీని వల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గి, చిన్న స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లు, సంప్రదాయ మత్స్య సంఘాలపై భారాన్ని తగ్గిస్తాయి. భారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 30% కంటే ఎక్కువ వాటాను అందిస్తోంది. వీటిలో ప్రధానంగా విశాఖపట్నం ఓడరేవు నుంచి యూఎస్ఏ (34.5%), చైనా(25.3%), యూరోపియన్ యూనియన్, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలకు రవాణా అవుతున్నాయి. ఈ సంస్కరణల వల్ల ఉత్పత్తులు మరింత చౌకగా అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లల్లో పోటీతత్వం పెరుగుతుంది. రాష్ట్ర తీరప్రాంతంలో నివసించే లక్షలాది మంది మత్స్యకార కుటుంబాల జీవనోపాధి మరింత మెరుగవుతుంది.

పాడి పరిశ్రమ
పాల ఉత్పత్తిలో జాతీయంగా 4వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, 24 లక్షల రైతులకు ఉపాధి కల్పిస్తోంది. వీరిలో చాలా మంది మహిళలు స్వయం సహాయ సంఘాలలో, సహకార సంఘాలలో ఉన్నారు. హెరిటేజ్, విజయ వంటి ప్రముఖ బ్రాండ్‌లు రాష్ట్రవ్యాప్తంగా పాల సేకరణ, చిల్లింగ్, ప్రాసెసింగ్, రిటైల్ నెట్‌వర్క్‌లను నెలకొల్పాయి.
జీఎస్టీ తగ్గింపుతో యూటీహెచ్ పాలు, పన్నీర్‌పై పన్నులు 5% నుంచి 0%కి; నెయ్యి, వెన్నపై 12% నుంచి 5%కి, ఐస్‌క్రీమ్‌పై 18% నుంచి 5%కి తగ్గించడంతో, ప్రాసెస్ చేసిన పాల ఉత్పత్తులు ఇప్పుడు 5%-7% చౌకగా లభిస్తున్నాయి. ఇది ఇంటి ఖర్చులను తగ్గింస్తుంది. పండుగల సీజన్ లో డిమాండ్‌ను పెంచుతుంది. కృష్ణా, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లోని పాల రైతులు, స్వయం సహకార సంఘాల నేతృత్వంలోని సహకార సంఘాలకు ఆదాయ అవకాశాలను బలోపేతం చేస్తుంది.
2024లో రూ.713.9 బిలియన్ల విలువైన ఆంధ్ర పాడి మార్కెట్, 2033 నాటికి దాదాపు రెట్టింపు అవుతుందని అంచనా, వేగంగా విస్తరిస్తున్న ఈ రంగానికి ప్రస్తుత పన్ను తగ్గింపులు సమాయానుకూలంగా ఉపయోగపడనున్నాయి.
ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్
ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన ఆటోమొబైల్ కేంద్రంగా అభివృద్ధి చెందింది. కియా, ఇసుజు, హీరో, అశోక్ లేలాండ్ వంటి పెద్ద కంపెనీల తయారీ ప్లాంట్ల వలన అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, నెల్లూరు వంటి జిల్లాల్లో 100కి పైగా ఆటో-కాంపోనెంట్ ఎమ్ఎస్ఎమ్ఈ (MSME) లు ఉన్నాయి. ఈ రంగంలో 11,000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. ఇందులో సుమారు 4,000 మందికి ప్రత్యక్షంగా, 7,000 మందికి పరోక్షంగా ఉపాధిని పొందుతున్నారు. వీరిలో నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లు, ఐటీఐ డిప్లొమా హోల్డర్లు, ఇంజనీర్లు ఉన్నారు.
మూడు చక్రాల వాహనాలు, చిన్న కార్లు, మోటార్‌సైకిళ్లు (350 సీసీ ఇంజిన్ సామర్థ్యం)పై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించారు. ఆటో పార్ట్స్‌పై ఏకరీతిగా 18% పన్నును విధించారు. దీంతో వాహనాల విడిభాగాలు ఇప్పుడు దాదాపు 8% చౌకగా అందుబాటులోకి వచ్చాయి. ఇది వినియోగదారులకు వాహనాలను మరింత అందుబాటులోకి తెస్తుంది. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్ల (OEMs) కు పని మూలధనంపై ఒత్తిడి తగ్గిస్తుంది. యూరప్, అమెరికా, దక్షిణ కొరియా మార్కెట్లకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆటోమొబైల్ ఎగుమతుల పోటీని పెంచుతుంది.
ఫార్మా - లైఫ్ సైన్సెస్
ఆంధ్రప్రదేశ్‌లో 250కి పైగా బల్క్ డ్రగ్, ఏపీఐ యూనిట్లు అనకాపల్లి, విశాఖపట్నం, అచ్యుతాపురం, నాయుడుపేట, పైడిభీమవరం ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో 38 ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం పొందినవి కాగా, 20 యూఎస్ఏఫ్డీఏ (USFDA) నుంచి ఆమోదం పొందినవి. ఈ రంగంలో తయారీతో పాటు పరిశోధనాభివృద్ధి (R&D) కార్యకలాపాలకు సంబంధించి 89,000 మందికి పైగా అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు పనిచేస్తున్నారు.
క్యాన్సర్ కి సంబంధించిన 30 రకాల మందులపై 12% ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలిగించారు. వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించే మందులపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. దీని వలన దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలు మరింత చౌకగా అందుబాటులోకి వస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జీఎస్కే (GSK), లూపిన్, బయోకాన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. . అమెరికా (52%), దక్షిణాఫ్రికా, చైనా ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలు కావడంతో, ఆంధ్రప్రదేశ్ ఫార్మా రంగం ప్రపంచ స్థాయిలో ఒక శక్తివంతమైన కేంద్రంగా నిలుస్తోంది.
ఈ జీఎస్టీ పన్ను తగ్గింపులు వ్యాధుల బారినపడిన వారికి మందుల లభ్యతను పెంచడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లైఫ్ సైన్సెస్ రంగం గ్లోబల్ మార్కెట్లలో మరింత పోటీతత్వాన్ని పెంచుతున్నాయి.

వైద్య పరికరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ఏపీ మెడ్ టెక్ జోన్ (AP MedTech Zone - AMTZ) లో 100కి పైగా తయారీ యూనిట్లు ఉన్నాయి. వీటిలో వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ రంగం దేశంవ్యాప్తంగా విస్తృత సమూహానికి సేవలు అందించడమే కాకుండా, పరిశోధనాభివృద్ధి (R&D), నాణ్యత హామీ, షాప్-ఫ్లోర్ ఉద్యోగాల ద్వారా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది.
థర్మామీటర్లు, ఇతర వైద్య పరికరాలపై జీఎస్టీని 18% నుంచి 5%కి, శస్త్రచికిత్సా పరికరాలు, డయాగ్నస్టిక్ కిట్లు, రీజెంట్లపై 12% నుంచి 5%కి తగ్గించడంతో, ఖర్చులు ఇప్పుడు 7% -13% తక్కువయ్యాయి. ఇది దేశంలోని వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య సేవలను మరింత చవకగా, సులభంగా అందించడంతో పాటు, యూఎస్ ఎఫ్డీఏ (US FDA), సీఈ మార్కింగ్, ఐఎస్ఓ (ISO) వంటి అంతర్జాతీయ ధృవీకరణలతో ఆంధ్రప్రదేశ్ వైద్య పరికరాలు 80కుపైగా దేశాలకు ఎగుమతవుతూ గ్లోబల్ మార్కెట్లలో పోటీతత్వాన్ని బలపరుస్తున్నాయి.
పునరుత్పాదక ఇంధన రంగం
2014–2024 మధ్య సామర్థ్యం ఏడు రెట్లు పెరిగి, కర్నూలు, కడప, అనంతపురం క్లస్టర్లు రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన వినియోగంలో అగ్రగామిగా నిలిపాయి. రాష్ట్రం వద్ద ఉన్న 167 గిగా వాట్ల సామర్థ్యంలో కేవలం 5.6% మాత్రమే ఉపయోగించారు. భవిష్యత్ లో విస్తరణకు గణనీయమైన అవకాశాలున్నాయి. పునరుత్పాదక ఇంధన పరికరాలు, సోలార్ హీటర్లు, కుకర్లు, ఫ్యూయల్ సెల్ వాహనాలపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గించడంతో ప్రాజెక్ట్ ఖర్చులు తగ్గనున్నాయి. ఉదాహరణకు సోలార్ ప్రాజెక్టులలో ప్రతి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి సుమారు 10 పైసలు, పవన విద్యుత్ ప్రాజెక్టులలో 15–17 పైసల వరకు తగ్గవచ్చు. దీని వల్ల పునరుత్పాదక ఇంధనం మరింత చవకగా, సులభంగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. రాష్ట్రం 2030 నాటికి 7.5 లక్షల గ్రీన్ జాబ్స్ సృష్టించే లక్ష్యాన్ని మరింత బలపరుస్తుంది.
హస్తకళలు, జీఐ ఉత్పత్తులు
అరకు కాఫీ
అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 1.5 లక్షల గిరిజన రైతులు కాఫీ సాగు చేస్తున్నారు. వీటిలో జీఐ-ట్యాగ్ చేసిన అరబికా కాఫీ, బ్లూ టొకాయ్ వంటి ప్రత్యేక బ్రాండ్ల ద్వారా దేశీయ మార్కెట్లో ఈ కాఫీ బలమైన గుర్తింపును పొందింది. స్వీడన్, యుఏఇ, ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు ఎగుమతై ఆ దేశాల మార్కెట్లకు కూడా విస్తరించింది. జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించడంతో రిటైల్ ధరలు తగ్గే అవకాశం ఉంది, దీని వలన రైతులు మెరుగైన ఆదాయం పొందుతారు.
ఏటికొప్పాక - కొండపల్లి బొమ్మలు
అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో సంప్రదాయ బొమ్మల తయారీ క్లస్టర్లు వేలాది కుటీర హస్త కళాకారులకు జీవనోపాధిని అందిస్తున్నాయి. కొండపల్లి (2006), ఏటికొప్పాక (2017) బొమ్మలు జీఐ ట్యాగ్‌తో గుర్తింపు పొంది, సాంస్కృతిక, అలంకార ఉత్పత్తులుగా అమ్ముడవుతున్నాయి. భారతీయ ప్రవాస సమాజంలో ప్రత్యేక ఎగుమతి మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించడంతో బొమ్మలు 6%–7% చౌక అయ్యాయి. దీంతో నవరాత్రి పండుగల సమయాల్లో వినియోగదారులకు ఈ బొమ్మలు అందుబాటు ధరల్లోనే లభిస్తాయి. అలాగే ఎగుమతుల్లోనూ పోటీతత్వం కూడ పెరుగుతుంది.
తోలు తోలుబొమ్మలు
అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో మారాఠీ బలిజా సమాజం ఆచరిస్తున్న తోలుబొమ్మల వారసత్వ కళ 2008 నుంచి జీఐ -ట్యాగ్ పొందింది. సంప్రదాయంగా దేవాలయ వేడుకలు, పండుగల సమయంలో మాత్రమే కళకళ లాడే కళాకారులు, ఇప్పుడు ఏడాది పొడవునా ల్యాంప్‌షేడ్లు, వాల్ హ్యాంగింగ్స్, సౌవినీర్స్ వంటి ఉత్పత్తుల ద్వారా ఆదాయం పొందుతున్నారు. జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించడం వల్ల తయారైన వస్తువులు సుమారు 6% చౌక అయ్యాయి. దీని వలన హస్తకళ ప్రదర్శనలు, దుకాణాల ద్వారా కళాకారుల ఆదాయాలు మెరుగవుతున్నాయి.
రాతి శిల్పాలు
గుంటూరు జిల్లాలోని దుర్గి క్లస్టర్ 2017లో జీఐ -ట్యాగ్ పొందింది. ఇది సుమారు 50 మంది విశ్వ బ్రాహ్మణ శిల్పి కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తుంది. నంద్యాలలోని అళ్లగడ్డ క్లస్టర్ 2018లో జీఐ -ట్యాగ్ పొందింది. ఇది 1,000 కిపైగా వారసత్వ శిల్పి, విశ్వకర్మ కుటుంబాల కళాకారులకు ఉపాధిని అందిస్తుంది. ఉత్పత్తుల్లో దేవాలయ విగ్రహాలు, గృహ అలంకరణ, సేకరణ వస్తువులు ఉంటాయి. అవి పిట్స్‌బర్గ్‌లోని శ్రీ వేంకటేశ్వర స్మామి దేవాలయం వంటి ప్రముఖ కొనుగోలుదారులతో పాటు సహా అమెరికా, చైనా , శ్రీలంక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. రాతి శిల్పాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించడం వల్ల ధరలు సుమారు 6% చవకైయ్యాయి. దీంతో దేశీయంగా దేవాలయాల నుంచి డిమాండ్ పెరగనుండడంతో పాటు, ప్రత్యేక ఎగుమతి మార్కెట్లు మరింత విస్తరించనున్నాయి.
ముగింపు
జీఎస్టీ సంస్కరణలు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలకు విస్తృత ఉపశమనం కల్పిస్తాయని భావిస్తున్నారు. ఇది తీరప్రాంత మత్స్యకార కుటుంబాలు, పాడి రైతులు, ఆటో రంగ కార్మికులు, ఫార్మా, మెడ్ టెక్ నిపుణులు, పునరుత్పాదక ఇంధన రంగ నిపుణులు, కళాకారులు, మధ్యతరగతి కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తాయి. పాలు, మందులు, సబ్బులు, నోట్‌బుక్స్, ద్విచక్రా వాహనాలు వంటి రోజువారీ అవసరాలు మరింత అందుబాటులోకి వస్తాయని అంచనా. అదే సమయంలో వాహనరంగం, ఔషధ రంగం, పునరుత్పాదక ఇంధనం, హస్తకళలు వంటి వ్యూహాత్మక రంగాలు కొత్త పోటీతత్వాన్ని పొందుతాయి.
ఈ మార్పులు ఖర్చులను తగ్గించడమే కాక, డిమాండ్‌ను పెంచి, ఎగుమతి సామర్థ్యాన్ని బలపరుస్తాయి. సామాన్య ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ, వైవిధ్యమైన జీవనోపాధులకు మద్దతు కల్పిస్తాయి. 2047 ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ దార్శినికతో సాంప్రదాయ బలాలు, ఆధునిక పరిశ్రమలతో కలిసి డైనమిక్
(రిలీజ్ ఐడి: 2255202)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20