రక్షణ మంత్రిత్వ శాఖ
అత్యాధునిక సాంకేతికతలను భారత్‌తో కలిసి అభివృద్ధి చేయండి, కలిసి ఉత్పత్తి చేయండి.. సురక్షిత జాతీయ ప్రయోజనాలు, అంతర్జాతీయ స్థిరత్వం - క్రియాశీలతే లక్ష్యం: మ్యూనిచ్‌లో జర్మన్ పారిశ్రామిక ప్రముఖులకు పిలుపునిచ్చిన రక్షణ మంత్రి
“పెరుగుతున్న అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో.. విశ్వసనీయత, ఉమ్మడి ప్రయోజనాలు ప్రాతిపదికలుగా భాగస్వామ్యాలు అనివార్యం”
“మార్కెట్ విస్తరణ, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, స్థిరంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక వ్యవస్థ, అంచనానుకూలత, చట్టబద్ధ పాలన పట్ల నిబద్ధతలను భారత్ అందిస్తుంది... ఇది స్వల్పకాలిక అవకాశం కాదు, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రతిపాదన”
“భారత స్వావలంబన అంతర్ముఖమైనది కాదు... విశ్వసనీయ భాగస్వాములతో కలిసి రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి చేయగల సామర్థ్యంగా మేం దీనిని చూస్తున్నాం”
నాడు పోస్టు చేయడమైనది:
23 APR 2026 3:34PM by PIB Hyderabad
అభివృద్ధిలోనూ ఉత్పత్తిలోనూ ఉమ్మడిగా ముందుకు సాగుతూ భారత్‌తో కలిసి నడవాలని, ముఖ్యంగా నైపుణ్యంతో కూడిన అత్యాధునిక సాంకేతికతల రంగంలో భారత్‌తో భాగస్వాములు కావాలని జర్మనీ పారిశ్రామిక రంగాన్ని భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆహ్వానించారు. విశ్వసనీయత, ఉమ్మడి ప్రయోజనాలు ప్రాతిపదికలుగా భాగస్వామ్యాలను నిర్మించుకోవడం అత్యావశ్యకమన్నారు. భౌగోళిక రాజకీయ సమీకరణాల్లో ప్రస్తుత మార్పులు, సరఫరా వ్యవస్థలో అవాంతరాలు, వేగవంతమైన సాంకేతిక పరిణామాలు, పెరుగుతున్న అంతర్జాతీయ అనిశ్చితుల దృష్ట్యా.. అవి అనివార్యమైనవని వ్యాఖ్యానించారు. ఈ ఐరోపా దేశంలో తన తొలి పర్యటన ముగింపు రోజయిన 2026 ఏప్రిల్ 23న... మ్యూనిచ్‌లో నిర్వహించిన రక్షణ పెట్టుబడిదారుల సదస్సులో భారత్, జర్మనీ రక్షణ రంగ పారిశ్రామిక ప్రముఖులనుద్దేశించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు.
అవసరాల కోసం ఇతరులపై ఆధారపడే విధానాన్ని వివిధ దేశాలు, పరిశ్రమలు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పునఃసమీక్షించుకుంటున్నాయని, తమ సరఫరా వ్యవస్థలను విస్తృతం చేసుకుంటున్నాయని రక్షణ మంత్రి అన్నారు. స్థిరత్వం, అవిచ్ఛిన్నత, పరస్పర నమ్మకాన్ని అందించే విశ్వసనీయ భాగస్వాముల కోసం చూస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో... విస్తరిస్తున్న మార్కెట్, నైపుణ్యం కలిగిన యువశక్తి, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక వ్యవస్థలను భారత్ అందిస్తోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. వీటికి తోడు దేశంలో స్థిరత్వం, అంచనానుకూల విధానాలు, చట్టబద్ధ పాలన వంటి అంశాలు పెట్టుబడిదారులకు భరోసానిస్తాయని వ్యాఖ్యానించారు. అనిశ్చితితో కూడిన ప్రపంచంలో దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయాలకు ఇవే అత్యంత కీలకమైన అంశాలని ఆయన స్పష్టం చేశారు.
రీ-ఆర్మ్ యూరోప్, ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాల ద్వారా ఇంకా పూర్తిస్థాయిలో వినియోగించుకోని విస్తృత అవకాశాలను ప్రస్తావిస్తూ... అధునాతన రాడార్ - సెన్సార్ సాంకేతికత, మల్టీ సెన్సార్లు, కృత్రిమ మేధతో పనిచేసే మానవరహిత వైమానిక వ్యవస్థలు, సోనోబోయ్‌లు, అధిక శక్తితో కూడిన తక్కువ పౌనఃపున్యమున్న జలాంతర్గత ట్రాన్స్మిటర్ల వంటి రంగాల్లో జర్మనీ కంపెనీలతో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి, ఉత్పత్తుల కోసం భారతీయ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ విప్లవాత్మక ప్రస్థానాన్ని రక్షణ మంత్రి వివరించారు. స్పష్టమైన దూరదృష్టి, పటిష్టమైన విధాన నిర్ణయాలు, 140 కోట్ల ప్రజల సమష్టి ఆకాంక్ష ఈ లక్ష్యానికి దన్నుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘బలమైన స్థూల ఆర్థిక పునాది, స్పష్టమైన విధాన నిర్దేశాలతో ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న, స్థిరమైన ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ నిలిచింది’’ అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
భారత స్వావలంబన అంతర్ముఖమైనది కాదని, భాగస్వామ్యానికి సరికొత్త బాటలు వేస్తుందని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. “విశ్వసనీయ భాగస్వాములతో కలిసి భారత్‌లో రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి చేయగల సమర్థతగా మేం దేశ స్వావలంబనను పరిగణిస్తున్నాం. భారత్ కేవలం రక్షణ పరికరాల కొనుగోలుదారుగా మాత్రమే కాకుండా.. రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తిలో భాగస్వామిగా ఎదిగే దిశగా పయనిస్తోంది. ఈ మార్పు ప్రపంచ పరిశ్రమకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది. నేటి పరస్పర అనుసంధాన, పరస్పర ఆధారిత ప్రపంచంలో.. భాగస్వామ్యాలు ఐచ్ఛికం కాదు, ఆవశ్యకం. జర్మనీతో భారత సంబంధాలకు పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలు ఆధారం. పరస్పర ప్రయోజనం, ఉమ్మడి వికాసం, దీర్ఘకాలికంగా విలువను పెంచే భాగస్వామ్యమిది’’ అని ఆయన అన్నారు.
అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే క్రమంలో రక్షణ రంగం ప్రాధాన్యాన్ని భారత్ గుర్తించిందన్న రక్షణ మంత్రి... తన పారిశ్రామిక, సాంకేతిక వ్యూహానికి ఈ రంగాన్ని కేంద్రంగా నిలిపిందని పేర్కొన్నారు. “పరిశ్రమ, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థల మధ్య సహకారానికి రక్షణ పారిశ్రామిక వ్యవస్థ ప్రోత్సాహాన్నిస్తుంది. దీంతో అంకుర సంస్థలు ఏర్పాటవడంతోపాటు అత్యాధునిక సాంకేతికతలు అభివృద్ధి చెందుతాయి. సరఫరా వ్యవస్థలు కూడా బలోపేతమవుతాయి. ఈ విధంగా చూస్తే, పటిష్టమైన రక్షణ పారిశ్రామిక పునాదులు.. దేశ భద్రతతోపాటు ఆర్థికంగా బలోపేతమవడానికి, అంతర్జాతీయంగా పోటీపడేందుకు కూడా దోహదపడుతాయి. బలమైన, ఆధునిక, ఆత్మనిర్భర రక్షణ పారిశ్రామిక పునాదులను నిర్మించాలన్నది మా బలమైన ఆకాంక్ష. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, ఆర్థిక భవిత కోసం ఇది అత్యావశ్యకం’’ అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.
గత దశాబ్ద కాలంగా వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి, పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా భారత్‌ను నిలిపేందుకు ప్రభుత్వం వరుసగా పలు నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టిందని జర్మన్ పారిశ్రామికవేత్తలతో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. “మా విధానాలు పారదర్శకంగా, అంచనానుకూలమైనవిగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయి. మేము మా నిబంధనలను సరళీకరించాం. నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేశాం. మౌలిక సదుపాయాలలో భారీగా పెట్టుబడులు పెట్టాం’’ అని ఆయన వివరించారు.
భారత రక్షణ పారిశ్రామిక రంగాన్ని ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి ఇలా అన్నారు: ‘‘ఒక మార్కెట్‌గా చూస్తే భారత రక్షణ అవసరాలు విస్తృతమైనవి, వచ్చే దశాబ్దాల్లో ఇవి మరింత పెరుగుతాయి. ఒక తయారీ కేంద్రంగా.. తక్కువ ఖర్చుతో ఉత్పత్తిని, నైపుణ్యం కలిగిన మానవ వనరులను, భారీ సరఫరాదారు వ్యవస్థను మేం అందిస్తున్నాం. ఆవిష్కరణల కేంద్రంగా కొత్త సాంకేతికతలను ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు.. మా అంకుర సంస్థల వ్యవస్థ, ఇంజినీరింగ్ ప్రతిభ, డిజిటల్ సామర్థ్యాలు అనువైన వేదికను అందిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, పూణె వంటి నగరాల్లో వైబ్రంట్ సెంటర్లతో ప్రపంచంలో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఉంది. అంకుర భారత్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు ఆవిష్కరణలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయి. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో భాగస్వామిగా.. భారత్‌తో సహకారం వల్ల నష్ట భయం (రిస్క్) తగ్గడమే కాకుండా, క్రియాశీలత పెరుగుతుంది. ఇది కేవలం స్వల్పకాలిక అవకాశం కాదు. ఇదొక దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రతిపాదన.’’
ముఖ్యమైన పారిశ్రామిక భాగస్వామ్యాల ద్వారా భారత్ - జర్మనీ రక్షణ సంబంధాలు మరింత బలపడడాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ముఖ్యంగా ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తిపై పెరుగుతున్న ఆసక్తిని ఆయన ప్రస్తావించారు. ‘‘మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా.. రక్షణ పరికరాల కోసం పటిష్టమైన సరఫరా వ్యవస్థలను నిర్మించే దిశగా రెండు దేశాలు తమ పరిశ్రమలను సమన్వయం చేస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
జర్మనీతో బలమైన, సుస్థిరమైన భాగస్వామ్యం కోసం భారత్ ఎదురుచూస్తోందని రక్షణ మంత్రి తెలిపారు. భారత్-జర్మనీ భాగస్వామ్యంలోని గత అధ్యాయాలను సాంకేతికత, వాణిజ్యం, సంస్కృతి లిఖిస్తే... ఆవిష్కరణ, సామర్థ్యం, వ్యూహాత్మక సహకారం ద్వారా తదుపరి అధ్యాయాన్ని లిఖించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్, జర్మనీ మధ్య బలపడుతున్న రక్షణ సంబంధాలను చాటేలా.. కీల్‌లోని టీకేఎంఎస్ జలాంతర్గామి నిర్మాణ కేంద్రాన్ని 2026 ఏప్రిల్ 22న శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. అధునాతన నౌకాదళ సామర్థ్యాలపై చర్చించుకోవడానికి, భారత రక్షణ ఆధునికీకరణ ప్రాధాన్యాలకు అనుగుణంగా నౌకాదళ సాంకేతికతలో భాగస్వామ్యానికి అవకాశాలను అన్వేషించడానికీ వేదికగా ఈ పర్యటన నిలిచింది.
అంతకుముందు బెర్లిన్‌లో జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్‌తో భారత రక్షణ మంత్రి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఐరోపా దేశంతో వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది. ఈ సమావేశంలో రక్షణ పారిశ్రామిక సహకార ప్రణాళిక, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక శిక్షణలో సహకారం కోసం ఉద్దేశించిన ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేసి, పత్రాలను మార్చుకున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2255025)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4