సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రపంచ ధరిత్రి దినోత్సవం 2026: ‘మన శక్తి, మన భూమి’ వేడుకలు
విద్యార్థుల కోసం జాతీయ సైన్స్ కేంద్రం బహిరంగ క్విజ్ పోటీ నిర్వహణ
అంటార్కిటికా అన్వేషణపై ఇస్రో అంతరిక్ష విభాగం ప్రొఫెసర్ ప్రత్యేక ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
21 APR 2026 11:20AM by PIB Hyderabad
ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే) సందర్భంగా బుధవారం నిర్వహించే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా విద్యార్థులు, సైన్స్ పై ఆసక్తి కలిగిన వారికి ఢిల్లీలోని జాతీయ సైన్స్ కేంద్రం ఆహ్వానం పలుకుతోంది. ‘మన శక్తి, మన భూమి’ అనే ప్రపంచ ఇతివృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. మన పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మన సమష్టి బాధ్యతను ఈ కార్యక్రమం గుర్తుచేస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ‘‘అంటార్కిటికా అన్వేషణ: మంచు ఖండానికి ప్రయాణం’’ అనే అంశంపై ఒక ప్రత్యేక సైన్స్ ప్రసంగం ఉంటుంది. ఇస్రో అంతరిక్ష విభాగంలో ప్రముఖ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ అమితావ సేన్ గుప్తా ఈ ప్రసంగం చేస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రసంగంలో అంటార్కిటికా ఖండంలోని శాస్త్రీయ రహస్యాల గురించి ఆయన వివరిస్తారు.
ప్రొఫెసర్ ప్రసంగం అనంతరం ఉదయం 11:00 గంటలకు బహిరంగ క్విజ్ పోటీని జాతీయ సైన్స్ కేంద్రం నిర్వహిస్తుంది. పర్యావరణ శాస్త్రం, భూమిపై ఉన్న జీవవైవిధ్యం గురించి విద్యార్థులకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకోవడానికి ఈ పోటీని ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థుల్లో శాస్త్రీయ జిజ్ఞాసను, ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించడానికి ఈ పోటీ ఉపయోగపడనుంది.
విద్యార్థులను ప్రముఖ శాస్త్రవేత్తలు, నిపుణులతో మమేకం చేయడం ద్వారా వారిలో స్ఫూర్తిని నింపడమే జాతీయ సైన్స్ కేంద్రం ముఖ్య ఉద్దేశ్యం. మన భూమిని కాపాడుకోవడంలో సైన్స్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో విద్యార్థులకు వివరించడం, వారిని అన్వేషణ దిశగా ప్రోత్సహించడం కోసం ఇటువంటి కార్యక్రమాలను చేపడుతోంది.
కార్యక్రమ వివరాలు:
తేదీ: 22 ఏప్రిల్, 2026
సమయం: ఉదయం 10:00 గంటల నుంచి
వేదిక: జాతీయ సైన్స్ కేంద్రం, ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ
సంప్రదించాల్సినవారు: దినేష్ మాలిక్, విద్యాధికారి, మొబైల్: +91 98996 52233
***
(రిలీజ్ ఐడి: 2254143)
సందర్శకుల సూచీ సంఖ్య : : 102