వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భారత్: దక్షిణ కొరియా అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యూంగ్
సీఈపీఏ చర్చల నేపథ్యంలో రెట్టింపు కానున్న భారత్-కొరియా వాణిజ్యం: శ్రీ లీ జే మ్యూంగ్
ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పెంపొందించేందుకు భారత్-కొరియా పారిశ్రామిక సహకార కమిటీపై అవగాహన ఒప్పందం కీలక మైలురాయి: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు భారత్-కొరియా వ్యాపార సదస్సులో 16 అవగాహన ఒప్పందాలపై సంతకాలు
పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్‌లో కొరియా ఎన్‌క్లేవ్ ఏర్పాటు... మార్కెట్ లభ్యత , స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్లగ్ అండ్ ప్లే టౌన్‌షిప్‌పై భారత్-కొరియా నాయకుల చర్చ: శ్రీ పీయూష్ గోయల్
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 54 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడమే భారత్-కొరియా లక్ష్యం...ఆర్థిక సహకారంలో తదుపరి దశను ఆవిష్కరించాలని పిలుపు: శ్రీ పీయూష్ గోయల్
సీజీపీఏను వేగవంతంగా ఆధునీకరించనున్న భారత్, కొరియా... మార్కెట్ లభ్యత, వ్యాపార సౌలభ్యం, అధిక వృద్ధి రంగాలపై దృష్టి: శ్రీ పీయూష్ గోయల్
నాడు పోస్టు చేయడమైనది:
20 APR 2026 6:00PM by PIB Hyderabad
140 కోట్ల జనాభాతో... ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తోందని దక్షిణ కొరియా (ఆర్‌ఓకే) అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యూంగ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన 'భారత్–కొరియా వ్యాపార సదస్సులో ఆయన ప్రసంగిస్తూ... ఇరు దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపార విస్తరణకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చలతోపాటు ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా వృద్ధి చెందడానికి అవకాశం ఉందని అన్నారు. నిరంతర ప్రయత్నాలతో ఇది రెట్టింపు అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కృత్రిమ మేధ రంగంలో భారత్‌కు ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ, పరస్పర సహకారంతో భవిష్యత్తు కోసం అత్యంత సాంకేతికతో కూడిన పరిశ్రమలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే నౌకాయాన రంగంలో కూడా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు.
కేవలం ఆర్థిక సహకారానికే పరిమితం కాకుండా, ఇరు దేశాల ప్రజల మధ్య బలమైన బంధం, నమ్మకాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
భారత్–కొరియా వ్యాపార సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగించారు. భారత్–కొరియా పారిశ్రామిక సహకార కమిటీపై కుదిరిన అవగాహన ఒప్పందం ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఈ కమిటీలో వాణిజ్యం, పరిశ్రమలు, వ్యూహాత్మక వనరులు, స్వచ్ఛమైన ఇంధనం అనే నాలుగు కీలక రంగాలపై వర్కింగ్ గ్రూపులు పనిచేస్తాయని ఆయన తెలిపారు. నేడు జరిగిన ఈ వ్యాపార వేదికలో మొత్తం 16 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని చెప్పారు.
మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించడానికి, కొరియా కంపెనీలు భారత మార్కెట్‌లోకి సులభంగా ప్రవేశించేలా, దేశంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ‘కొరియా ఎన్‌క్లేవ్’ (కొరియా ప్రత్యేక పారిశ్రామిక ప్రాంతం) ఏర్పాటుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యూంగ్ చర్చించినట్లు శ్రీ గోయల్ వెల్లడించారు. గత మూడున్నర ఏళ్లలో 38 అభివృద్ధి చెందిన దేశాలతో కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా సాధ్యమైన భారీ స్వదేశీ డిమాండును, అలాగే ప్రపంచ జీడీపీలో దాదాపు మూడింట రెండు వంతుల వాటాకు భారత్‌కు ఉన్న ప్రాధాన్యతను సద్వినియోగం చేసుకోవడానికి కొరియా కంపెనీలకు ఈ కార్యక్రమం సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
భారత్-దక్షిణ కొరియా మధ్య ప్రస్తుతమున్న 27 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 54 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలని ఇరు దేశాల నాయకత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీ గోయల్ వివరించారు. దీనిని సాధించాలంటే దాదాపు 18 శాతం వార్షిక వృద్ధి రేటు అవసరమని అయన పేర్కొన్నారు. ఈ లక్ష్యం ఇరు దేశాల మధ్య ఉన్న భాగస్వామ్య నిజమైన సామర్థ్యాన్ని పూర్తిగా ప్రతిబింబించదని, ఆర్థిక సహకారంలో తదుపరి దశకు చేరుకోవడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మరింత సమతుల్యమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని సాధించేందుకు, సుంకేతర అడ్డంకులను పరిష్కరించడం, మూల నియమాలను సులభతరం చేయడం, మార్కెట్ ప్రాప్యతను విస్తరించడం, వ్యాపార సౌలభ్యాన్ని పెంచడం వంటి అంశాలతో సహా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఆధునీకరించడానికి ఇరు దేశాలు ఫాస్ట్ ట్రాక్, మిషన్-మోడ్ విధానంలో పనిచేయడానికి అంగీకరించాయని మంత్రి తెలిపారు.
సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆధునిక తయారీ రంగం, ఈ-మొబిలిటీ, హరిత ఇంధనం, నౌకా నిర్మాణం, డిజిటల్ వాణిజ్యం వంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సహ-ఉత్పత్తి , సహ-రూకల్పన, సహ-ఆవిష్కరణల ద్వారా రెండు దేశాలు కలిసి పనిచేయాలని, తద్వారా ప్రపంచ మార్కెట్లకు నాణ్యమైన, సరసమైన ధరల ఉత్పత్తులను అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.
భారతదేశ ఆర్థిక ప్రస్థానాన్ని వివరిస్తూ.. శ్రీ పీయూష్ గోయల్ ఇలా పేర్కొన్నారు. ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడమే లక్ష్యమని అన్నారు. భారీ సంఖ్యలో ఉన్న ప్రతిభావంతులైన యువత, 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు, పెరుగుతున్న ఆదాయాలతో వేగంగా విస్తరిస్తున్న మధ్యతరగతి ఆదాయం వంటి అంశాల వల్ల వ్యాపారాలకు ఇది జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే లభించే అద్భుత అవకాశమని ఆయన అభివర్ణించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పటికీ, భారత్ మాత్రం ఎంతో స్థిరంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేతమైన సంస్కరణలు, మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు, అనవసర నిబంధనలను, అడ్డంకులను తొలగించడం, వ్యాపార సౌలభ్యం కోసం బలమైన విధానపరమైన ప్రోత్సాహం కారణంగా భారత్ స్థిరత్వానికి కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు.
భారత్- దక్షిణ కొరియా మధ్య సంబంధాలు నిన్న మొన్నటివి కావని, ఇవి రెండు వేల ఏళ్ల నాటివని శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకం, ప్రజాస్వామ్య విలువలు, పురాతన సాంస్కృతిక బంధాలే ఈ స్నేహానికి పునాదులని అన్నారు. భారత వృద్ధిలో కొరియన్ కంపెనీలు పోషిస్తున్న పాత్రను, వారు సాధించిన విజయాన్ని ఆయన అభినందించారు.
ఈ పర్యటన భారత్-కొరియా సంబంధాలలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని శ్రీ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఇరు దేశాలు కలిసి పనిచేస్తూ, పరస్పర పురోభివృద్ధిని సాధించాలని ఆయన ఆకాంక్షిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఫిక్కీ (ఎఫ్‌ఐసీసీఐ) అధ్యక్షుడు, ఆర్‌పీజీ గ్రూపు ఉప ఛైర్మన్ శ్రీ అనంత్ గోయెంకా మాట్లాడుతూ.. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ వరకు భారత్‌లో ఉన్న భారీ మార్కెట్ స్థాయి, కొరియా వద్ద ఉన్న నూతన ఆవిష్కరణల శక్తితో అద్భుతంగా సరిపోతుందని అన్నారు. ఇరు దేశాలు కలిసి భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఒక దృఢమైన ఆర్థిక కారిడార్‌ను నిర్మించగలవని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ మారుతున్న తరుణంలో.. భారత్, కొరియాలకు ఒక ప్రత్యేక అవకాశం ఉందని గోయెంకా తెలిపారు. బాహ్య ఒత్తిళ్లకు లేదా సంక్షోభాలకు తలొగ్గకుండా, దీర్ఘకాలంపాటు బలంగా నిలబడగలిగేలా.. వైవిధ్యమైన, కొత్త ఆలోచనలతో కూడిన ఒక బలమైన ఆర్థిక కారిడార్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2253970)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7