వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో రిలీఫ్ పథకం పరిధిని విస్తరించిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
17 APR 2026 7:11PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్ర రవాణాపై పడుతున్న నిరంతర ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రిలీఫ్ (ఎగుమతుల సులభతరం కోసం ప్రతిస్పందన సామర్థ్యం, రవాణా చర్యలు) పథకం కింద అర్హత కలిగిన దేశాల జాబితాను ప్రభుత్వం విస్తరించింది. ఇది ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం) కింద చేపట్టిన ఒక కాలపరిమితితో కూడిన కార్యక్రమం.
గల్ఫ్, పశ్చిమాసియా సముద్ర మార్గాల్లో తలెత్తిన అంతరాయాల వల్ల తీవ్రంగా పెరిగిన సరుకు రవాణా ఛార్జీలు, అధికమైన బీమా ప్రీమియంలు, యుద్ధ సంబంధిత ఎగుమతి ముప్పుల వల్ల ప్రభావితమైన భారతీయ ఎగుమతిదారులకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో 2026 మార్చి 19న రిలీఫ్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం అంతరాయాల కాలంలో ఇప్పటికే జరిగిన రవాణాతోపాటు భవిష్యత్తులో జరగబోయే ఎగుమతులతో సహా ఎగుమతి వ్యవస్థ అంతటా క్రమబద్ధమైన మద్దతును అందిస్తుంది.
రిలీఫ్ పథకం ఈసీజీసీ సంస్థగా అమలు అవుతోంది.. దీని ద్వారా ఇప్పటికే బీమా ఉన్న ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడంతో పాటు, కొత్తగా పంపే సరుకులకు బీమా సౌకర్యం కల్పిస్తారు. ముఖ్యంగా రవాణా ఛార్జీలు, బీమా అదనపు భారంపెరగడం వల్ల ఇబ్బంది పడుతున్న ఎంఎస్‌ఎంఈ ఎగుమతిదారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఈ పథకం పరిధిని పెంచుతూ తాజాగా ఈజిప్ట్, జోర్డాన్ దేశాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. రిలీఫ్ పథకం నిబంధనల ప్రకారం ఈ దేశాలకు నేరుగా పంపే సరుకులకు లేదా అక్కడ ఆగి వేరే చోటికి వెళ్లే సరుకులకు కూడా దీని ప్రయోజనాలు అందుతాయి.
అంతేకాకుండా 2026 ఏప్రిల్ 15న విడుదల చేసిన కొత్త ప్రకటన ద్వారా ఈసీజీసీ బీమా మద్దుతుకు సంబంభించి రిలీఫ్ పథకంలోని భాగం-II పరిధిని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026 మార్చి 16 తర్వాత కొత్తగా ఈసీజీసీ మొత్తం టర్నోవర్ పాలసీ తీసుకున్న ఎగుమతిదారులు కూడా భాగం-II కింద బీమా మద్దతు పొందడానికి అర్హులు. ఈ వివరణ ద్వారా మరింత స్పష్టతనివ్వడంతోపాటు.. కొత్తగా ఎగుమతి వ్యాపారంలోకి వచ్చేవారు లేదా కొత్తగా పాలసీ తీసుకున్న వారు కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇచ్చారు.
ఈ చర్యలు ఆ ప్రాంతంలో మారుతున్న అంతర్జాతీయ వాణిజ్య, రవాణా పరిస్థితులపై ప్రభుత్వం నిరంతరంగా చేస్తున్న సమీక్షను, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాయి. రిలీఫ్ పథకం పరిధిని భౌగోళికంగా విస్తరించడం ద్వారా పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ఎగుమతులు చేసే వారికి ప్రస్తుత అంతరాయాల సమయంలో తగిన మద్దతు లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఈ విస్తరణ వల్ల ఎగుమతి రంగం మరింత బలోపేతం అవుతుందని, వాణిజ్య ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతుందని, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య భారతీయ ఎగుమతిదారులకు గొప్ప అండగా నిలుస్తుందని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2253234)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7