రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో ముగిసిన సైన్య కమాండర్ల సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
17 APR 2026 11:27AM by PIB Hyderabad
ప్రతి ఏటా రెండు సార్లు నిర్వహించే సైన్య కమాండర్ల సమావేశాన్ని (ఏసీసీ) ఈ సంవత్సరం ఏప్రిల్ 13న మొదలుపెట్టి, ఏప్రిల్ 16న పూర్తి చేశారు. సైన్య దళాల ప్రధానాధికారి (సీఓఏఎస్) అధ్యక్షత వహించారు. సైన్యంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కేబినెట్ సెక్రటరీ, రక్షణ దళాల ప్రధానాధికారి, ఎన్ఎస్ఏబీ చైర్మన్ సహా సీనియర్ అధికారులతో పాటు నౌకాదళ ప్రధానాధికారి ప్రసంగించారు. ‘రాబోయే కాలానికి దళాలను సన్నద్దంగా ఉంచే’ దృష్టికోణానికి అనుగుణంగా భారత సైన్యం 2026 సంవత్సరాన్ని ‘నెట్‌వర్కింగ్, డేటా సెంట్రిసిటీ సంవత్సరం’గా ప్రకటించింది.
ఈ సమావేశంలో ఆధునికీకరణ, యుద్ధ కార్యకలాపాల్లో సాంకేతికత వినియోగం, సిద్ధాంతాలు, శిక్షణ సంబంధ అవసరాలు, వీటితో పాటే నిర్వహణ కార్యకలాపాల సన్నద్ధతను మెరుగుపరచడం, సరికొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కోవడం కోసం నెట్‌వర్కింగ్, డేటా సెంట్రిసిటీ వంటి వివిధ అంశాలపై చర్చించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అందివచ్చిన పాఠాలు, ప్రపంచమంతటా నెలకొన్న వర్తమాన స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటూ, సైన్యంలోని సీనియర్ నాయకత్వం మానవ రహిత వాయు వ్యవస్థలు, (యూఏఎస్) మానవ రహిత వాయు వ్యవస్థల నిరోధ ప్రణాళిక (సీ-యూఏఎస్)ల ఉపయోగం సహా నిర్వహణ సామర్థ్యానికి సంబంధించిన ఆవశ్యకతపై కూడా దృష్టిని కేంద్రీకరించారు.
వక్తల్లో ప్రముఖులు మారుతున్న భౌగోళిక-రాజకీయ వాతావరణంతో పాటు సరికొత్తగా తెరమీదకు వస్తున్న ప్రపంచ, ప్రాంతీయ, అంతర్గత భద్రతలకు సంబంధించిన కోణాలను వివరించారు. ప్రపంచ సంఘర్షణల నుంచి నేర్చుకున్న పాఠాలను వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, భారత వ్యూహాత్మక, భద్రత సంబంధి హితాలను ఖచ్చితంగా కాపాడుకోవడాన్ని నిర్ధారించడం కోసం ‘‘కఠోర శక్తి’’ని రూపొందించుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. వారు అంతర-మంత్రిత్వ స్థాయి సమన్వయం, పౌర-సైన్య సంస్థల మధ్య మెరుగైన సమన్వయంతో పాటు సంక్లిష్ట భద్రతా సవాళ్లకు సమన్వయపూర్వక జాతీయ పరిష్కారాన్ని వెతకడం కోసం ‘‘సమగ్ర దేశ వైఖరిని అవలంబించాలని కూడా సూచించారు. సరఫరాల వ్యవస్థ ప్రస్తుతం సంక్షోభానికి గురైనందువల్ల, దీర్ఘకాలిక వ్యూహాత్మక పటిష్ఠతను నిర్ధరించడానికి రక్షణ రంగంలో స్వయంసమృద్ధిని బలోపేతం చేసుకోవాలనీ, స్వదేశీ ఉత్పాదన సామర్థ్యాల్ని పెంపొందించుకోవడం తక్షణావసరమని చర్చల్లో తీర్మానించారు.
***
(రిలీజ్ ఐడి: 2252930)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16