రాజ్యసభ సచివాలయం
azadi ka amrit mahotsav

శ్రీమతి మొహ్‌సినా కిద్వాయి, శ్రీమతి ఆశా భోస్లే కన్నుమూత సందర్భంగా సంతాప తీర్మాన పాఠాన్ని రాజ్యసభలో చదివిన సభాధ్యక్షుడు శ్రీ సి.పి. రాధాకృష్ణన్

నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2026 3:22PM by PIB Hyderabad

చైర్మన్: గౌరవ సభ్యులారా, ఈ సభలో పూర్వ సభ్యురాలు శ్రీమతి మొహ్‌సినా కిద్వాయి గారు 94 ఏళ్ల వయసులో 2026 ఏప్రిల్ 8న కన్నుమూశారని అత్యంత విచారంతో తెలియజేస్తున్నాను. ఆమె ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి రెండు సార్లు.. 2004 నుంచి 2010 మధ్య, అలాగే 2010 నుంచి 2016 వరకూ.. ప్రాతినిధ్యం వహిస్తూ, రాజ్యసభకు సేవలను అందించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో 1932 జనవరి 1న జన్మించిన శ్రీమతి మొహ్‌సినా కిద్వాయి గారు చాలా చిన్న వయసులోనే ప్రజాజీవనంలో అడుగుపెట్టి, ఆరు దశాబ్దాలకు పైగా చక్కని రాజకీయ వృత్తి జీవనాన్ని సాగించారు. తన ప్రఖ్యాత వృత్తి జీవన క్రమంలో, నాలుగు వేర్వేరు చట్టసభలకు.. ఉత్తరప్రదేశ్‌లోని ఉభయ సభలతో పాటు పార్లమెంటు ఉభయ సభలకు కూడా.. సేవలను అందించే గౌరవాన్ని ఆమె దక్కించుకున్నారు.
శ్రీమతి మొహ్‌సినా కిద్వాయి గారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా అనేక శాఖలను నిర్వహించారు. ప్రజా జీవనానికి ఎనలేని సేవ చేశారు. సమాజంలో బలహీన వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేశారు.
ఆమె మృతితో, చిరకాల అనుభవమున్న లెజిస్లేటరునూ, సమర్థ పరిపాలకురాలునూ, విశిష్ట పార్లమెంటేరియనునూ  దేశ ప్రజలు  కోల్పోయారు.
చైర్మన్: గౌరవ సభ్యులారా, భారతదేశంలో అత్యంత ప్రముఖ, బహుముఖ ప్రజ్ఞ‌ గల నేపథ్య గాయకురాళ్లలో ఒకరైన శ్రీమతి ఆశా భోంస్లే గారు 92వ ఏట 2026 ఏప్రిల్ 12న కన్నుమూశారని అత్యంత దు:ఖంతో తెలియజేస్తున్నాను.
మహారాష్ట్రలోని సాంగ్లిలో 1933 సెప్టెంబరు 8న జన్మించిన శ్రీమతి ఆశా భోస్లే గారు సినిమా రంగంతో పాటు సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక సాటి లేని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎనిమిది దశాబ్దాలకు పైగా విస్తరించిన వృత్తిజీవనంలో ఆమె అనేక భారతీయ భాషల్లో వేలకొద్దీ పాటలకు మధురమైన స్వరాన్ని జోడించి, భారతీయ సంగీత లోకంలో చెరిగిపోని ముద్రను వదలి, మన నుంచి సెలవు తీసుకున్నారు.
సంగీత రంగానికి ఆమె అందించిన అపార సేవలకు గుర్తింపుగా, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం, జాతీయ చలనచిత్ర పురస్కారాలు సహా అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో ఆమెను సత్కరించుకున్నాం. దీనికి అదనంగా ఆమె జాతీయ, అంతర్జాతీయ సత్కారాలను కూడా అసంఖ్యాకంగా అందుకున్నారు. ఔత్సాహిక కళాకారులకు ప్రేరణామూర్తిగా మారడంతో పాటు, అంకిత భావం, శ్రేష్ఠత్వం, కళాత్మక కౌశలానికి ప్రతీకగా నిలిచారు.
ఆమె బాధాకర నిష్క్రమణతో, దేశం ఒక దిగ్గజ గళాన్ని, అనుపమ కళాకారిణిని దూరం చేసుకుంది. ఆమె ఒక సాంస్కృతిక దూత. ఆమె వారసత్వం భావి తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
శ్రీమతి మొహ్‌సినా కిద్వాయి, శ్రీమతి ఆశా భోంస్లే మనను వీడి వెళ్లినందుకు మనమెంతగానో దు:ఖిస్తున్నాం.
సభ్యులంతా వారి వారి స్థానాల్లో నుంచి లేచి నిల్చొని దివంగత ప్రముఖులను స్మరించుకొనేందుకు గౌరవపూర్వకంగా మౌనం పాటించాల్సిందిగా నేను కోరుతున్నాను.
(మౌనాన్ని పాటించిన అనంతరం)
చైర్మన్: శోకసంతప్తులైన కుటుంబాల సభ్యులకు మన ప్రగాఢ సంతాపాన్నీ, సానుభూతినీ  సెక్రటరీ-జనరల్ తెలియజేస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2252651) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati