వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఎరువుల్లో ఆత్మనిర్భరతను సాధించే ప్రణాళికను అభివృద్ధి చేయడంలో మేధోమథనాన్ని నిర్వహించిన జాతీయ వ్యవసాయ విజ్ఞాన సంస్థ
2047 నాటికి ఆత్మనిర్భర భారత్‌ను సాధించడంలో వ్యవసాయం రంగానిది కీలకపాత్ర: డీఏఆర్ఈ కార్యదర్శి డాక్టర్ ఎంఎల్ జాట్
సుస్థిర వ్యవసాయానికి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు భూసారాన్ని, ఎరువుల సమతుల వాడకాన్ని, రైతుల్లో అవగాహనను పెంపొదించడం అవసరం: డాక్టర్ జాట్
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2026 6:13PM by PIB Hyderabad
ఎరువుల్లో ఆత్మనిర్భరతను పెంపొందించే దిశగా విధివిధానాలను రూపొందించడంపై జాతీయ వ్యవసాయ విజ్ఞాన సంస్థ (ఎన్ఏఏఎస్) ఈ రోజు మేధోమథన సమావేశాన్ని నిర్వహించింది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు, ఎరువుల సంస్థలకు చెందిన ప్రతినిధులు, రైతులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అత్యంత కీలకమైన ఈ రంగంలో ఆత్మనిర్భరత సాధించాల్సిన ఆవశ్యకత గురించి తమ అభిప్రాయాలను స్పష్టంగా వివరించారు.
ఈ కార్యక్రమం అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో వ్యవసాయం, రైతు సంక్షేమం మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం కార్యదర్శి, భారత వ్యవసాయ పరిశోధనా మండలి డీజీ, ఎన్ఏఏఎస్ అధ్యక్షుడు డాక్టర్ ఎంఎల్ జాట్ మాట్లాడారు. 2047 నాటికి ఆత్మనిర్భర భారత్ సాధించాలనే లక్ష్యాన్ని దేశం నిర్దేశించుకుందని, ఈ ప్రయాణంలో వ్యవసాయ రంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. వ్యవసాయ దిగుబడులను పెంపొందించిన హరిత విప్లవంలో ఎరువులు కీలకపాత్ర పోషించినప్పటికీ.. వాటి వినియోగ సామర్థ్యం క్షీణించడం, విచక్షణారహితంగా వాటిని వాడటమే ప్రస్తుతం ప్రధాన సవాలుగా మారిందన్నారు.
దేశంలో ఎరువుల వార్షిక వినియోగం 33 మిలియన్ టన్నులుగా ఉందని డాక్టర్ జాట్ చెప్పారు. దీనిలో దిగుమతుల వాటా గణనీయంగా ఉందని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి స్వల్పకాల, మధ్యకాల, దీర్ఘకాల వ్యూహాలతో కూడిన సమగ్ర విధానం అవసరమని తెలిపారు. ఈ దిశగా చేపట్టాల్సిన ముఖ్యమైన చర్యల్లో భాగంగా భూసారం, సమతుల్యమైన, అవసర ఆధారిత ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, రైతులకు విస్తృత అవగాహనను కల్పించడం లాంటి కార్యక్రమాలను బలోపేతం చేయాలని వివరించారు.
కచ్చితమైన పోషక నిర్వహణతో కూడిన ఎరువుల సమర్థ వినియోగం, కృత్రిమ మేధ, సెన్సర్ ఆధారిత వ్యవస్థలు లాంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకోవాలని డాక్టర్ జాట్ చెప్పారు. పప్పు ధాన్యాలు, నూనెగింజల దిశగా పంటల వైవిధ్యీకరణను, వ్యర్థాల నుంచి సంపద కార్యక్రమం ద్వారా సేంద్రీయ వ్యర్థాలను పునరుపయోగం, జీవ సంబంధిత వనరుల వినియోగ పెంపు తదితరమైనవి రసాయన ఎరువుల వినియోగంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయని వివరించారు.
స్వల్ప కాలిక, మధ్య కాలిక, దీర్ఘ కాలిక పరిశోధనాభివృద్ధి లక్ష్యాలతో కూడిన బహుముఖ వ్యూహాన్ని స్వీకరించాలని, వాటిని సాధించే విధానాలను రూపొందించాలని మేదోమథనంలో పాల్గొన్నవారు సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ స్మార్ట్ ఎరువుల అభివృద్ధి కోసం ఎరువుల పరిశోధనను బలోపేతం చేయడం, ఇంకా వినియోగంలోకి రాని దేశీయ ఖనిజాలు (గ్లకోనైట్, ఫాస్ఫేట్ రాక్, మైకా, పాలీ హలైట్..), పారిశ్రామిక ఉప ఉత్పత్తులను ఉపయోగించుకోడం, జీవ సంబంధిత పదార్థాల వాడకాన్ని పెంచడం, మృత్తికా మైక్రోబయోమ్ సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, మెరుగైన కంపోస్టు పద్ధతులు, ఎన్యూఈ పెంచడానికి పంటల సాగు, ఎరువులు, సేంద్రీయ పదార్థాలను ఏకీకృతం చేసే కచ్చితమైన ఎరువుల నిర్వహణతో కూడిన ఉత్తమ వ్యవసాయ పద్ధతులు (జీఏపీ), భూసారం పునరుద్ధరణ, పంటల వైవిధ్యం, వ్యర్థాల పునర్వినియోగం తదితర అంశాలకు ఈ ప్రణాళికలో ప్రాధాన్యమివ్వాలి.
సమీకృత ఎరువుల సరఫరా, నిర్వహణ (ఐఎన్ఎస్ఏఎం)ను ప్రచారం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరాన్ని కూడా ఇది తెలియజేస్తుంది. వచ్చే మూడేళ్లలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఖనిజ ఎరువుల్లో కనీసం 25 శాతాన్ని సేంద్రీయ ఎరువులతో భర్తీ చేయడమే ఈ ప్రతిపాదిత కార్యక్రమ లక్ష్యం. భారత్ విస్తార్ ఏఐ వేదిక లాంటి డిజిటల్ సాధనాలను ఉపయోగించి సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం అందిస్తూ.. నిరూపితమైన టెక్నాలజీని పెద్ద ఎత్తున స్వీకరించడానికి తోడ్పడుతుంది. విస్తరణ సేవలు బలహీనంగా ఉంటే ఎరువులను అధికంగా వాడటంపై దృష్టి పెట్టి.. సమర్థంగా వినియోగించుకోవడాన్ని విస్మరిస్తాయి.
ప్రస్తుతమున్న ఎరువుల విధానాలను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు ఏకగ్రీవంగా అంగీకరించారు. ముఖ్యంగా యూరియాను పోషకాధారిత సబ్సిడీ పరిధిలోకి తీసుకురావడం, జీఏపీ స్వీకరణకు ప్రోత్సాహకాలుగా ఎరువుల సబ్సిడీని మార్చడం, భూసార కార్డులకు సబ్సిడీలను అనుసంధానించడం, ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో రైతులకే సబ్సిడీ ప్రయోజనాలను అందించే అవకాశాలను అన్వేషించడం లాంటివి దీనిలో ఉన్నాయి. యూరియా దుర్వినియోగాన్ని నివారించి సమర్థంగా ఉపయోగించుకోవడంలో తక్కువ ధరలు అతి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. అలాగే పాస్ఫరస్ (పీ), పొటాషియం (కే) ఎరువుల ధర అధికంగా ఉండటం వల్ల సూచించిన దానికంటే తక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫలితంగా.. నేలలోనూ, పంటల్లోనూ ఈ పోషకాల స్థాయి తగ్గుతోంది.
నేపథ్యం
భారత వ్యవసాయ చరిత్రలో హరిత విప్లవం కీలకమైన మలుపు. ఇది ఆహార కొరత నుంచి స్వయం సమృద్ధి వైపు భారత్‌ను నడిపించి వ్యవసాయంలో నిర్మాణాత్మక మార్పును తీసుకొచ్చింది. హరిత విప్లవం ప్రారంభమైనప్పటి నుంచి భారత వ్యవసాయంలో ఎరువులే కీలకంగా మారాయి. దీనివల్ల ఆహార ధాన్యాల దిగుబడి పెరిగి.. జాతీయ ఆహార భద్రత సాధ్యమైంది.
అయితే, ఈ రంగం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా పాస్ఫరస్, పొటాషియం లాంటి ఎరువులకు సంబంధించి దిగుమతులపైనే అధికంగా ఆధారపడి ఉండటం వల్ల పెద్ద మొత్తంలో విదేశీ మారక నిల్వలు ఖర్చవడంతో పాటుగా.. 2024-25లో సబ్సిడీల భారం రూ. 1.71 లక్షల కోట్లకు చేరుకుంది. అసమర్ధమైన, అసమతౌల్యమైన ఎరువుల వినియోగం వల్ల దిగుబడి తగ్గుతుంది. ఎందుకంటే పంటకు అందించిన ఎరువులో స్వల్ప మొత్తాన్ని మాత్రమే మొక్కలు ఉపయోగించుకుంటాయి. నత్రజనిలో సుమారుగా 30-50 శాతం, పాస్ఫరస్లో 15-25 శాతం, పొటాషియంలో 50-60 శాతం మాత్రమే ఉపయోగించుకుంటాయి. మిగిలినది మొక్కకు అందకుండా భూమి లోపలి పొరల్లోకి ఇంకిపోవడం, నీటిలో కొట్టుకుపోవడం, ఆవిరైపోవడం, మట్టిలో కలసిపోయి నిరుపయోగంగా మారిపోతుంది. పోషకాలను వినియోగ సామర్థ్యం (ఎన్యూఈ) తక్కువవగా ఉండటం వల్ల సాగు వ్యయం, సబ్సిడీ భారం పెరిగిపోతాయి. నేల, నీటి నాణ్యత క్షీణతకు కారణమవుతుంది.
హెక్టారుకు 151 కేజీల చొప్పున 2024-25లో మొత్తం ఎరువుల వినియోగం 32.93 మిలియన్ టన్నులకు చేరుకుంది. సగటు ఎరువుల వినియోగ నిష్పత్తి 9.3:3.5:1 (నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం)గా ఉంది. ఇది నత్రజని వినియోగం అధికంగా ఉందని సూచిస్తుంది. యూరియా తయారీలో ఉపయోగించే సహజ వాయువులో సుమారుగా 80 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువుల్లో సైతం దిగుమతులపై ఎంతగా ఆధారపడి ఉన్నదీ స్పష్టం చేస్తుంది. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఎరువులు, ముడి సరకులకు సంబంధించిన సరఫరా వ్యవస్థలో ఎదురైన స్వల్పకాలిక అవరోధంగా పరిగణించకూడదు. స్వావలంబన దిశగా మన విధానాలు, పరిశోధనాభివృద్ధి ప్రాధాన్యాలను పునరాలోచించి, పునర్వ్యవస్థీకరించుకోవాలనే పిలుపుగా పరిగణించాలి.
***
(రిలీజ్ ఐడి: 2252379)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24