రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారుల్లో ఓవర్‌లోడు వాహనాలకు సుంకాన్ని సరళతరం చేయడానికి ఉద్దేశించిన సవరణను నోటిఫై చేసిన రోడ్డు రవాణా, హైవేల శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2026 12:56PM by PIB Hyderabad

జాతీయ రహదారుల సుంకం (ధరల నిర్ధారణ, వసూలు) సంబంధిత నాలుగో సవరణ నియమావళి-2026ను  రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టీహెచ్)  నోటిఫై చేసింది. జాతీయ రహదారుల్లో ఓవర్‌లోడుతో రాకపోకలు జరిపే వాహనాల నియంత్రణను పటిష్ఠపరచడంతో పాటు, హేతుబద్ధమైన సుంకం వసూళ్లను నిర్ధారించడం ఈ చర్యల లక్ష్యం.
సవరించిన నియమాలు 2026 ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తాయి.
నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం, పదో నియమంలో భాగంగా అనుమతించిన స్థూల వాహన బరువు (గ్రాస్ వెహికల్ వెయిట్.. జీవీడబ్ల్యూ)కు మించిన లోడులను తీసుకు పోయే వాహనాలకు సుంకాన్ని విధించడానికి ఒక సవరించిన ప్రణాళిక (ఫ్రేంవర్క్)ను ప్రవేశపెట్టారు.
నిర్దేశిత లోడ్ లిమిట్స్‌ను పాటించడాన్ని ప్రోత్సహించడంతో పాటు హైవే మౌలిక సదుపాయాల్ని పరిరక్షిస్తూ, రోడ్డు భద్రతను పెంచడం కూడా ఈ సవరణ ప్రధానోద్దేశాలుగా ఉన్నాయి.  
ముఖ్యాంశాలు:
ఎక్కువ లోడుతో తిరిగే వాహనాలకు సవరించిన సుంకాల వర్తింపు:
అనుమతించిన దాని కన్న అధిక సామానుతో తిరిగే వాహనాలకు ఓవర్‌లోడింగ్ శాతం ఆధారంగా సుంకాన్ని ఈ కింద పేర్కొన్న విధంగా వసూలు చేస్తారు:
10 శాతం వరకూ అదనపు లోడుకు: ఎలాంటి ఓవర్‌లోడ్ సుంకం లేదు.
10 శాతానికి మించి, 40 శాతం వరకూ: మూల ధరకు రెండింతల ధర చొప్పున సుంకాన్ని వసూలు చేస్తారు.
40 శాతానికి మించితే: మూల ధర కు 4 రెట్ల సుంకాన్ని వసూలు చేస్తారు.
బరువును  శాస్త్రీయ పద్ధతిన లెక్కగట్టడం:
ఫీ ప్లాజాల వద్ద ధ్రువీకరించిన బరువు కొలిచే సాధనాలను ఉపయోగించి ఓవర్‌లోడింగును నిర్ధరిస్తారు.
బరువును కొలిచే సదుపాయం లేని చోట్ల సుంకాన్ని వసూలు చేయరు:
ఫీ ప్లాజాల్లో బరువును కొలిచే సదుపాయాలు అందుబాటులో లేని సందర్భాల్లో, ఎలాంటి ఓవర్‌లోడ్ సుంకాన్నీ విధించరు.
డిజిటల్ చెల్లింపు తప్పనిసరి:
ఓవర్‌లోడింగ్ సుంకాల్ని ఫాస్టాగ్ (FASTag) ద్వారా మాత్రమే వసూలు చేస్తారు.
వివరాలను తప్పనిసరిగా తెలియజేయాలి:
అధిక భారంతో తిరిగే వాహనాల వివరాల్ని నమోదు చేస్తారు. ఈ సమాచారాన్ని జాతీయ వాహన రిజిస్టరు (వీఏహెచ్ఏఎన్.. VAHAN)లో పొందుపరుస్తారు.
ఫాస్టాగ్ (FASTag) నియమ పాలన:
చెల్లుబాటయ్యే ఫాస్టాగ్ (FASTag) లేకుండానే వాహనాలు జాతీయ రహదారుల్లో ప్రవేశించేటప్పుడు వర్తమాన నియమాల ప్రకారం ఆయా వాహనాలపై చర్యలు తీసుకుంటారు.
వర్తింపు క్లాజు:
ఈ నిబంధనలు వర్తించే కన్నా ముందు మొదలైన కొన్ని ప్రయివేటు పెట్టుబడి ప్రాజెక్టుల విషయంలో కన్సెషనేర్ సంస్థలు సవరించిన నియమావళిని పాటించడానికి సమ్మతిని తెలిపేటంతవరకూ ఈ నిబంధనలను వర్తింప చేయబోరు.
నియమాల్లో ఉదాహరణలను పొందుపరిచారు:
అనుమతించిన బరువు పరిమితుల ఆధారంగా వివిధ శ్రేణులకు చెందిన వాహనాలకు ఓవర్‌లోడ్ సుంకాల లెక్కింపు పద్ధతిని తెలియజేసే ఒక విస్తృత వివరణను ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీనితో అమలు ప్రక్రియలో స్పష్టతతో పాటు పారదర్శకత్వానికి కూడా చోటిచ్చారు.
ఈ సవరణతో నియమపాలన మెరుగుపడుతుందని, అదనపు బరువును తీసుకు తిరిగే వాహనాల కారణంగా రహదారులకు వాటిల్లే నష్టాలు తగ్గుతాయని, జాతీయ రహదారుల్లో సరకు రవాణా సురక్షితంగా, ఇదివరకటి కన్నా చక్కని పద్ధతిలో రాకపోకలు సాగుతాయని భావిస్తున్నారు. అంతేకాక, ఈ డబ్ల్యూ ఐ ఎంతో నిరంతరాయ నిర్వహణ కార్యకలాపాలకు ఆస్కారం ఏర్పడింది.


(రిలీజ్ ఐడి: 2252178) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी