ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఈ-సేఫ్‌హర్’ – గ్రామీణ భారతంలో పది లక్షల మంది సైబర్ సఖీలను సిద్ధం చేసే సైబర్ భద్రత అవగాహన కార్యక్రమం


ఈ కార్యక్రమం ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (ఐఎస్ఈఏ)ను ఉపయోగించుకుంటుంది

ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా అమలు చేయనున్న సీ-డాక్ హైదరాబాద్, రిలయన్స్ ఫౌండేషన్
రాబోయే మూడేళ్లలో ఒక మిలియన్ మంది మహిళలకు చేరువై... లింగ సున్నితత్వంతో, సామాజిక భాగస్వామ్యంతో కూడిన, సురక్షితమైన డిజిటల్ సమ్మిళిత విధానాన్ని రూపొందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న ‘ఈ-సేఫ్ హర్’

నాడు పోస్టు చేయడమైనది: 13 APR 2026 9:32PM by PIB Hyderabad

డిజిటల్ వ్యవస్థలో గ్రామీణ భారతంలోని పది లక్షల మంది మహిళలను సురక్షితంగా, ఆత్మవిశ్వాసంతో పాల్గొనేలా తీర్చి దిద్దే లక్ష్యంతో ‘ఈ-సేఫ్ హర్’ పేరిట సైబర్ భద్రత అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు హైదరాబాద్ లోని సీ-డాక్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించాయి. సీ-డాక్ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మెయిటీ) ఆధ్వర్యంలోని శాస్త్రీయ సంస్థ.

మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (ఐఎస్ఈఏ) పరిధిలో ఈ కార్యక్రమాన్ని సీడాక్ హైదరాబాద్ నిర్వహిస్తోంది. అలాగే శిక్షణకు అవసరమైన సమాచారం, వనరులను అందజేస్తుంది. వీటిని మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహికులకు రిలయన్స్ ఫౌండేషన్ అందజేస్తుంది. మహిళల డిజిటల్ సమ్మిళిత్వాన్ని పెంపొందింపజేసే దిశగా వేసిన మరో ముందడుగే ఈ కార్యక్రమం. ప్రధానంగా డిజిటల్ వేదికల ద్వారా ఆర్థిక లావాదేవీలు, జీవనోపాధి, అత్యవసర సేవల వినియోగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో సమాజంలో చివరి అంచె వరకూ సైబర్ భద్రతను బలోపేతం చేయడమే ఈ-సేఫ్ హర్ లక్ష్యం. సైబర్ భద్రత అవగాహనపై సీ-డాక్ హైదరాబాద్, రిలయన్స్ ఫౌండేషన్ మధ్య కుదిరిన ఈ వ్యూహాత్మక సహకారంలో క్రమబద్ధమైన శిక్షణ, సమాజ ఆధారిత కార్యక్రమాలుంటాయి.

ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మెయిటీ కార్యదర్శి శ్రీ  ఎస్ కృష్ణన్ మాట్లాడారు. ‘‘సైబర్ సెక్యూర్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి దేశం నలుమూలల్లోనూ సామర్థ్యాన్ని, సహకారాన్ని, స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో ఈ-సేఫ్‌ హర్ గొప్ప అవకాశం. దీని ద్వారా మెయిటీకి చెందిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (ఐఎస్ఈఏ) పాఠ్యాంశాలను, విజ్ఞానాన్ని ఒకే వేదిక పైకి తీసుకు వస్తున్నాం. సీ-డాక్, రిలయన్స్ ఫౌండేషన్‌ సహకారంతో.. ఈ కార్యక్రమం మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు భద్రతను, గుర్తింపును, సాధికారతను అందిస్తుంది. ఇదే తరహా ఆలోచనలున్న భాగస్వాములతో కలసి దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించాలని మేం భావిస్తున్నాం.

మునుపెన్నడూ లేని రీతిలో భారతదేశంలోని గ్రామీణ మహిళలు ఆన్‌లైన్లోకి వస్తున్నారని రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీమతి ఇషా అంబానీ తన సందేశంలో తెలిపారు. మహిళల డిజిటల్ సమ్మిళిత్వాన్ని వేగవంతం చేయడమే కాకుండా.. సురక్షితంగా ఉండేలా వారిని విజ్ఞానం, నైపుణ్యాలతో సన్నద్ధం చేయాలనే తమ అంకితభావాన్ని స్పష్టం చేశారు. ‘‘ఈ-సేఫ్ హర్ ద్వారా సైబర్ సెక్యూరిటీ అవగాహన శిక్షణను అందించడానికి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సీ-డాక్‌తో కలసి పని చేయడం మాకు సంతోషంగా ఉంది. మహిళలు ఆన్లైన్లో సురక్షితంగా ఉండేలా, తమ జీవితాలను, ఉపాధిని బలోపేతం చేసేలా వారికి అవసరమైన నైపుణ్యాలను, విజ్ఞానాన్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. దీని ద్వారా వచ్చే మూడేళ్లలో గ్రామీణ భారతంలోని పది లక్షల మంది సైబర్ సఖీలకు సాధికారత అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆత్మవిశ్వాసంతో డిజిటల్ ప్రపంచాన్ని స్వీకరించేలా, సురక్షితమైన ఆన్‌లైన్ పద్ధతులను అలవాటు చేసుకోవడంలో మేం వారికి సాయం చేస్తాం.’’

ఐఎస్ఈఏ ప్రాజెక్టు పరిధిలో బహుభాషల స్వీకరణతో సహా అభివృద్ధిని, ప్రాంతీయీకరణను, సైబర్ భద్రతా శిక్షణను సీ-డాక్ ముందుకు నడిపిస్తుంది. గ్రామీణ భారతంలో క్షేత్ర స్థాయిలో విస్తరించిన తన నెట్వర్క్ ను, మహిళా సాధికారత వేదికలను ఉపయోగించుకొని సమాజాధారిత విధానంలో తోటివారే శిక్షణ ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని రిలయన్స్ ఫౌండేషన్ అమలు చేస్తుంది.

తొలుత మధ్యప్రదేశ్, ఒడిశాలోని సైబర్ సఖీలకు శిక్షణ ఇవ్వడంతో ప్రారంభించి దశల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. బహుళ భాగస్వామ్యాలతో 2029 నాటికి ఒక మిలియన్ మంది మహిళలకు విస్తరిస్తారు. విస్తృతి, సుస్థిరతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎలాంటి ప్రత్యేకమైన మౌలిక వసతుల అవసరం లేకుండా.. ఇప్పటికే కొనసాగుతున్న మహిళా సాధికారత, డిజిటల్ అక్షరాస్యతా కార్యక్రమాల్లో సైబర్ భద్రతను అనుసంధానిస్తారు. ఈ కార్యక్రమ విస్తృతిని, భాగస్వామ్యాన్ని.. ప్రాంతాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన కంటెంటు, ఆడియో-విజువల్ పాఠ్యాంశాలు, మిశ్రమ అభ్యాస విధానాలు పెంపొందిస్తాయి. సైబర్ ముప్పుపై అవగాహన, డిజిటల్ లావాదేవీలపై పెరిగిన విశ్వాసం, సురక్షితమైన డిజిటల్ పద్ధతులను అవలంబించడం వంటి ప్రవర్తనా మార్పులను తీసుకువస్తుంది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేయడం ద్వారా లభించే అనుభవాలు, సాక్ష్యం ఆధారిత విస్తరణకు, విధానపరమైన ఏకీకరణకు దోహదపడతాయి.

మెయిటీ జాతీయ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను, సీ-డాక్ సాంకేతిక నైపుణ్యాలను, రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవల పంపిణీ విధానాన్ని ఏకం చేయడం ద్వారా గ్రామీణ భారతంలోని మహిళలకు డిజిటల్ సమ్మిళిత్వంతో పాటు.. డిజిటల్‌పరంగా సురక్షితంగా ఉండేలా చూడటమే ఈ-సేఫ్ హర్ లక్ష్యం.

 

***


(రిలీజ్ ఐడి: 2251888) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Bengali