|
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి నేపథ్యంలో 2026 ఏప్రిల్ 11 నుంచి 2028 ఏప్రిల్ 11 వరకు దేశవ్యాప్తంగా రెండేళ్ల వేడులకు కేంద్ర ప్రభుత్వ శ్రీకారం
నాడు పోస్టు చేయడమైనది:
11 APR 2026 9:54PM by PIB Hyderabad
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2025 ఆగస్టు 15నాటి ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ: “మహనీయుడైన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలను మనం తర్వలో నిర్వహించుకోబోతున్నాం. ఆయన ప్రబోధించిన ఆదర్శాలు, సూత్రాలు నేటికీ మనకెంతో స్ఫూర్తిదాయకాలు... ముఖ్యంగా ‘వెనుకబడిన వారికి ప్రాధాన్యం’ అన్నది ఒక తారకమంత్రం. తద్వారా సామాజిక పరిణామంలో ఉన్నత శిఖరారోహణకు శాయశక్తులా కృషి చేయాలని మేం నిర్ణయించాం. ఈ మేరకు పారదర్శక విధానాలతో ‘వెనుకబడిన వారికి ప్రాధాన్యం’ నినాదానికి క్షేత్రస్థాయిలో వాస్తవ రూపమిచ్చి వారి జీవనంలో నవ్య కాంతులు నింపాలని ఆకాంక్షిస్తున్నాం” అని ప్రకటించారు.
ప్రధానమంత్రి ప్రకటన స్ఫూర్తితో మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి ఉత్సవాలను ఈ నెల 11 నుంచి దేశవ్యాప్తంగా 2028 ఏప్రిల్ 11 వరకూ రెండేళ్ల పాటు కొనసాగించాలని నిశ్చయించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ అందుకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ‘జాతీయ అమలు కమిటీ’ (ఎన్‌ఐసీ), ఈ నెల 6న ఉత్సవాల నిర్వహణకు ఆమోదముద్ర వేసింది.
తదనుగుణంగా సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన “ఫూలే అక్రాస్ ఇండియా” పేరిట అంతర్రాష్ట్ర సాంస్కృతిక వైవిధ్య కార్యక్రమం కింద న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం (డీఏఐసీ)లో ఇవాళ వేడుకలను ఘనంగా ప్రారంభించింది. దీంతో రెండేళ్లపాటు కొనసాగే ఈ వేడుకలు నేటినుంచి లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మహాత్మా జ్యోతిబా ఫూలే జీవితం, సిద్ధాంతాలు, సామాజిక సంస్కరణోద్యమాల స్ఫూర్తితో ముందడుగు వేసిన ప్రాంతాల వారీ నేపథ్య ప్రదర్శనల ద్వారా దేశ వైవిధ్యాన్ని చాటే ‘జాతీయ సాంస్కృతిక సంగమం’ తరహాలో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రెండేళ్లపాటు సాగే ఈ సంస్మరణోత్సవాల లాంఛన సూచికగా ప్రత్యేకంగా రూపొందించిన ఒక ప్రకటన చిత్రాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రజల ముందుకు తెచ్చింది. సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం దిశగా మహాత్మా ఫూలే చిరస్మరణీయ సేవలను ఈ చిత్రం ప్రస్ఫుటం చేస్తుంది. అలాగే, సంస్మరణ కార్యక్రమాల నిర్వహణలో దేశవ్యాప్త భాగస్వామ్యానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రకటన చిత్రం వీక్షణతోపాటు డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింది లింకును క్లిక్ చేయవచ్చు.. లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు:
జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ సంస్కరణోత్సవాల మార్గనిర్దేశం, పర్యవేక్షణ కోసం గౌరవనీయ భారత ప్రధానమంత్రి అధ్యక్షతన 126 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, ఆధ్యాత్మిక నాయకులు, సాంస్కృతిక ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు సహా అనేకమంది ప్రముఖులున్నారు. ప్రభుత్వం, సమాజం ఏకోన్ముఖ భాగస్వామ్యంతో ముందంజ వేసే విధానాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
సంస్మరణోత్సవాల రూపకల్పన-అమలుకు సంబంధించి ఈ కమిటీ విధానపరమైన దిశా నిర్దేశం సహా మార్గదర్శకత్వం వహిస్తుంది. ఈ మేరకు విధానాలు, ప్రణాళికలు, కార్యక్రమాలను ఆమోదించడమే కాకుండా స్మారక కార్యక్రమాలకు పర్యవేక్షణ, మార్గనిర్దేశం చేస్తుంది. వేడుకల నిర్వహణకు తగిన విస్తృత చట్రం, కాలపరిమితులను నిర్ణయిస్తుంది.
కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, పౌర సమాజం భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు, కార్యకలాపాల ద్వారా ఈ సంస్మరణోత్సవాన్ని నిర్వహిస్తారు. మహాత్మా జ్యోతిబా ఫూలే జీవితం, ఆలోచనలు, శాశ్వత వారసత్వ వ్యాప్తి లక్ష్యంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, సెమినార్లు, యువత భాగస్వామ్య కార్యక్రమాలు, విద్యాపరమైన చర్చలు, విస్తృత ప్రచార కార్యక్రమాలు ఈ వేడుకలలో అంతర్భాగంగా ఉంటాయి.
మహాత్మా జ్యోతిబా ఫూలే (1827–1890) ఒక దార్శనిక సంఘ సంస్కర్త. అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్య-సామాజిక సమానత్వ సాధనకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ముఖ్యంగా మహిళలపై సామాజిక వివక్షణు సవాలు చేస్తూ వారిని విద్యభ్యాసం వైపు ప్రోత్సహించారు. అలాగే అందరికీ సమ న్యాయం కోసం ఆయన సాగించిన అవిరళ కృషి దేశంలో ప్రగతిశీల సామాజిక సంస్కరణోద్యమాలకు బాటలు వేసింది.
ఈ నేపథ్యంలో ఆయన వారసత్వాన్ని సముచిత రీతిలో స్మరించుకోవడం సహా సమానత్వం, విద్య, సామాజిక న్యాయం వంటి ఆయన ఆదర్శాలను కొనసాగించడంలో పౌరులకు... ముఖ్యంగా యువతకు ఉత్తేజమిచ్చేలా ఈ సంస్మరణోత్సవాలు రెండేళ్ల పాటు కొనసాగుతాయి.
***
(రిలీజ్ ఐడి: 2251307)
|