ఆయుష్
బయోకెమిస్ట్రీ, హెమటాలజీ విభాగాల్లో ఐఎస్ఓ 15189:2022 గుర్తింపు పొందిన తొలి సీసీఆర్ఏఎస్ సంస్థగా సీఏఆర్ఐ బెంగళూరు రికార్డు
ఏటా 1.5 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తూ 50 రకాల విభాగాల్లో ఎన్‌ఏబీఎల్ గుర్తింపు సాధించిన సీఏఆర్‌ఐ
ప్రపంచ స్థాయి గుర్తింపుతో ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణకు హామీ.. నాణ్యమైన వైద్య సేవలకు ప్రమాణంగా ఆయుష్ విభాగం: శ్రీ ప్రతాపరావు జాదవ్
ఆయుష్ విభాగంలో శాస్త్రీయ ఆధారిత చికిత్సలు, పరిశోధనలను బలోపేతం చేయనున్న ఐఎస్ఓ 15189:2022 గుర్తింపు: వైద్య రాజేశ్ కొటేచా
నాడు పోస్టు చేయడమైనది:
11 APR 2026 11:01AM by PIB Hyderabad
క్లినికల్ లాబొరేటరీ, బయోకెమిస్ట్రీ, హెమటాలజీ విభాగాల్లో ఐఎస్ఓ 15189:2022 గుర్తింపును పొందిన బెంగళూరులోని సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఏఆర్ఐ), ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించటంలో కీలక ఘట్టంగా మారింది. ఆయుర్వేద విజ్ఞాన పరిశోధనా కేంద్ర మండలి (సీసీఆర్ఏఎస్) పరిధిలోని సంస్థల్లో ఈ విశిష్ట గౌరవాన్ని పొందిన తొలి సంస్థగా సీఏఆర్‌ఐ నిలిచింది.
అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రోగులకు ఖచ్చితమైన, విశ్వసనీయ, సురక్షితమైన వ్యాధి నిర్ధారణ ఫలితాలను అందించడానికి ఈ గుర్తింపు హామీని ఇస్తుంది. ప్రాథమిక స్థాయి ఎన్ఏబీఎల్ ధ్రువీకరణ నుంచి, పూర్తిస్థాయి గుర్తింపు పొందిన అత్యున్నత ప్రమాణాలు గల కేంద్రంగా ఆ ప్రయోగశాల మారటాన్ని ఈ విజయం సూచిస్తుంది.
కేంద్ర ఆయుష్ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) గౌరవ శ్రీ ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ... “ఐఎస్ఓ 15189:2022 వంటి అంతర్జాతీయ గుర్తింపు ద్వారా రోగులకు అత్యంత విశ్వసనీయమైన, ఖచ్చితమైన రోగ నిర్ధారణ సేవలందుతాయి. సమర్థవంతమైన చికిత్సకు, మెరుగైన ఆరోగ్య ఫలితాలకు ఇవి చాలా కీలకం. ఆయుష్ మౌలిక సదుపాయాలను నాణ్యత, విశ్వసనీయతకు చిహ్నాలుగా మార్చటంలో మంత్రిత్వ శాఖ పురోగతిని సీఏఆర్ఐ బెంగళూరు సాధించిన ఈ విజయం స్పష్టం చేస్తోంది" అని అన్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ.. "బయోకెమిస్ట్రీ, హెమటాలజీ విభాగాల్లోనూ ఐఎస్ఓ 15189:2022 గుర్తింపు పొందిన తొలి సీసీఆర్ఏఎస్ సంస్థగా సీఏఆర్ఐ బెంగళూరు నిలవటం, సంప్రదాయ వైద్య విధానాలతో అత్యున్నత ప్రమాణాల నిర్ధారణ పరీక్షలను అనుసంధానించడంలో కీలక ఘట్టం. ఇది శాస్త్రీయ ఆధారిత చికిత్స, పరిశోధన, రోగుల సంక్షేమమే లక్ష్యంగా మేం చేస్తున్న కృషిని మరింత బలపరుస్తుంది" అని తెలిపారు.
సీసీఆర్ఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ రబినారాయణ ఆచార్య మాట్లాడుతూ.. “సీఏఆర్ఐ బెంగళూరు సాధించిన ఎన్ఏబీఎల్ గుర్తింపు.. గతంలో పొందిన ఎన్ఏబీహెచ్, ఎన్ఏబీఎల్ ప్రాథమిక స్థాయి ధ్రువీకరణకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బీఐఎస్ ఐఎస్, ఐఎస్ఓ 9001:2015 పురోగతితో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆయుర్వేద సైన్స్ ఇంక్యుబేషన్ సెంటర్‌గా ఇది పోషిస్తున్న పాత్ర ఆయుర్వేద నాణ్యతా ప్రమాణాలను గణనీయంగా పెంచుతుంది. ఆయుర్వేద పరిశోధన, ఆవిష్కరణలను అత్యున్నత స్థాయి శాస్త్రీయ ఖచ్చితత్వం, అత్యుత్తమ ప్రమాణాల వైపు ఇది నడిపిస్తుంది" అని తెలిపారు.
బెంగళూరు సీఏఆర్ఐ అధిపతి డాక్టర్ సులోచన భట్ మాట్లాడుతూ.. "ఐఎస్ఓ 15189:2022 గుర్తింపును సాధించటం మా సంస్థకు ఎంతో గర్వకారణం. రోగుల అవసరాలే లక్ష్యంగా అత్యంత నాణ్యమైన, విశ్వసనీయమైన వ్యాధి నిర్ధారణ సేవలను అందించటంలో మాకున్న అంకితభావానికి ఇది నిదర్శనం. మా క్లినికల్ సామర్థ్యాన్ని పెంచడమే కాక, సీసీఆర్ఏఎస్ పరిధిలోని అగ్రశ్రేణి సంస్థగా మా పాత్రను ఈ ఘనత మరింత బలోపేతం చేస్తుంది. డాక్టర్ విద్యశ్రీ అంచన్ (రీసెర్చ్ ఆఫీసర్, పాథాలజీ), సీఏఆర్ఐ బృందం చేసిన నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమైంది" అని అన్నారు.
ప్రస్తుతం ఈ ప్రయోగశాలకు బయోకెమిస్ట్రీ, హెమటాలజీ విభాగాల్లో 50 రకాల పరీక్షలకుగానూ ఎన్ఏబీఎల్ గుర్తింపు ఉంది. ఇక్కడ బ్లడ్ గ్లూకోజ్, హెచ్‌బీఏ1సీ, కాలేయం, మూత్రపిండాల పనితీరుకు సంబంధించిన పరీక్షలు, లిపిడ్, థైరాయిడ్ ప్రొఫైల్స్, ఎలక్ట్రోలైట్స్, కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ వంటి సమగ్ర రోగ నిర్ధారణ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా శరీరంలోని మెటబాలిక్, హార్మోన్ల సమతుల్యత, రక్తానికి సంబంధించిన సమస్యలను అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేసేందుకు వీలుంటుంది.
2025-26లో ఈ ప్రయోగశాల 9,300 మందికి పైగా రోగులకు సేవలందిస్తూ, 1.52 లక్షలకు పైగా వైద్య పరీక్షలు చేసింది. ఇది పెరుగుతున్న ఆ సంస్థ సామర్థ్యాన్ని, నాణ్యమైన రోగ నిర్ధారణ సేవల పట్ల వారికున్న నిబద్ధతను తెలియజేస్తుంది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు, డిజిటల్ రిపోర్టింగ్ సాధనాలు అందుబాటులో ఉండటం వల్ల రోగులకు పరీక్షా ఫలితాలు వేగంగా అందడమే కాక.. ఖచ్చితత్వమూ పెరిగింది. ఎస్ఎంఎస్, ఈమెయిల్, వాట్సాప్ ద్వారా రోగులు రిపోర్టులను పొందే సదుపాయం కూడా ఉంది.
క్లినికల్, పరిశోధన, రోగ నిర్ధారణ సేవల్లో ఈ సంస్థ సాధిస్తున్న నిరంతర వృద్ధిని ఈ విజయం మరింత స్పష్టం చేస్తోంది. 2021లో 18,918గా ఉన్న ఓపీడీ రోగుల సంఖ్య.. 2026 నాటికి 51,300 దాటింది. ఇది ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని, సంస్థ విస్తృతిని ప్రతిబింబిస్తోంది. ప్రయోగశాలలోని పరీక్షల సంఖ్యలోనూ అద్భుతమైన వృద్ధి కనిపిస్తోంది. 2021లో కేవలం 2,770గా ఉన్న పరీక్షలు, 2026 నాటికి 1.55 లక్షలకు పైగా పెరిగాయి. ఇది ఆ సంస్థ మెరుగైన రోగ నిర్ధారణ సామర్థ్యాన్ని చాటిచెబుతోంది. పంచకర్మ, పారా-సర్జికల్ ప్రక్రియలు దాదాపు ఇరవై రెట్లు విస్తరించాయి. పరిశోధనా కార్యకలాపాలు కూడా ఏటా 20-25 ప్రాజెక్టులతో స్థిరంగా, పటిష్టంగా కొనసాగుతున్నాయి. జూలై 2024లో ఇన్‌పేషెంట్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి బెడ్ ఆక్యుపెన్సీ దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. సమగ్ర వైద్య సేవలకు పెరుగుతున్న ఆదరణను ఇది సూచిస్తుంది. అంతేకాక, ఔషధ మొక్కల ధ్రువీకరణలో ఈ సంస్థ పాత్రను బలోపేతం చేసుకుంది. కొన్నేళ్లుగా మొక్కల ప్రామాణీకరణ పనులను గణనీయంగా పెంచింది.
ఈ విజయం సాధించటానికి సంస్థ నిరంతర కృషి, సంస్థాగత నిబద్ధతే కారణం. ప్రారంభంలో సెమీ-ఆటోమేటెడ్ బయోకెమిస్ట్రీ అనలైజర్‌తో మొదలైన ఈ ప్రయోగశాలను, ఆయుష్ మంత్రిత్వ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కీమ్ ద్వారా పూర్తిస్థాయి ఆటోమేటెడ్ వ్యవస్థలతో ఆధునీకరించారు. నవంబర్ 2022లో ఎన్ఏబీఎల్ ప్రాథమిక స్థాయి ధ్రువీకరణ పొందిన తర్వాత కఠినమైన నాణ్యత ప్రమాణాలు, పక్కా డాక్యుమెంటేషన్, క్షుణ్ణమైన అంచనా ప్రక్రియల ద్వారా ఉన్నతమైన ఐఎస్ఓ 15189:2022 ప్రమాణాల స్థాయికి ఈ ప్రయోగశాల ఎదిగింది.
వైద్యపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి విశ్వసనీయమైన రోగ నిర్ధారణ సమాచారాన్ని అందించటం, రోగులు కోలుకునే క్రమాన్ని పర్యవేక్షించటం, పరిశోధన ఫలితాలను మరింత బలోపేతం చేయటం ద్వారా ఆయుర్వేద, ఆయుష్ ఆధారిత చికిత్సలకు మద్దతునివ్వటంలో ఈ ప్రయోగశాల కీలక పాత్ర పోషిస్తోంది.
2021-22లోనే ఎన్ఏబీహెచ్, ఎన్ఏబీఎల్ ప్రాథమిక స్థాయి ధ్రువీకరణను పొందిన తొలి సీసీఆర్ఏఎస్ సంస్థగా బెంగళూరు సీఏఆర్ఐ నిలిచింది. ప్రస్తుతం బీఐఎస్ ఐఎస్, ఐఎస్ఓ 9001:2015 గుర్తింపు దిశగా ఇది అడుగులు వేస్తోంది. నాణ్యత, ఖచ్చితత్వం, అత్యుత్తమ ప్రమాణాల పట్ల ఈ సంస్థకున్న నిబద్ధతను ఇది మరింత బలపరుస్తుంది.
గుర్తింపు పొందిన పరీక్షల సంఖ్యను భవిష్యత్తులో మరింతగా పెంచాలని, రోగ నిర్ధారణ సామర్థ్యాలను మెరుగుపరచాలని ఈ సంస్థ యోచిస్తోంది. దీనిద్వారా ప్రజలకు సమగ్రమైన, సులభంగా అందుబాటులో ఉండే, తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2251289)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24