శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రారంభించిన మూడేళ్లలోపే 1,000 కి.మీ సురక్షిత కమ్యూనికేషన్ మైలురాయిని చేరుకున్న జాతీయ క్వాంటం మిషన్: డాక్టర్ జితేంద్ర సింగ్


· క్వాంటం మిషన్ కింద ప్రోత్సాహాన్ని పొందే అంకుర సంస్థల సంఖ్య 17కు పెంపు.. 9 కొత్త డీప్‌టెక్ వెంచర్లకూ అండ

· డీప్-టెక్ నిధులకు పెరుగుతున్న ఆదరణ: టీడీబీకి 100 ప్రతిపాదనలు, 200 బయోటెక్ దరఖాస్తులకు చేరువలో బీఐఆర్ఏసీ

· ‘క్వాంటం మిషన్’ పురోగతిని, ఆర్డీఐ నిధుల స్థితిగతులను సమీక్షించిన డాక్టర్ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 08 APR 2026 5:58PM by PIB Hyderabad

జాతీయ క్వాంటం మిషన్ కింద ప్రపంచంలో అతి పొడవైన నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలిచే 1,000 కిలోమీటర్ల క్వాంటం కమ్యూనికేషన్ నెట్‌వర్కును విజయవంతంగా ప్రదర్శించారు. మిషన్‌ను ప్రారంభించిన రెండేళ్ల లోపే ఈ ఘనత సాధించడం గమనార్హం. ఎనిమిదేళ్ల కాలపరిమితిలో 2,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోవాలన్నది మిషన్ లక్ష్యం కాగా... నిర్దేశిత గడువు కన్నా ముందే అత్యంత వేగంగా ఈ పురోగతిని సాధించడం విశేషం. ఈ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సమీక్ష సందర్భంగా.. కేంద్ర శాస్త్ర, సాంకేతికత శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.

2024 అక్టోబరులో మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన అత్యంత పొడవైన క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (క్యూకేడీ) వ్యవస్థల్లో ఒకటిగా ఇది నిలిచింది. జాతీయ క్వాంటం మిషన్ సహకారంతో పనిచేస్తున్న ‘క్యూనూ ల్యాబ్స్’ అనే అంకుర సంస్థ.. దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి, క్వాంటం దాడుల ముప్పును తట్టుకోగల (క్వాంటం-సేఫ్ సైబర్ సెక్యూరిటీ) మార్గాలపై దృష్టి సారిస్తూ ఈ నెట్వర్కును అభివృద్ధి చేసింది. ‘సురక్షిత క్వాంటం కమ్యూనికేషన్‌లో చరిత్రాత్మక పురోగతి’గా డీఎస్టీ కార్యదర్శి డాక్టర్ అభయ్ కరందికర్ దీనిని అభివర్ణించారు. నిర్దేశిత కాలపరిమితికి ముందే ఈ పురోగతిని సాధించినట్టు తెలిపారు.

రక్షణ రంగం, ఆర్థిక వ్యవస్థలు, కీలక మౌలిక సదుపాయాల రంగాల్లో సురక్షిత కమ్యూనికేషన్ సామర్థ్యాలు ఈ తాజా పరిణామంతో మరింత బలోపేతమవుతాయని భావిస్తున్నారు. అదే సమయంలో సురక్షిత డిజిటల్ వ్యవస్థ నిర్మాణం దిశగా మన దేశ విస్తృత లక్ష్యానికి ఇది ఊతమిస్తుంది. నీటి అడుగున, భూగర్భ నెట్‌వర్కులు సహా సవాలుతో కూడిన భౌగోళిక పరిస్థితుల్లోనూ పనిచేసేలా ఈ సాంకేతికత రూపొందించినట్టు అధికారులు తెలిపారు. దీంతో పౌర, వ్యూహాత్మక రంగాల్లో ఈ సాంకేతికత వినియోగం మరింత విస్తృతమవుతుందన్నారు.

దేశ క్వాంటం వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా.. జాతీయ క్వాంటం మిషన్ కింద సహకారాన్ని అదనంగా మరో తొమ్మిది అంకుర సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. దీనితో ఈ మిషన్ ద్వారా ఆ ప్రోత్సాహాన్ని అందుకుంటున్న అంకుర సంస్థల సంఖ్య 17కు చేరింది. క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్, గ్రాహక వ్యవస్థ (సెన్సింగ్), మెటీరియల్స్ రంగాల్లో దేశీయ సామర్థ్యాలను పెంపొందించడం ఈ చర్య వెనుక ముఖ్యోద్దేశం. ఈ కొత్త అంకుర సంస్థలు వ్యాధుల నిర్ధారణ కోసం క్వాంటం బయో సెన్సార్లు, ఫోటాన్ గ్రాహక సాంకేతికతలు, క్వాంటం స్థానీయ వ్యవస్థలు, అటామిక్ మెమరీ, ప్రెసిషన్ ఎలక్ట్రానిక్ వ్యవస్థల వంటి అత్యాధునిక అంశాలపై పరిశోధనలు చేస్తున్నాయి. జాతీయ క్వాంటం మిషన్ కింద కొత్తగా ఈ ప్రోత్సాహాన్ని పొందుతున్న కంపెనీల్లో.. సెన్స్-ఎక్స్‌టీ, ఓఆర్వీఎస్ఎస్ఈఎంఐ, క్యూబీట్స్, క్వాంటం ఏఐ గ్లోబల్, బ్లాక్, జీడీక్యూ ల్యాబ్స్, క్వాంటం బయోసైన్సెస్, బంబుల్ బీ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఏఎస్ క్యూట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.

పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల (ఆర్డీఐ) నిధుల వ్యవస్థ కింద సాధించిన పురోగతి పైన ఈ సమావేశంలో ప్రధానంగా సమీక్షించారు. సాంకేతికత అభివృద్ధి బోర్డు (టీడీబీ), బయోటెక్నాలజీ పారిశ్రామిక పరిశోధన సహాయ మండలి (బీఐఆర్ఏసీ) సంస్థలు ద్వితీయ స్థాయి నిధుల నిర్వాహక బాధ్యతల్లో వ్యవహరిస్తున్నాయి. ప్రకటన వెలువడిన రెండు నెలలల్లోపే టీడీబీకి వందకు పైగా ప్రతిపాదనలు అందాయి. పరిశోధన, అభివృద్ధికి నిధులను సమకూర్చడంలో పరిశ్రమలకు పెరుగుతున్న ఆసక్తిని ఇది సూచిస్తోంది. పెట్టుబడుల కమిటీ సిఫార్సు చేసిన ఆరు కంపెనీలు తదుపరి దశకు వెళ్తున్నాయి. మరికొన్ని ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ మద్దతుతో సాగే ఆవిష్కరణ కార్యక్రమాల్లో పెరుగుతున్న భాగస్వామ్యానికి ఇది నిదర్శనం.

బీఐఆర్ఏసీ మద్దతుతో పనిచేస్తున్న బయోటెక్నాలజీ విభాగంలోనూ కార్యకలాపాలు విశేషంగా పెరిగాయి. ఇటీవల వెలువడిన ప్రకటనల ద్వారా దాదాపు 200 దరఖాస్తులు అందాయి. వీటిలో క్యాన్సర్ పరిశోధన, జన్యు చికిత్స, జైవిక - తయారీ వంటి రంగాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి.

ఐచ్ఛికంగా మార్చుకోగల రుణం (ఓసీడీ) వంటి కొత్త ఆర్థిక సాధనాల వినియోగాన్ని అధికారులు వివరించారు. అంకుర సంస్థల్లో తక్షణమే ఈక్విటీ వాటాను తగ్గించకుండా.. ప్రభుత్వ నిధులతోపాటు ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆకర్షించేలా వీటిని రూపొందించారు. 6జీ, అధునాతన తయారీ వ్యవస్థ, అంతరిక్ష సాంకేతికతలు, బయోటెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో ఆవిష్కరణలతోపాటు వాటి విస్తరణ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.

ప్రభుత్వ మద్దతుతో నడిచే పరిశోధన - అభివృద్ధి నిధుల విషయంలో పారదర్శకత, ఎప్పటికప్పుడు మూల్యాంకనం, విస్తృతమైన ప్రచార కార్యక్రమాల ఆవశ్యకతను డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సమావేశంలో ప్రముఖంగా పేర్కొన్నారు.

సమన్వయంతో కూడిన ప్రచార వ్యూహాలను అవలంబిస్తూ.. క్వాంటం మైలురాళ్ల వంటి కీలక వైజ్ఞానిక విజయాలకు మరింత ప్రాచుర్యం కల్పించాలనీ, మన దేశ వర్ధమాన సాంకేతిక వ్యవస్థను మరింత బలంగా నిలపాలని ఆయన కోరారు.

డీఎస్టీ కార్యదర్శి డాక్టర్ అభయ్ కరందికర్, టీడీబీ కార్యదర్శి రాజేశ్ కుమార్ పాఠక్, బీఐఆర్ఏసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

మన దేశ డీప్ టెక్ సామర్థ్యాలను బలోపేతం చేసుకునేందుకు చేపట్టిన విస్తృత విధానపరమైన చర్యల నడుమ ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిర్దేశక కార్యక్రమాలు, మిశ్రమ ఆర్థిక నమూనాలు, అంకుర సంస్థలకు చేయూతనిచ్చే వ్యవస్థల ద్వారా ప్రభుత్వం ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్తోంది. బయోటెక్నాలజీ, అధునాతన కమ్యూనికేషన్లతోపాటు.. క్వాంటం సాంకేతికతలు ఇప్పుడు ఒక కీలకమైన వ్యూహాత్మక రంగంగా ఆవిర్భవిస్తున్నాయి.  

***


(రిలీజ్ ఐడి: 2250359) సందర్శకుల సూచీ సంఖ్య : : 25
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi