గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొత్త ఆధార సంవత్సరం (2022-2023) ప్రాతిపదికన రాష్ట్ర ఆదాయం, సంబంధిత సమగ్ర గణాంకాలపై అఖిల భారత సదస్సు


ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈ రోజు ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 08 APR 2026 5:11PM by PIB Hyderabad

గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ గణాంకాల కార్యాలయ జాతీయ ఖాతాల విభాగం… రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక, గణాంకాల సంచాలక కార్యాలయాల అధికారుల కోసం కొత్త ఆధార సంవత్సరం (2022–23) ప్రాతిపదికన 'రాష్ట్ర ఆదాయం, సంబంధిత సమగ్ర గణాంకాల'పై మూడు రోజుల అఖిల భారత సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సు ఈ నెల 8 నుంచి 10 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సూర్యబాగ్ వద్ద గల 'హోటల్ దస్పల్లా' వేదికగా జరగుతోంది. జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిన విధానపరమైన మార్పుల గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవగాహన కల్పించడం... ప్రాంతీయ ఖాతాల గణాంకాల్లో ఏకరూపత, పారదర్శకత, తులనాత్మకతను పెంపొందించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.

ఈ కార్యశాల ప్రారంభ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్‌వోఎస్‌పీఐ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పీయూష్ కుమార్... ఎమ్‌వోఎస్‌పీఐ జాతీయ ఖాతాల విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ సిద్ధార్థ కుందు... ఎన్ఏడీ ఉప డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుభ్రా సర్కర్... డీఈఎస్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ శ్రీ బి. గోపాల్‌... ఎమ్‌వోఎస్‌పీఐ, పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీఈఎస్‌లకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఎమ్‌వోఎస్‌పీఐ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ... రాష్ట్రాల రుణ పరిమితులను నిర్ధారించడానికి, కేంద్ర పన్నుల వికేంద్రీకరణకు ఒక కీలక సూచికగా ఉన్న జీఎస్‌డీపీ ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. జీఎస్‌టీ, ఇ-వాహన్, పీఎఫ్ఎమ్ఎస్ వంటి పరిపాలనా డేటా వనరులను మరింత ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరాన్నీ ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. జీఎస్‌టీ డేటా లభ్యత వ్యయం-వైపు అంచనాలను సిద్ధం చేయడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్న ఆయన... ఉత్పత్తి విధానం ద్వారా సంకలనం చేసిన అంచనాలను క్రాస్-వాలిడేట్ చేయడం కోసం వీటిని ఉపయోగించవచ్చని, తద్వారా వాటి కచ్చితత్వాన్ని పెంచవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగానికి సంబంధించి విశ్వసనీయమైన జిల్లా స్థాయి అంచనాలను రూపొందించడానికి ఏఎస్‌యూఎస్ఈ, పీఎల్ఎఫ్ఎస్ వంటి సర్వేల్లో రాష్ట్రాలు చురుగ్గా పాల్గొనాల్సిన ప్రాముఖ్యతను డాక్టర్ సౌరభ్ స్పష్టం చేశారు. మిషన్ కర్మయోగి కింద చేపట్టిన సాధనా సప్తాహ్ 2026ను ప్రస్తావిస్తూ... డేటా ఆధారిత నిర్ణయం, పరిపాలన పాత్రను ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పీయూష్ కుమార్ తన ప్రత్యేక ప్రసంగంలో... ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణాత్మక మార్పులను గ్రహించడానికి ప్రాతిపదికగా ఉండే ఆధార సంవత్సరాన్ని 2011-12 నుంచి 2022-23కు మార్చడాన్ని కీలక ముందడుగుగా పేర్కొన్నారు. ఈ కొత్త శ్రేణి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక గతిశీలతను మరింత మెరుగ్గా ప్రతిబింబిస్తుందని... రాష్ట్రాలు, జిల్లా స్థాయిల్లో విధాన ప్రణాళికకు బలమైన పునాదిని అందిస్తుందని ఆయన తెలిపారు. జిల్లా స్థాయి ఆర్థిక నిర్మాణాలను అర్థం చేసుకోవడంలో జిల్లా దేశీయోత్పత్తి (డీడీపీ) ప్రాముఖ్యతను ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించిన మరింత వాస్తవిక చిత్రాన్ని ఈ సవరించిన శ్రేణి అందిస్తుందని ఆయన తెలిపారు.

ఎమ్‌వోఎస్‌పీఐ అదనపు డైరెక్టర్ జనరల్ (జాతీయ ఖాతాల విభాగం) శ్రీ సిద్ధార్థ కుందు మాట్లాడుతూ... జాతీయ ఖాతాలు ప్రస్తుత కాలానికి అనుగుణంగా, ఆర్థిక పరివర్తనలను ప్రతిబింబించేలా చూడటంలో కొత్త ఆధార సంవత్సరాన్ని స్వీకరించడం ఒక కీలక ముందడుగన్నారు. జాతీయ గణాంకాల విశ్వసనీయతకు అవసరమైన డేటాను కచ్చితత్వంతో, సకాలంలో అందించడంలో రాష్ట్రాల ప్రాథమిక పాత్రను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

ఎమ్‌వోఎస్‌పీఐ ఉప డైరెక్టర్ జనరల్ (జాతీయ ఖాతాల విభాగం) డాక్టర్ సుభ్రా సర్కర్ మాట్లాడుతూ, రీబేసింగ్ ప్రక్రియలో ఎమ్‌వోఎస్‌పీఐ కృషిని అభినందించారు. కొత్త ఆధార సంవత్సరంతో (2022–23) కూడిన జీఎస్‌డీపీ అంచనాలను సకాలంలో సంకలనం చేసి, విడుదల చేసే విషయంలో పూర్తి సహకారాన్ని అందించాలని డీఈఎస్ అధికారులను కోరారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, గణాంకాల సంచాలకులు శ్రీ బి. గోపాల్ మాట్లాడుతూ, సామర్థ్య నిర్మాణంలో ఎన్ఏడీ పాత్రను అభినందించారు. ఆధార సంవత్సర సవరణ ప్రక్రియను చేపట్టేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు సాంకేతిక సహాయాన్ని అందించడం లక్ష్యంగా ఈ కార్యశాలను నిర్వహించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, గణాంక శాఖ ఉప సంచాలకులు శ్రీ సుబ్బారావు మాట్లాడుతూ... సమావేశానికి హాజరైన ప్రముఖులకు, పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలపడంతో ప్రారంభ సమావేశం ముగిసింది.

మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యశాలకు ఎమ్‌వోఎస్‌పీఐ (న్యూఢిల్లీ) నుంచి... అస్సాం, త్రిపుర, లక్షద్వీప్, పుదుచ్చేరి, దాద్రా-నగర్ హవేలీ, డామన్-డయ్యూ మినహా మిగిలిన 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 125 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.


(రిలీజ్ ఐడి: 2250303) సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी