జౌళి మంత్రిత్వ శాఖ
వస్త్ర వ్యర్థాలను ప్రజలు, పర్యావరణానికి అనుకూలమైన అవకాశాలుగా మారుస్తున్న నవీ ముంబయి
నాడు పోస్టు చేయడమైనది:
08 APR 2026 1:26PM by PIB Hyderabad
నవీ ముంబయిలోని వస్త్ర పునరుద్ధరణ కేంద్రం (టీఆర్ఎఫ్) చక్రీయ వ్యవస్థలు, ప్రజా భాగస్వామ్యం ద్వారా వస్త్ర వ్యర్థాలను అద్భుతమైన అవకాశాలుగా మారుస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కింద చేపట్టిన ఈ కార్యక్రమం.. వ్యర్థాలు డంపింగ్ యార్డులకు చేరటాన్ని తగ్గించడమే కాకుండా ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. ఇది పట్టణ భారత్‌కు ఒక ఆదర్శవంతమైన, విస్తరించదగిన నమూనాగా నిలుస్తోంది.

భారతదేశంలో ప్రతి ఏటా దాదాపు 7.8 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర వినియోగానంతర వస్త్ర వ్యర్థాలు వస్తున్నాయి. ఇది మన ఇళ్లు, సంస్థలు, పరిశ్రమలలో వాడే రకరకాల వస్త్రాల స్థాయిని తెలియజేస్తోంది. చీరలు, యూనిఫారాల నుండి డెనిమ్, లైనెన్ వరకు పట్టణ వ్యర్థాల్లో వస్త్రాలు ఒక ముఖ్యమైన భాగం అయినప్పటికీ తరచుగా వీటిని ఎవరూ పట్టించుకోరు. వస్త్రాల పునరుద్ధరణ, పునర్వినియోగం, రీసైక్లింగ్ కోసం క్రమబద్ధమైన వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నగరాలు ఇప్పుడు గుర్తిస్తున్నాయి. చక్రీయ ఆర్థిక వ్యవస్థ, వనరుల సామర్థ్యంపై పెరుగుతున్న ఆసక్తితో ఈ వస్త్రాలు డంపింగ్ యార్డులకు చేరకుండా నిరోధించే వినూత్న పరిష్కారాలను అన్వేషించటాన్ని మున్సిపాలిటీలు ప్రారంభించాయి.

పట్టణ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద నవీ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంఎంసీ) ఈ రంగంలో దేశానికే మార్గదర్శిగా నిలిచింది. వస్త్ర వ్యర్థాల సమస్యను ఒక వ్యవస్థీకృత జోక్యం ద్వారా పరిష్కరించే అవకాశాన్ని గుర్తించిన ఎన్ఎంఎంసీ.. నవీ ముంబయిలోని బేలాపూర్‌లో భారతదేశపు మొట్టమొదటి మున్సిపల్ వస్త్ర పునరుద్ధరణ కేంద్రాన్ని (టీఆర్ఎఫ్) ఏర్పాటు చేసింది. వికేంద్రీకృత సేకరణ, శాస్త్రీయ వర్గీకరణ, ట్రేసబిలిటీ (జాడను గుర్తించే విధానం), మహిళా నేతృత్వంలోని జీవనోపాధి కల్పనను సమన్వయం చేయడం ద్వారా ఈ టీఆర్ఎఫ్ కేంద్రం ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోని వస్త్ర వ్యర్థాలను పట్టణ చక్రీయ ఆర్థిక వ్యవస్థలో ఒక విలువైన భాగంలా మార్చింది.
నవీ ముంబయిలోని వస్త్ర పునరుద్ధరణ కేంద్రం (టీఆర్ఎఫ్) కేవలం ఒక సాధారణ సేకరణ కేంద్రంగా మాత్రమే కాకుండా సేకరణ, వర్గీకరణ, సాంకేతికత, జీవనోపాధి కల్పనలను సమన్వయం చేసే ఒక సమగ్ర చక్రీయ వ్యవస్థగా తయారైంది.

ఈ నమూనా వికేంద్రీకృత సేకరణతో ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా మొత్తం 8 మున్సిపల్ వార్డులలోని హౌసింగ్ సొసైటీలలో వ్యూహాత్మకంగా బ్రాండెడ్ వస్త్ర సేకరణ డబ్బాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 140 డబ్బాలను అందించగా, ప్రస్తుత దశలో వీటి సంఖ్యను 250కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో పాటు ఈ సౌకర్యం అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు.
బేలాపూర్‌లోని ఒక పాత పట్టణ ఆరోగ్య కేంద్రం భవనంలో ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక టీఆర్ఎఫ్ కేంద్రంలో శాస్త్రీయ వర్గీకరణ, ట్రేసబిలిటీపై ప్రధానంగా దృష్టి సారించారు. సేకరించిన వస్త్రాలను ఇక్కడ తూకం వేసి ట్యాగ్‌లు ఇచ్చి పద్ధతి ప్రకారం వివిధ విభాగాలుగా వర్గీకరిస్తారు. వీటిని పునర్వినియోగం, రీసైకిల్, అప్‌సైకిల్, డౌన్ సైకిల్, పనికిరాని వ్యర్థాలు అనే విభాగాలుగా వేరు చేస్తారు. ఇక్కడ వినియోగిస్తున్న 'కోశ' హ్యాండ్ హెల్డ్ స్కానర్ ద్వారా వస్త్రంలోని దారం రకాన్ని.. అంటే కాటన్, పాలీకాటన్, పాలిస్టర్, ఉన్ని, పట్టు వంటి వాటిని ప్రత్యక్షంగా గుర్తించడం సాధ్యమవుతుంది. దీనివల్ల శాస్త్రీయ వర్గీకరణ మరింత బలోపేతం అవ్వడమే కాకుండా వస్త్రాల నుంచి గరిష్ఠంగా ఉపయోగకరమైన పదార్థాలను వెలికితీయడం సులభతరమవుతుంది.
దాత నుంచి తుది ఉత్పత్తి వరకు వస్త్రాలు ప్రయాణించే మార్గాన్ని మ్యాపింగ్ చేయడానికి అభివృద్ధి చేస్తున్న ప్రత్యేక ఎంఐఎస్ వేదికతో కూడిన 'డిజిటల్ ట్రాకింగ్' విధానం పారదర్శకత- బాధ్యతను.. డేటా ఆధారిత నిర్ణయాలను మరింత బలోపేతం చేస్తుంది. వస్త్రాలను గుర్తించిన తర్వాత తదుపరి ప్రక్రియను సులభతరం చేయడానికి వాటిని ఫ్యాబ్రిక్ రకం, రంగు, స్థితి ఆధారంగా వేరుచేస్తారు. వర్గీకరించిన ఈ వస్తువులను పునర్వినియోగానికి పంపే ముందు పరిశుభ్రత, భద్రతను నిర్ధారించడానికి వాటిని పూర్తిగా క్రిమి సంహారం చేస్తారు.

అనువైన వస్త్రాలను స్వయం సహాయక సంఘాలకు చెందిన నైపుణ్యం కలిగిన మహిళలు తమ చేతులతో సంచులు, చాపలు, యాక్సెసరీస్, దుస్తులు, గృహ అలంకరణ వస్తువులుగా మారుస్తారు. ఇలా తయారు చేసిన ఉత్పత్తులను తదనంతరం బహిరంగ మార్కెట్లో విక్రయిస్తారు. దీనివల్ల ఒకప్పుడు వ్యర్థాలుగా భావించిన వస్తువులకు కొత్త రూపం, ప్రయోజనం చేకూరుతుంది.
300 కంటే ఎక్కువ మంది మహిళలు 8 రోజుల పాటు సాగే వ్యవస్థీకృత 'ట్రైనింగ్-ఆఫ్-ట్రైనర్స్' మాడ్యూల్స్‌లో శిక్షణ పొందారు. ఇందులో దారాల గుర్తింపు, వర్గీకరణ నియమాలు, మరమ్మత్తు పద్ధతులు, తయారీ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం 150 మందికి పైగా మహిళలు వస్త్రాల వర్గీకరణ, కుట్టుపని, ఉత్పత్తుల తయారీ ద్వారా నెలకు రూ. 9,000 నుంచి రూ. 15,000 వరకు ఆదాయాన్ని గడిస్తున్నారు.

ఇది ఒక విప్లవాత్మక మార్పును తీసుకువచ్చింది. గృహిణులు నైపుణ్యం కలిగిన 'చక్రీయ ఆర్థిక వ్యవస్థ' నిపుణులుగా ఎదగడానికి ఇది తోడ్పడింది. ఈ కేంద్రం ఒక ప్రత్యేకమైన అప్‌సైక్లింగ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇక్కడ స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు సేకరించిన వస్త్రాల నుంచి సంచులు, దుస్తులు, పౌచ్‌లు, గృహ అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. వస్త్ర పునరుద్ధరణ అనేది ఇప్పుడు ఒక క్రమబద్ధమైన జీవనోపాధి యంత్రంగా రూపాంతరం చెందింది. ఇది పర్యావరణహిత ఉద్యోగాలను సృష్టిస్తూ స్థానిక వ్యాపారాలను బలోపేతం చేస్తూ పట్టణ సుస్థిరతా చట్రంలో శ్రమకు ఉండే గౌరవాన్ని చాటిచెబుతోంది.
టీఆర్ఎఫ్ నమూనా ద్వారా ఇప్పటివరకు 30 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ఉపయోగించిన వస్త్రాలకు సంబంధించిన వ్యర్థాలను సేకరించగా అందులో 25.5 మెట్రిక్ టన్నులను శాస్త్రీయంగా వర్గీకరించారు. రోజుకు సగటున దాదాపు 500 వస్తువుల చొప్పున మొత్తం 41,000 కంటే ఎక్కువ వస్తువులుగా మార్చారు. అవగాహన కార్యక్రమాల ద్వారా ఈ వస్త్రాల పునరుద్ధరణ కార్యక్రమం 1,14,575 కంటే ఎక్కువ కుటుంబాలకు చేరువైంది. 75 కంటే ఎక్కువ ఐఈసీ వర్క్‌షాప్‌లను నిర్వహించడంతో పాటు 350 మందికి పైగా హౌసింగ్ సొసైటీ ప్రతినిధులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశారు. ఇది ప్రజల చురుకైన భాగస్వామ్యం, సంస్థాగత నిశ్చయతను తెలియజేస్తోంది. ఇప్పటివరకు 400 కంటే ఎక్కువ అప్‌సైకిల్డ్ ఉత్పత్తి నమూనాలను అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా పనికిరాని వస్త్ర వ్యర్థాల నుంచి కాగితాన్ని తయారు చేసే ప్రయోగాత్మక ప్రయత్నం విజయవంతమైంది. ఇది వనరుల పునరుద్ధరణలో ఉన్న వినూత్నతను చాటిచెబుతోంది.
అవగాహనను పెంచడానికి, మార్కెట్ అవకాశాలను విస్తరించడానికి టీఆర్ఎఫ్ కేంద్రం 30 కంటే ఎక్కువ ప్రదర్శనలు, బహిరంగ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంది. ఉపయోగించిన వస్త్రాలను రీసైక్లింగ్ చేయడం, పునర్వినియోగించడం వంటి అంశాల ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఈ వేదికలు కీలక పాత్ర పోషించాయి. అదే సమయంలో మహిళా కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి ఇవి గొప్ప అవకాశాలను కల్పించాయి.
బేలాపూర్‌లోని తాత్కాలిక టీఆర్ఎఫ్ సాధించిన విజయాన్ని స్పూర్తిగా తీసుకొని తదుపరి దశలో కోపర్ ఖైరనేలోని నిసర్గ్ ఉద్యాన్ సమీపంలో శాశ్వతమైన అధిక సామర్థ్యం కలిగిన వస్త్ర పునరుద్ధరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నవీ ముంబయిలోని వస్త్ర పునరుద్ధరణ కేంద్రం సాధారణంగా పనికిరానివిగా భావించే వ్యర్థాలను ఆర్థిక, పర్యావరణ విలువను పెంపొందించే చోదకశక్తులుగా ఎలా మార్చవచ్చో నిరూపిస్తోంది. ఈ విధానం స్వచ్ఛ భారత్ 2.0, స్మార్ట్ సిటీస్ మిషన్, సుస్థిర అభివృద్ధి లక్ష్యం 12 (బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి) సూత్రాలతో సంపూర్ణంగా ఏకీభవిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2250104)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25