ఆర్థిక మంత్రిత్వ శాఖ
‘బాబ్ సంవాద్’ను ప్రారంభించిన ఆర్థిక సేవల విభాగ కార్యదర్శి..
బ్రాంచి వినియోగదారులతో మాట్లాడడంలో సరికొత్త పద్ధతుల్ని ప్రవేశపెట్టే కృత్రిమ మేధ ప్రధాన బహు భాషా వేదిక
ఈ ఆస్థాన, భారతీయ భాషా వైవిధ్యానుసార ఏఐ వేదికతో 22 భాషల్లో వాస్తవ కాల ప్రాతిపదికన, ఆలస్యాన్ని కుదించే ద్వివిధ కమ్యూనికేషన్ సాధ్యం
‘బాబ్ సంవాద్’ సమ్మిళిత బ్యాంకింగ్ దిశగా ఓ ముందడుగు: ఆర్థిక సేవల విభాగ కార్యదర్శి
సాంకేతిక సహకారంతో వినియోగదారు సేవలు బలోపేతం
నాడు పోస్టు చేయడమైనది:
07 APR 2026 2:43PM by PIB Hyderabad
బ్యాంక్ ఆఫ్ బరోడా ‘బాబ్ సంవాద్’ ( bob SAMVAD ) పేరిట సరికొత్త సేవను పరిచయం చేసింది. దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి శ్రీ ఎమ్. నాగరాజు 2026 మార్చి నెల 28న ముంబయిలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ వేదిక పరిశ్రమలో తొలి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత బహు భాషా సంభాషణా సాధనం. దీనిని బ్యాంకు శాఖల్లో వినియోగదారులతో వ్యవహరించే పద్ధతుల్లో పెనుమార్పుల్ని తీసుకు రావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. భాషాపరమైన అడ్డంకులను తొలగించాలనే లక్ష్యంతో దీనిని తీర్చిదిద్దారు. వినియోగదారులకూ, బ్రాంచి ఉద్యోగులకూ తమకు నచ్చిన భాషల్లో ఒకరితో మరొకరు మాట్లాడుకొనే అవకాశాన్ని ఈ వేదిక ఇస్తుంది.
ఈ విధమైన సేవను అందుబాటులోకి తీసుకు వచ్చినందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాను డీఎఫ్ఎస్ కార్యదర్శి శ్రీ ఎమ్. నాగరాజు అభినందించారు. బ్యాంకింగ్ రంగంలో భాషాపరమైన అంతరాన్ని భర్తీ చేసేందుకు సాంకేతికతను వినూత్నంగా ఉపయోగంలోకి తెచ్చి వినియోగదారులకు చక్కని అనుభూతిని పంచుతున్నారంటూ బ్యాంకును ఆయన ప్రశంసించారు.
బాబ్ సంవాద్ మరింత సమ్మిళిత, సులభ సేవల లభ్యతను ప్రోత్సహిస్తుందనీ, బ్రాంచులలో వినియోగదారు సేవలను మెరుగుపరచడంలో తోడ్పడుతుందనీ శ్రీ నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమం బ్యాంకింగ్ రంగంలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పిందని కూడా ఆయన కితాబిచ్చారు.
శ్రీ నాగరాజు ‘బాబ్ ఫారెస్ట్’ను కూడా చూశారు. ఇది ‘బాబ్ ఎర్త్’, ‘గ్రీన్ డిపాజిట్స్’, గ్రీన్ బాండ్స్ తరువాత బ్యాంకు చేపట్టిన మరో హరిత ప్రధానమైన కార్యక్రమం. అంతే కాదు, స్థిరత్వం, సమగ్ర ఈఎస్‌జీ లక్ష్యాల సాధనకు బ్యాంకు కట్టుబడి ఉందని కూడా ఇది చాటిచెబుతోంది. ముంబయిలో బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెందిన బీకేసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6,000 చదరపు అడుగుల పచ్చదనం నిండిన పరిసర ప్రాంతమే ‘బాబ్ ఫారెస్ట్’. ఈ ప్రాజెక్టులో జీవవైవిధ్యానికీ, స్వచ్ఛమైన గాలికీ ప్రాధాన్యాన్ని ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సీఈఓ) డాక్టర్ దేబదత్త చంద్ మాట్లాడుతూ, ‘‘బాబ్ సంవాద్‌తో పాటు, కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించి బ్యాంక్ ఆఫ్ బరోడా తన శాఖలను ఇదివరకటితో పోలిస్తే మరింత సమ్మిళితంగానూ, వినియోగదారులకు అనుకూలమైనవిగానూ తీర్చిదిద్దుతోందనీ, దీంతో సంభాషణలు స్థానిక భాషల్లో, వాస్తవ కాల ప్రాతిపదికన సాధ్యపడతాయ’’న్నారు. ‘‘ఈ కార్యక్రమం వినియోగదారులకు ప్రయోజనాలను కలిగించేలా సాంకేతికతను అనుసంధానించి, కార్యకలాపాల నిర్వహణలో శ్రేష్ఠత్వాన్ని ప్రవేశపెట్టడానికి మేం ఎంతగా కట్టుబడి ఉన్నదీ సూచిస్తోంద’’ని కూడా ఆయన అన్నారు.
పూర్తిగా సంస్థ లోనే అభివృద్ధిపరిచిన బాబ్ సంవాద్ ఏఐ సహకారాన్ని తీసుకుని పనిచేస్తుంది. సంభాషణ, భాషా సాంకేతికతలను వాడుకుంటూ వాస్తవ కాల ప్రాతిపదికన, ఆలస్యాన్ని తగ్గిస్తూ, రెండు వైపులా కమ్యూనికేషన్‌ను సందర్భశుద్ధి పరంగా ఖచ్చితత్వంతో, సహజ వాగ్ధాటితో పూర్తి చేస్తుంది. ఈ క్రమంలో, భారత్‌లోని భాషా వైవిధ్యాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటుంది.
ఈ విధమైన సేవ.. సర్వీస్ కౌంటర్లో వినియోగదారులకీ, బ్యాంకు సిబ్బందికీ నడుమ వారు వేర్వేరు భాషలు మాట్లాడే వారు అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ ఉండని సమాచార వినిమయానికి వీలు కల్పిస్తుంది. వినియోగదారు తనకు నచ్చిన భాషలో మాట్లాడవచ్చు, లేదా ప్రశ్నలు అడగవచ్చు. ఆ మాటలు బ్యాంకు ఉద్యోగి ఎంపిక చేసుకొనే భాషలోకి వెనువెంటనే అనువాదమవుతాయి. ఈ సౌలభ్యాన్ని ఇరు పక్షాల వారూ పొంద గలుగుతారు. దీంతో అవసరమైన సేవల విషయంలో ఖచ్చితమైన అవగాహనా, సమర్థ సేవలను అందించడం సాధ్యం అవుతాయి. ఈ కమ్యూనికేషన్ ఒక తెర మీద పదాల రూపంలో కనపడుతుంది. ఈ పదాల్ని సంభాషణలా మార్చే అవకాశం కూడా ఉంది. దీంతో, చదవడం కన్నా వినే పద్దతిని ఇష్టపడే కస్టమర్లకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.
‘బాబ్ సంవాద్’ను మొదటి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో 250 శాఖల్లో అమల్లోకి తీసుకువస్తారు. దీని తరువాత, దశల వారీగా అన్ని బ్యాంకు శాఖల్లో ఈ పద్ధతిని అమలు చేస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2249903)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11