అణుశక్తి విభాగం
తొలిదశను దాటిన తమిళనాడులోని కల్పకం మోడల్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్
నాడు పోస్టు చేయడమైనది:
07 APR 2026 11:17AM by PIB Hyderabad
భారత అణు విద్యుత్ కార్యక్రమంలో కీలకమైన విజయం నమోదయింది. దీర్ఘకాల విద్యుత్ భద్రతను అందించడంలో, స్వదేశీ అణు పరిజ్ఞాన సాంకేతికతలను ముందుకు తీసుకెళ్లడంలో సాధించిన విజయాన్ని సూచిస్తూ.. 2026 ఏప్రిల్ 6 రాత్రి 8.25కు 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యమున్న ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్‌బీఆర్) విజయవంతంగా తొలి క్రిటికాలిటీని సాధించింది (నియంత్రిత అణు విచ్ఛిత్తి గొలుసు చర్య ప్రారంభమైంది).
డీఏఈ కార్యదర్శి, ఏఈసీ ఛైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మహంతి, ఐజీసీఏఆర్ డైరెక్టర్ శ్రీ శ్రీకుమార్ జీ పిళ్లై, భావిని సీఎండీ ఇన్‌చార్జి శ్రీ అల్లు అనంత్, భావిని మాజీ సీఎండీ, హోమీ సేత్నా ఛైర్మన్ శ్రీ కేవీ సురేష్ కుమార్ సమక్షంలో తొలి క్రిటికాలిటీ ప్రారంభమైంది. అణు విద్యుత్ నియంత్రణా బోర్డు (ఏఈఆర్‌బీ) నిబంధనలను పాటించడంతో ఇది సాధ్యమైంది. ప్లాంటు వ్యవస్థల భద్రతను క్షుణ్నంగా సమీక్షించిన అనంతరం అవసరమైన అనుమతులను ఏఈఆర్‌బీ జారీ చేసింది.
పీఎఫ్‌బీఆర్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నమూనాను ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చి (ఐజీసీఏఆర్), అణుశక్తి విభాగానికి చెందిన ఆర్ అండ్ డీ సెంటర్ దేశీయంగా అభివృద్ధి చేశాయి. అణుశక్తి విభాగంలోని ప్రభుత్వ రంగం సంస్థ అయిన భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ (భావిని) దీనిని నిర్మించి, ప్రారంభించింది.
భారత్ అనుసరిస్తున్న దీర్ఘకాల అణు వ్యూహంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు అత్యంత ప్రధానమైనవి. సంప్రదాయ థర్మల్ రియాక్టర్లలా కాకుండా, యురేనియం-ఫ్లుటోనియం కలిపిన ఆక్సైడ్ (ఎంవోఎక్స్) ఇంధనాన్ని పీఎఫ్‌బీఆర్ ఉపయోగిస్తుంది. పీఎఫ్‌బీఆర్ కోర్ చుట్టూ యురేనియం-238 పొర ఉంటుంది. వేగవంతమైన న్యూట్రాన్లు శుద్ధి చేసిన యురేనియం-238ను విచ్ఛిన్నమయ్యే ప్లూటోనియం-239గా మారుస్తాయి. దీనివల్ల రియాక్టర్ వినియోగించుకొనే దానికంటే అధిక ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. క్రమంగా బ్లాంకెట్‌లో థోరియం-232ను ఉపయోగించేలా ఈ రియాక్టర్‌ను రూపొందించారు. థోరియం-232 ను యురేనియం-233గా మారుస్తారు. ఇది భారతదేశ అణు విద్యుత్ కార్యక్రమ మూడో దశను వేగవంతం చేస్తుంది.
ఈ ప్రత్యేకమైన సామర్థ్యం.. అణు ఇంధన వనరుల వినియోగాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. అదేవిధంగా పరిమిత యురేనియం నిల్వల నుంచి మరింత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసేందుకు, అదే సమయంలో భవిష్యత్తులో థోరియంను భారీ స్థాయిలో వినియోగించుకొనేందుకు మార్గం సుగమం అవుతుంది.
తొలి క్రిటికాలిటీని సాధించడంతో, మూడు దశల అణు విద్యుత్ కార్యక్రమానికున్న పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకొనే దిశగా భారత్ మరింత ముందుకు సాగింది. ప్రస్తుత ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ల సముదాయానికి, భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే థోరియం ఆధారిత రియాక్టర్లకు మధ్య ఒక కీలకమైన వారధిగా ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ నిలుస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక శుద్ధ ఇంధన ఉత్పత్తి కోసం దేశంలో సమృద్ధిగా ఉన్న థోరియం వనరులను సద్వినియోగం చేసుకోవచ్చు.
భారత దేశానికున్న దేశీయ నమూనా, ఇంజినీరింగ్, తయారీ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ విజయం ప్రదర్శిస్తుంది. ఈ రియాక్టర్లో అధునాతన రక్షణ వ్యవస్థలు, అధిక ఉష్ణోగ్రత కలిగిన ద్రవ సోడియంతో చల్లబరిచే సాంకేతిక పరిజ్ఞానం, అణు పదార్థాల పునర్వినియోగాన్ని సాధ్యం చేసే క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ విధానం ఉన్నాయి. తద్వారా ఇది సుస్థిరతను మెరుగుపరిచి, వ్యర్థాలను తగ్గిస్తుంది.
దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, వస్తువులను ఉపయోగించి నమూనా, రూపకల్పన, నిర్మాణంలో భాగమైన అనేక మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, టెక్నీషియన్లు, పారిశ్రామిక భాగస్వాముల అంకితభావాన్ని ఈ ప్రాజెక్టు ప్రతిబింబిస్తుంది. వారి ప్రయత్నాలు.. అధునాతన న్యూక్లియర్ ఇంజినీరింగ్‌లో పెరుగుతున్న దేశ సామర్థ్యాన్ని, ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి అనుగుణంగా సాంకేతిక స్వావలంబన సాధించే భారత దేశ నిబద్ధతను తెలియజేస్తున్నాయి.
విద్యుదుత్పత్తి పరిధిని దాటి.. న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్ టెక్నాలజీ, అధునాతన పదార్థాలు, రియాక్టర్ ఫిజిక్స్, భారీ స్థాయి ఇంజినీరింగ్‌లో వ్యూహాత్మక సామర్థ్యాలను ఫాస్ట్ బ్రీడర్ కార్యక్రమం బలోపేతం చేస్తుంది.
శుద్ధ ఇంధన పోర్ట్‌ఫోలియోను భారత్ విస్తరిస్తున్న నేపథ్యంలో అత్యధిక ఉష్ణ సామర్థ్యంతో విశ్వసనీయమైన, తక్కువ కర్భన ఉద్ఘారాలున్న, బేస్-లోడ్ విద్యుత్‌ను అందించడంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు కీలకపాత్ర పోషిస్తాయి. మొదటి క్రిటికాలిటీని సాధించడం సాంకేతికపరమైన విజయం మాత్రమే కాకుండా.. వికసిత భారత్ కోసం సుస్థిరమైన, స్వయం సమృద్ధి సాధించిన ఇంధన భవిష్యత్తు దిశగా వేసిన ముఖ్యమైన అడుగును సూచిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2249675)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28