నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025–26లో అత్యధికంగా 6.05 గిగావాట్లతో వార్షిక పవన విద్యుత్ అదనపు సామర్థ్యాన్ని సాధించిన భారత్


56 గిగావాట్లను దాటిన దేశీయ మొత్తం స్థాపిత పవన విద్యుత్ సామర్థ్యం

2024–25తో పోలిస్తే పవన విద్యుత్ రంగం 46 శాతం వృద్ధి నమోదు

प्रविष्टि तिथि: 06 APR 2026 5:28PM by PIB Hyderabad

భారత్‌ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 6.05 గిగావాట్ల వార్షిక పవన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 5.5 గిగావాట్ల వార్షిక పవన విద్యుత్‌ గరిష్ట సామర్థ్య రికార్డును ఇది అధిగమించింది. 

గత ఆర్థిక సంవత్సరం (2024–25)తో పోలిస్తే ఈ ఏడాది అదనంగా చేరిన సామర్థ్యంలో దాదాపు 46 శాతం వృద్ధి నమోదైంది. ఇది దేశ భూభాగ పవన విద్యుత్ విస్తరణ పథంలో నిర్ణయాత్మకమైన వేగాన్ని సూచిస్తోంది.

తాజా వృద్ధితో దేశంలోని మొత్తం స్థాపిత పవన విద్యుత్ సామర్థ్యం 56 గిగావాట్లను దాటింది. మెరుగైన స్పష్టమైన విధానాలు, విద్యుత్ ప్రసార సంసిద్ధత, పోటీతత్వంతో కూడిన ధరల నిర్ణయం, పటిష్టమైన ప్రాజెక్టుల రూపకల్పన వంటి అంశాలు ఈ రంగంలో సాధించిన వృద్ధిని ప్రతిబింబించాయి.

నిరంతర విధాన మద్దతు, ప్రాజెక్టుల మెరుగైన అమలు, ప్రధాన పవన విద్యుత్ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల అభివృద్ధి ఫలితంగా ఈ మైలురాయిని సాధించడం సాధ్యమైంది. పెరుగుతున్న పవన-సౌర హైబ్రిడ్ ప్రాజెక్టులు, హరిత ఇంధన స్వేచ్ఛా వినియోగ ప్రగతిశీల విస్తరణ వంటి అంశాల కారణంగా గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఈ సంవత్సరంలో సామర్థ్య పెంపునకు కీలకపాత్ర పోషించాయి.

దేశ పవన శక్తి రంగం స్థిరంగా అభివృద్ధి చెందుతూ.. ప్రపంచంలోనే అగ్రగామి పవన శక్తి మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వాటిలో పవన విద్యుత్‌ టర్బైన్ల తయారీలో ఉపయోగించే కొన్ని భాగాలు, ముడి పదార్థాలపై రాయితీ కస్టమ్స్ సుంకాన్ని కల్పించడం.. జూన్ 2028 వరకు అంతర్‌ రాష్ట్ర ప్రసార వ్యవస్థ ఛార్జీల దశలవారీ మినహాయింపు, పోటీ బిడ్డింగ్ విధానాలు, ప్రత్యేక పవన పునరుత్పాదక వినియోగ బాధ్యత విధానాలు, జాతీయ పవన శక్తి సంస్థ నుంచి సాంకేతిక మద్దతు వంటివి ఉన్నాయి.

ఈ రికార్డు స్థాయి వృద్ధి దేశ పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను గణనీయంగా బలోపేతం చేయడమే కాకుండా 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే జాతీయ లక్ష్యానికి గొప్ప ఊతాన్ని ఇస్తుంది.

ప్రభుత్వ విస్తృత పునరుత్పాదక ఇంధన వ్యూహంలో భాగంగా 1990వ దశకం ప్రారంభంలో దేశ పవన శక్తి కార్యక్రమం ప్రారంభమైంది. గత మూడు దశాబ్దాలుగా గ్రిడ్-కనెక్టెడ్ పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు భారత్‌ ఒక బలమైన పవన శక్తి పర్యావరణ వ్యవస్థను, పటిష్టమైన విధానపరమైన వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంది.

 

***


(रिलीज़ आईडी: 2249509) आगंतुक पटल : 131
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Kannada