గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గనుల లీజులో సమీప ప్రాంతాలను, అనుబంధ ఖనిజాలను చేర్చేందుకు మార్గం సుగమం చేస్తూ, ఖనిజ రాయితీ నిబంధనల్లో సవరణలను ప్రకటించిన గనుల మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 06 APR 2026 7:29PM by PIB Hyderabad

అణు, హైడ్రో కార్బన్ ఇంధన ఖనిజాలు మినహా ఇతర ఖనిజాల రాయితీ (రెండవ సవరణ) నిబంధనలు -  2026ను గనుల మంత్రిత్వ శాఖ 2026 మార్చి 30న నోటిఫై చేసింది. ఈ సవరణల ద్వారా భూమి లోతులో ఉండే ఖనిజాల కోసం మైనింగ్ లీజ్, కంపోజిట్ లైసెన్స్‌లో సమీప ప్రాంతాలను చేర్చేందుకు, అలాగే భారీ, చిన్న తరహా ఖనిజాల మైనింగ్ లీజుల్లో అనుబంధ ఖనిజాలను చేర్చేందుకు సమగ్ర విధానాన్ని అందించారు.

గనుల,ఖనిజాల (అభివృద్ధి -  నియంత్రణ) చట్టం, 1957 (ఎంఎండిఆర్) కు చేసిన సవరణలకు అనుగుణంగా ఈ నిబంధనలలో మార్పులు చేశారు. ఎంఎండిఆర్ సవరణ చట్టం, 2025 ద్వారా తీసుకువచ్చిన ఈ మార్పులు సెప్టెంబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. దేశానికి అవసరమైన కీలక ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తిని పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ సవరణ ద్వారా తీసుకొచ్చిన సంస్కరణలు పరిశ్రమలకు ఖనిజాల సరఫరాను పెంచడానికి గనుల రంగానికి ఊతమిస్తాయి. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ ను బలోపేతం చేస్తాయి.

సవరించిన నిబంధనలు మైనింగ్ లీజు,  లేదా లోతుల్లోని (డీప్-సీటెడ్)  ఖనిజాల కాంపోజిట్ లైసెన్స్ కలిగిన వారు తమ లీజు ప్రాంతాన్ని పక్కనే ఉన్న భూభాగంతో  ఒకేసారి పొడిగించుకోవడానికి సమర్పించే దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి సరళమైన, గడువు ఆధారిత విధానాన్ని. అందిస్తాయి. మైనింగ్ లీజు విషయంలో ఈ అదనపు ప్రాంతం ప్రస్తుతం ఉన్న లీజు విస్తీర్ణంలో 10% మించకూడదు, అలాగే కాంపోజిట్ లైసెన్స్ (విషయంలో ఇది ప్రస్తుతం ఉన్న విస్తీర్ణంలో 30% మించకూడదు వేలం ద్వారా పొందిన మైనింగ్ లీజు  లేదా కాంపోజిట్ లైసెన్స్ కు పక్కనే ఉన్న ప్రాంతాన్ని అదనంగా కలిపినట్లయితే, ఆ అదనపు ప్రాంతం నుంచి తరలించే ఖనిజాలపై లీజుదారుడు వేలం ప్రీమియంలో 10% చెల్లించాలి. ఒకవేళ లీజును వేలం లేకుండానే మంజూరు చేసినట్లయితే, ఆ అదనపు ప్రాంతం నుంచి న తరలించే ఖనిజాలపై రాయల్టీతో సమానమైన అదనపు మొత్తాన్ని లీజుదారుడు చెల్లించాల్సి ఉంటుంది.

పక్కనే ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉండి, విడిగా వేరే లీజు లేదా లైసెన్స్ కింద తవ్వకాలు జరపడానికి ఆర్థికంగా లాభదాయకం కాని ప్రాంతాలను చేర్చడానికి అనుమతించడం వల్ల, భూగర్భంలో లోతుగా ఉండే  ఖనిజాల తవ్వకం మెరుగుపడుతుంది. 

ఈ నిబంధనలు మైనింగ్ లీజులో ఇతర ఏ ఖనిజాన్నైనా, చిన్న (మైనర్) ఖనిజాలను కూడా చేర్చే విధానాన్ని నిర్దేశిస్తాయి. అలాగే, దరఖాస్తు చేసిన 30 రోజులలోపే ఆ చేర్పును అనుమతించడం రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరి చేస్తాయి ఎంఎండిఆర్ చట్టంలోని ఏడవ షెడ్యూల్‌లో పేర్కొన్న కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలను, భూగర్భ లోతుల్లోని ఖనిజాలను చేర్చడంపై ఎటువంటి అదనపు రుసుము వర్తించదు. తక్కువ పరిమాణంలో లభించే, తవ్వడానికి, శుద్ధి చేయడానికి కష్టతరమైన ఖనిజాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఇది దోహదపడుతుంది.

ఎంఎండిఆర్ సవరణ చట్టం, 2025 అమలులోకి రాకముందు మంజూరు చేసిన చిన్న తరహా ఖనిజాల లీజుల్లో భారీ ఖనిజాలను చేర్చడానికి సంబంధించిన విధానాన్ని కూడా ఈ సవరణ వివరిస్తుంది. భవిష్యత్తులో మైనర్ ఖనిజాల లీజుల మంజూరు కోసం, ఇసుక మినహా ఇతర మైనర్ ఖనిజాల మైనింగ్ లీజులను  ఆ ప్రాంతంలో జీ3 స్థాయి వరకు అన్వేషణ  పూర్తయిన తర్వాతే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.  ఒకవేళ అన్వేషణలో ఆ ప్రాంతంలో ఏదైనా భారీ ఖనిజం ఉన్నట్లు గుర్తిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని మేజర్ మినరల్ బ్లాక్‌గా వేలం వేయాల్సి ఉంటుంది. గనుల తవ్వకాన్ని గరిష్ట స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది మరొక ముఖ్యమైన అడుగు.

సొంత వినియోగం కోసం ప్రభుత్వం అనుమతించిన (క్యాప్టివ్)  గనుల నుంచి ఖనిజాల విక్రయంపై ఉన్న పరిమితిని తొలగించడానికి, చట్టంలో చేసిన సవరణకు అనుగుణంగా సంబంధిత నిబంధనలను కూడా సవరించారు. గనులకు అనుసంధానించిన సొంత వినియోగ ప్లాంట్ (ఎండ్-యూజ్ ప్లాంట్లు)   వాటి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నప్పుడు, ఆ ప్లాంట్ల అవసరాలు తీరిన తర్వాత మిగిలిన ఖనిజాలను మైనింగ్ సంస్థలు అమ్ముకోవచ్చు ఒకవేళ సొంత వినియోగ ప్లాంట్  దాని పూర్తి సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో పనిచేస్తుంటే, ఆ ఆర్థిక సంవత్సరంలో ఆ ప్లాంట్‌లో వినియోగించిన ఖనిజ పరిమాణంతో సమానమైన మొత్తాన్ని మాత్రమే లీజుదారుడు విక్రయించవచ్చు. ఇది ఎంఎస్ఎమ్ఈలతో సహా మార్కెట్‌లో ఖనిజాల లభ్యతను పెంచుతుంది.

సవరణ నిబంధనలలో పొందుపరిచిన ఈ సరళమైన విధానం, ఈ రంగంలో వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని పెంపొందించడమే కాకుండా, కీలకమైన, వ్యూహాత్మక, లోతైన ఖనిజాల ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడుతుంది అదే సమయంలో, అదనపు చెల్లింపులు, ఉత్పత్తి పెరగడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయోజనం పొందుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, పరిశ్రమల సంఘాలు, ఇతర వాటాదారులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిబంధనలను రూపొందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2249487) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी