|
రక్షణ మంత్రిత్వ శాఖ
నావికాదళ పరిశోధన.. పరీక్ష సామర్థ్యాలను పెంచే దిశగా విశాఖపట్నంలోని ‘ఎన్‌ఎస్‌టీఎల్’లో ‘లార్జ్ కేవిటేషన్ టన్నెల్’కు రక్షణశాఖ మంత్రి శంకుస్థాపన
· ఈ ప్రాజెక్టుతో భారత్ బలమైన నావికాదళ శక్తిగా.. రక్షణ సాంకేతికతలో అగ్రగామిగా నిలుస్తుంది: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
03 APR 2026 8:13PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోగల ప్రతిష్ఠాత్మక ‘డీఆర్‌డీఓ’ ప్రయోగశాల ‘నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్)లో అత్యాధునిక ‘లార్జ్ కేవిటేషన్ టన్నెల్’ (ఎల్‌సీటీ) నిర్మాణానికి రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. దీనివల్ల భారత నావికాదళ పరిశోధన-పరీక్ష సామర్థ్యాలు గణనీయంగా మెరుగవుతాయి. తద్వారా సాంకేతిక స్వావలంబన సాధన లక్ష్యం దిశగా వేగం పయనంలో వేగం పెరుగుతుంది.
ఈ సందర్భంగా ‘ఎన్‌ఎస్‌టీఎల్’ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సిబ్బందిని ఉద్దేశించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. నేడు శంకుస్థాపన చేసిన ‘ఎల్‌సీటీ’ పూర్తయితే భారత్ తన సొంత వనరులతో దేశీయంగానే పరికరాలు, వ్యవస్థలు, ఉప వ్యవస్థల రూపకల్పన, తయారీ సహా పరీక్షలు కూడా నిర్వహించగలదని ఆయన పేర్కొన్నారు. తద్వారా మన దేశం బలమైన నావికాదళ శక్తిగా, రక్షణ సాంకేతికతలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం ప్రకటించారు. “ఇప్పటిదాకా పరికరాలు, వ్యవస్థలు, ఉప వ్యవస్థలను దేశం విజయవంతంగా తయారు చేసుకుంటోంది. కానీ, వీటన్నిటినీ ప్రయోగాత్మకంగా పరీక్షించే కీలక సదుపాయాల కోసం తరచూ విదేశాలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇకపై ఈ పరాధీనత పూర్తిగా తప్పుతుంది. ‘ఎల్‌సీటీ’ ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు పరిమితం కదు. ఇదొక సహాయక వ్యవస్థ... ప్రొపల్షన్ వ్యవస్థల తయారీలో మన సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. శబ్ద కాలుష్యం తగ్గింపుపై దృష్టి సారించే కృషికి వెసులుబాటు కల్పించడమే కాకుండా ‘స్టెల్త్’ సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది. జలాంతర్గాములు, యుద్ధ నౌకల రూపకల్పన-తయారీకి దన్నుగా నిలుస్తుంది. నావికా ఇంజనీరింగ్, సముద్ర రక్షణ వ్యవస్థలలో భవిష్యత్ ప్రగతికి తోడ్పడుతుంది” అని ఆయన విశదీకరించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయం సమృద్ధ భారత్ సంకల్ప సాకారానికి ఈ ప్రాజెక్టును ఒక ప్రతీకగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. దేశాన్ని స్వయం సమృద్ధం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం జాతీయ భద్రత వ్యవస్థలో అవిభాజ్యంగా ముడిపడి ఉందన్నారు. సమస్యలెన్ని ఉన్నా దేశీయ పరిశ్రమలు, విద్యాసంస్థలు, ‘ఎంఎస్‌ఎంఈ’లు, యువత, పరిశోధకుల సమష్టి కృషితో దేశం వివిధ రంగాలలో సంపూర్ణ స్వావలంబన సాధించిందని ఆయన పేర్కొన్నారు.
రక్షణశాఖ మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ‘ఎన్‌ఎస్‌టీఎల్’ ప్రాజెక్టులు, పరిశోధనల గురించి రక్షణ శాఖ పరిశోధన-అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ఆయనకు వివరించారు.
ఈ పర్యటనలో భాగంగా ‘సీ కీపింగ్ అండ్ మెనూవరింగ్ బేసిన్’ను కూడా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. అక్కడ టార్పిడోలు, నావికా మందుపాతరలు, డెకాయ్, అటానమస్ అండర్‌వాటర్ వెహికల్స్ (ఏయూవీ) వంటి అధునాతన జలాంతర్గత వ్యవస్థల అద్భుత ప్రదర్శనను వీక్షించారు.
మ్యాన్ పోర్టబుల్ ఏయూవీల బృందం ప్రత్యక్ష ప్రదర్శన, స్వయంప్రతిపత్తి గల సముద్ర కార్యకలాపాలు, భావితరం జలాంతర్గామి యుద్ధ సాంకేతికతలలో ఇనుమడిస్తున్న భారత్ సామర్థ్యాన్ని ఈ బృందం కళ్లకు కట్టేలా ప్రదర్శించింది. భవిష్యత్ సంసిద్ధ రక్షణ వ్యవస్థలపై దేశం దృక్కోణాన్ని ఈ ప్రదర్శన స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం ‘నావల్ సిస్టమ్స్ మెటీరియల్స్ క్లస్టర్ ల్యాబ్స్’ ద్వారా ‘స్పిన్-ఆఫ్ టెక్నాలజీ’లుగా రూపొందించిన కొన్ని కీలక ఉత్పత్తులను కూడా మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు.
భారత్‌ను శక్తిమంతమైన నావికాదళ శక్తిగా తీర్చిదిద్దడంలో టార్పిడో వ్యవస్థలు, జలగర్భంలో మందుపాతరలు, డెకాయ్, ఏయూవీలు సహా అనేక రంగాల్లో పరిశోధనల పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పిన ‘ఎన్‌ఎస్‌టీఎల్’ను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు.అలాగే ’స్వార్మ్ టెక్నాలజీ’ ప్రదర్శనను, లిథియం-అయాన్ బ్యాటరీ తయారీలో పురోగమనాన్ని కూడా ఆయన అభినందించారు. భవిష్యత్ యుద్ధ సన్నద్ధతలో ఇవన్నీ ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
దేశ భద్రత మౌలిక సదుపాయాల బలోపేతం ద్వారా భారత్ ప్రగతికి అంకితభావంతో కృషి చేయాలని ‘ఎన్‌ఎస్‌టీఎల్’ను ఆయన కోరారు. “ఈ వ్యవస్థలు, సాంకేతికతలు సముద్రంలో మోహరించే నావికుల ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచుతాయి. విశ్వసనీయ, పటిష్ఠ సాంకేతిక మద్దతుతో రక్షణ దళాల యుద్ధ సామర్థ్యం గణనీయంగా మెరుగవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ‘చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్’ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠీ, ‘ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్’ తూర్పు నావికాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
‘లార్జ్ కేవిటేషన్ టన్నెల్’ వివరాలు
ఈ ప్రాజెక్టును ఒక వ్యూహాత్మక జాతీయ సంపదగా పరిగణిస్తున్నారు. భవిష్యత్తరం యుద్దనౌకలు, జలాంతర్గాములు, జలాంతర్భాగ ప్లాట్‌ఫామ్‌ల రూపకల్పన-తయారీకి దోహదం చేయడమే దీని లక్ష్యం. ఈ దిశగా హైడ్రో డైనమిక్ పరిశోధనలో స్వదేశీ సామర్థ్య బలోపేతంలో ఇదొక కీలక మలుపు. ప్రభుత్వ ఆమోదం, అంతర్జాతీయ సాంకేతిక సహకారంతో ‘టర్న్‌కీ’ పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ నైపుణ్యం-స్వదేశీ ఆవిష్కరణల సముచిత సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది.
జలాంతర్గామి అధ్యయనాలకు అవసరమైన ‘క్లోజ్డ్-లూప్ సిమ్యులేషన్’లను, ఉపరితల నౌకల పరిశోధనకు కీలకమైన ‘ఫ్రీ సర్ఫేస్ సిమ్యులేషన్’లను ఒకే సమీకృత వ్యవస్థలో నిర్వహించగల సామర్థ్యం ఈ ప్రాజెక్టు ప్రత్యేకం. ఇది ప్రపంచంలోనే ఒక విశిష్ట మౌలిక సదుపాయంగా రూపొందనుంది. ‘ఎల్‌టీసీ’ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ‘డిస్ట్రాయర్లు, విమాన వాహక నౌకలు సహా ప్రధాన నావికా ప్లాట్‌ఫామ్‌ల కోసం హైడ్రోడైనమిక్ డిజైన్లు, ప్రొపల్షన్ వ్యవస్థల కచ్చితమైన ధ్రువీకరణ సుసాధ్యం కాగలదు. తద్వారా భారత యుద్ధనౌకా నిర్మాణ వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2248950)
|