బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను క్యాప్టివ్, వాణిజ్య గనుల్లో రికార్డు స్థాయి ఉత్పత్తి, రవాణాను సాధించిన బొగ్గు మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2026 3:04PM by PIB Hyderabad

దేశ బొగ్గు రంగంలో 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని ఒక చారిత్రాత్మక మైలురాయిగా బొగ్గు మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. దేశ చరిత్రలో తొలిసారిగా క్యాప్టివ్, వాణిజ్య గనుల బ్లాకుల నుంచి మొత్తం ఉత్పత్తి, రవాణా కలిపి 200 మిలియన్ టన్నుల మార్కును అధిగమించాయి. దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ రంగానికి ఉన్న సామర్థ్యం, భాగస్వామ్యం ఈ వృద్ధితో స్పష్టమైంది.

మార్చి 31, 2026 నాటికి క్యాప్టివ్, వాణిజ్య గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 210.46 మిలియన్ టన్నులకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 190.95 మిలియన్ టన్నులతో పోలిస్తే, ఇది 10.22 శాతం పటిష్టమైన వృద్ధిని సూచిస్తుంది. బొగ్గు రవాణా కూడా గణనీయంగా పెరిగి 204.61 మిలియన్ టన్నులకు చేరుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలోని 190.42 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 7.35 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ రికార్డు స్థాయి గణాంకాలు మెరుగైన కార్యకలాపాల సామర్థ్యం, పటిష్టమైన రవాణా వ్యవస్థ, దేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్ తీర్చడంలో ఈ రంగం సాధించిన ప్రగతికి నిదర్శనం.

2025–26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ముఖ్యమైన మైలురాళ్ళు

·       చారిత్రాత్మక 200కి పైగా మిలియన్ టన్నుల ఘనత: క్యాప్టివ్, వాణిజ్య బ్లాకుల నుంచి బొగ్గు ఉత్పత్తి, రవాణా మొదటిసారిగా 200 మిలియన్ టన్నుల మార్కును దాటింది. ఇది నిరంతర వృద్ధికి, అత్యుత్తమ పనితీరుకు నిదర్శనం.

·       కొత్త బ్లాకుల ప్రారంభం: 2025–26 ఆర్థిక సంవత్సరంలో గని ప్రారంభ అనుమతి మంజూరు చేయడం ద్వారా 12 క్యాప్టివ్, వాణిజ్య బొగ్గు బ్లాకులు కార్యకలాపాలను ప్రారంభించాయి. దీనివల్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 86 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా పెరిగి బొగ్గు తవ్వకాల పరిధి గణనీయంగా విస్తరించింది.

·       వేగవంతమైన ఉత్పత్తి ప్రారంభం: అదే ఆర్థిక సంవత్సరంలో మరో 7 బ్లాకులు బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాయి. ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడం, ప్రభుత్వ విభాగాల మధ్య మెరుగైన సమన్వయానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

image.png

గత నాలుగేళ్లలో క్యాప్టివ్, వాణిజ్య గనుల ఉత్పత్తి, రవాణా గణాంకాలు

గత నాలుగేళ్లుగా బొగ్గు ఉత్పత్తి, రవాణా రెండింటిలోనూ స్థిరమైన, క్రమమైన పెరుగుదల ధోరణిని ఈ గ్రాఫ్ వివరిస్తుంది. రవాణాలో కనిపిస్తున్న ఈ నిరంతర వృద్ధి.. మరింత సమర్థవంతమైన రవాణా, క్రమబద్ధమైన తరలింపు, పటిష్టమైన బొగ్గు సరఫరా వ్యవస్థను స్పష్టం చేస్తోంది.

ఈ చారిత్రాత్మక విజయం 'ఆత్మనిర్భర్ భారత్' పట్ల భారత్‌ ప్రదర్శిస్తున్న నిబద్ధతకు నిదర్శనం. కేంద్రీకృత విధానపరమైన చర్యలు , అనుమతుల సరళీకరణ, దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడంపై పెట్టిన ప్రత్యేక దృష్టి దీనికి ప్రధాన కారణం. క్యాప్టివ్, వాణిజ్య గనుల కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, జాతీయ వనరుల భద్రతను బలోపేతం చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ చేస్తున్న నిరంతర కృషిని ఇది చాటిచెబుతోంది.

ఇదే ఉత్సాహంతో 2025–26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన విజయాలు ‘వికసిత్‌ భారత్ 2047’ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో బొగ్గు రంగం పోషిస్తున్న కీలక పాత్రను మరింత బలపరుస్తున్నాయి. సామర్థ్యం, విస్తరణ, బాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులకు ప్రాధాన్యతనిస్తూ.. పారిశ్రామిక వృద్ధిని కొనసాగించేదుకు, ఆర్థిక విస్తరణకు మద్దతు ఇవ్వడానికి, దేశానికి పటిష్టమైన, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్న ఇంధన వ్యవస్థను అందించడానికి ఈ రంగం సిద్ధంగా ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2248625) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Urdu , हिन्दी