కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా హాట్‌స్పాట్‌లతో పబ్లిక్ వై-ఫై విస్తరణను వేగవంతం చేస్తున్న పీఎం - వాణి పథకం
నాడు పోస్టు చేయడమైనది:
02 APR 2026 6:21PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను వేగంగా విస్తరించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి వై-ఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ (పీఎం- వాణి) పథకం ద్వారా ప్రభుత్వం పబ్లిక్ వై-ఫై సదుపాయాన్ని ప్రోత్సహిస్తోందని కేంద్ర కమ్యూనికేషన్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా తెలిపారు.
ఫిబ్రవరి 28, 2026 నాటికి, దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పీఎం - వాణి పథకం కింద మొత్తం 4,09,403 పబ్లిక్ డేటా ఆఫీసులు (పీడీఓలు) / పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌లు అందుబాటులోకి వచ్చాయనీ, ఈ పథకం కింద 207 పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు (పీడీఓఏలు), 113 యాప్ ప్రొవైడర్లు నమోదయ్యారని శ్రీ సింధియా ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు. పీఎం-వాణి పథకం కింద పబ్లిక్ డేటా ఆఫీసులు, అగ్రిగేటర్లు, యాప్ ప్రొవైడర్ల వివరాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా నమోదు చేస్తున్నారు. వై-ఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటులో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి.
ఫిబ్రవరి 28, 2026 నాటికి పీఎం-వాణి హాట్‌స్పాట్‌లను ఉపయోగించిన మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2,44,67,896 కి చేరిందని, ఇది దేశంలో పబ్లిక్ వై-ఫై సేవల పట్ల పెరుగుతున్న ఆదరణకు సంకేతమని కేంద్ర మంత్రి తెలిపారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి పీఎం-వాణి హాట్‌స్పాట్ల ద్వారా సుమారు 58.64 పెటాబైట్ల డేటా వినియోగం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
పీఎం-వాణి చట్రం వికేంద్రీకృత, మార్కెట్ ఆధారిత నమూనాపై పనిచేస్తుంది. ఇది సాంకేతిక, వాణిజ్య సాధ్యతలను బట్టి వై-ఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంది. ప్రధానంగా విధానపరమైన వెసులుబాటు కల్పించడమే ఇందులో ప్రభుత్వం పాత్ర.
గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో పీఎం-వాణి హాట్‌స్పాట్‌ల వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొన్ని కీలక విధానపరమైన చర్యలను ప్రవేశపెట్టింది.
ఖర్చు తగ్గించే చర్యలు: పబ్లిక్ డేటా ఆఫీసులకు ఫైబర్-టు-ది-హోమ్ (ఎఫ్టీటీహెచ్) కనెక్షన్లను ఉపయోగించి సేవలు అందించేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే, అనేక యాక్సెస్ పాయింట్లను ఒకే బ్యాక్‌హాల్ ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు కలిపే విధంగా సమీకరించుకునే అవకాశం కల్పించారు.
ఆదాయ పెంపు అవకాశాలు: టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు మొబైల్ డేటా ఆఫ్‌లోడింగ్ సేవలు అందించేందుకు పబ్లిక్ డేటా ఆఫీసులకు అనుమతి ఇచ్చారు. వినియోగదారుల సమ్మతితో వారికి ప్రచార, బ్రాండెడ్ కంటెంట్ అందించడానికి పిడిఓఏలు, యాప్ ప్రొవైడర్లకు కూడా అనుమతి లభించింది.
మెరుగైన వినియోగదారు అనుభవం: ప్రస్తుతం ఉన్న ఇళ్లు, వ్యాపార సంస్థల వై-ఫై నెట్‌వర్క్‌లను పీఎం-వాణి వ్యవస్థలో అనుసంధానించవచ్చు. దీనికి తోడు, పిడిఓఏలు తమలో తాము రోమింగ్ సౌకర్యం కల్పించుకునేలా వీలు కల్పించారు. దీనివల్ల వినియోగదారులు వేర్వేరు పీఎం-వాణి హాట్‌స్పాట్‌ల పరిధిలో ఉన్నప్పటికీ ఎటువంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.
భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) 16.06.2025న జారీ చేసిన టారిఫ్ ఆర్డర్ ద్వారా మరో కీలక మార్పు చేసింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తమ రిటైల్ ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను (200 ఎంబీపీఎస్ వరకు) పబ్లిక్ డేటా ఆఫీసులకు అందించాలని ఆదేశించింది. ఈ ప్లాన్‌ల ధరలు సాధారణ వినియోగదారుల బ్రాడ్‌బ్యాండ్ ధరల కంటే రెండింతలకు మించకూడదని నిబంధన విధించింది, తద్వారా పీఎం - వాణి సేవలను మరింతగా మెరుగుపరుస్తోంది.
పీఎం-వాణి వ్యవస్థ స్థోమత, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2248613)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10