వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో దృశ్య మాధ్యమం ద్వారా కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ సమీక్షా సమావేశం
రైతుల ఐడీలూ, ఎరువుల లభ్యతతో పాటు ‘పీఎం‑ఆశా’ను ప్రభావవంతంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి
19 రాష్ట్రాల్లో 9.25 కోట్ల రైతు ఐడీలు సిద్ధం: శ్రీ చౌహాన్
ఎరువుల అక్రమ నిల్వలపై, నల్లబజారు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ
రాష్ట్రాలకు శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఆదేశం
రైతుల పంటకు న్యాయమైన ధర అందాలి..
వారి ఫిర్యాదుల్ని సకాలంలో పరిష్కరించాలి..
రైతుల నుంచే నేరుగా కొనుగోలు చేయాలన్న శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్
ప్రాంతీయ వ్యవసాయ సమావేశాలు ఏప్రిల్ 7న జైపూర్ నుంచి మొదలు: కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ చౌహాన్
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 8:57PM by PIB Hyderabad
రైతుల ఐడీలూ, ఎరువుల లభ్యత, వివిధ వ్యవసాయ పథకాల పురోగతి సంబంధిత అంశాలను సమీక్షించడానికి రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రైతులను వారి భూమితో, పంటలతో, పశుగణంతో, మత్స్యపాలన ప్రక్రియతో అనుసంధానించడానికి రైతు ఐడీ ఒక ముఖ్య సాధనమన్నారు. ఇంతవరకు 19 రాష్ట్రాల్లో మొత్తంమీద 9.25 కోట్ల రైతు ఐడీల్ని రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ, రెవెన్యూ విభాగాలు కలిసి ఒక ప్రచార ఉద్యమాన్ని మొదలుపెట్టి, రాబోయే ఆరు నెలల లోపల 100 శాతం లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో, రైతు నమోదు ప్రక్రియను ఒక్క పీఎం‑కిసాన్ లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేయకుండా, అర్హులైన రెతులందరినీ ఇందులో చేర్చేలా చూడడానికి ప్రజాచైతన్య ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కూడా ఆయన అన్నారు.
ఎరువుల లభ్యత అంశాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ, రైతులకు ఎరువుల అందుబాటులో ఎలాంటి లోటునూ రానీయకూడదన్నారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం, నల్లబజారులో విక్రయించడం వంటి ధోరణులను కఠినంగా అరికట్టాలని రాష్ట్రాలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైతుల అవసరాలకు తగినట్లుగా ఎరువులను అందించేలా చర్యలు తీసుకోవాలనీ, దీని కోసం సాంకేతికత ఆధారిత సమాన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఎరువుల అసమతౌల్య ఉపయోగాన్ని నివారించడానికి, సేంద్రియ సాగుని, ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చైతన్యాన్ని పెంచడం ముఖ్యమని కూడా ఆయన అన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాను కొనసాగించాల్సిందిగా ఆయన ఆదేశాలిస్తూ, ఎరువులను చట్టవిరుద్ధంగా తరలించడాన్ని అడ్డుకోవాలని స్పష్టం చేశారు. హర్యానాలో అమలు చేస్తున్న ‘మేరీ ఫసల్, మేరా బ్యోరా’ కార్యక్రమాన్ని శ్రీ చౌహాన్ ప్రశంసించారు. ఈ నమూనాను ఇతర రాష్ట్రాలు అమలు చేయవచ్చని మంత్రి తెలిపారు.
పీఎం‑ఆశా పథకంలో భాగంగా పప్పుధాన్యాలనూ, నూనెగింజలనూ కనీస మద్దతు ధరకు (ఎమ్ఎస్‌పీ) కొనుగోలు చేసే అంశంపైనా సమీక్షను నిర్వహించారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం పప్పుధాన్యాలనూ, నూనెగింజలనూ ఎమ్ఎస్‌పీపై కొనుగోలు చేస్తుందనీ, ఈ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు పాలుపంచుకుంటాయనీ శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
నమోదిత పంటలను కొనుగోలు చేయడానికి ఈ కింద ప్రస్తావించిన రాష్ట్రాలకు అనుమతులను ఇటీవల మంజూరు చేశారు:
• ఆంధ్రప్రదేశ్ (సెనగలు, పెసర్లు, మినప, కంది, వేరుసెనగ),
• అస్సాం (ఆవాలు),
• బీహార్ (ఎర్ర కందిపప్పు),
• ఛత్తీస్‌గఢ్ (సెనగలు, ఎర్ర కందిపప్పు, ఆవాలు),
• గుజరాత్ (సెనగలు, ఆవాలు),
• హర్యానా (సెనగలు, ఆవాలు),
• కర్నాటక (సెనగలు, కుసుమలు),
• మహారాష్ట్ర (సెనగలు),
• మధ్యప్రదేశ్ (సెనగలు),
• రాజస్థాన్ (సెనగలు, ఆవాలు),
• తెలంగాణ (సెనగలు, ఆవాలు, వేరుసెనగ, పొద్దుతిరుగుడు),
• ఉత్తరప్రదేశ్ (సెనగలు, ఎర్ర కందిపప్పు, ఆవాలు).
కొనుగోళ్లను న్యాయమైన సగటు నాణ్యత (ఫెయిర్ ఏవరేజ్ క్వాలిటీ..ఎఫ్ఏక్యూ)కు సంబంధించిన ఫలసాయానికి మాత్రమే పరిమితం చేయాల్సిందిగా కేంద్ర మంత్రి ఆదేశించారు. రైతుల నమోదు ప్రక్రియను ఆధార్‌తో ముడిపెట్టిన పోర్టళ్లపైనే నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాల్లో బయమెట్రిక్, లేదా ముఖం గుర్తింపు పద్దతిని తప్పనిసరి చేయాలని సూచించారు. చెల్లింపులను ‘ఆధార్’ ఆధారిత డీబీటీ (ప్రత్యక్ష ప్రయోజన బదిలీ) మాధ్యమం ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా చేయాలని, రైతు సోదరీ, సోదరులకు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోవాల్సిన పని ఉండకుండా కొనుగోలు కేంద్రాల్ని తగినంత సంఖ్యలో ఏర్పాటు చేయాలని తెలిపారు.
అలాగే, రైతులు వారు పండించిన పంటలకు న్యాయమైన ధరను అందుకొనేటట్లు రాష్ట్రాలు చూడాలనీ, వారి ఫిర్యాదుల్ని సకాలంలో పరిష్కరించాలని, నేరుగా రైతుల నుంచే కొనుగోళ్లను పూర్తి చేయాలని ఆయన కోరారు.
ప్రాంతీయ వ్యవసాయ సమావేశాలపై ఈ దిగువ సమాచారం అందజేత
దీనికి అదనంగా, ప్రాంతీయ వ్యవసాయ సమావేశాల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని మంత్రి పంచుకున్నారు. దేశాన్ని అయిదు వ్యవసాయ‑క్లైమేటిక్ జోన్లుగా విభజించి, ప్రతి ఒక్క జోన్లోనూ సమగ్ర చర్చలు జరపాలని ఆయన అన్నారు. దీనిలో భాగంగా, పశ్చిమ జోనును దృష్టిలో పెట్టుకొని, తొలి సమావేశాన్ని జైపూర్‌లో ఏప్రిల్ 7న నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ (వీకేఎస్ఏ)ను గురించి కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ, కిందటి సంవత్సరం నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. దానిలో 726 జిల్లాలకు చెందిన 60,000కి పైగా గ్రామాలలో శాస్త్రవేత్తలు రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని మంత్రి తెలిపారు. ఈ సాఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రాలు ఈ సంవత్సరం మే నెలలో ఈ ప్రచార కార్యక్రమాన్ని 15-20 రోజుల పాటు నిర్వహించాలని ఆయన కోరారు. ప్రయోగశాల నుంచే పొలాన్ని అనుసంధించడాన్ని పటిష్ఠపరచడం, కొత్త సాంకేతికతలను, మెరుగైన రకాలను, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యాలని ఆయన వివరించారు.
ఈ ప్రచార ఉద్యమానికి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)తో పాటు వ్యవసాయ మంత్రిత్వ శాఖ మద్దతును అందిస్తాయి. నోడల్ అధికారులను రాష్ట్రాలు నియమిస్తాయి. భూమి స్వస్థతకీ, ఎరువులను ఎక్కువ తక్కువలు కాకుండా సరిపడ స్థాయిలో ఉపయోగించడానికీ, నాణ్యమైన విత్తనాలను వాడడాన్ని గురించి అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమంలో పెద్దపీట వేస్తారు.
రైతులకు న్యాయమైన ధరలు లభించేటట్లు చూడడం, పారదర్శక కొనుగోలు వ్యవస్థను నిర్వహించడం, సమర్థ పంపిణీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రాల ప్రాథమిక బాధ్యత అని కేంద్ర మంత్రి సమావేశం చివర్లో స్పష్టం చేశారు. ఈ చర్యలతో వ్యవసాయ రంగాన్ని పటిష్ఠపరచవచ్చని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యానా, ఉత్తరాఖండ్‌తో పాటు మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రులూ, ప్రతినిధులూ పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2248288)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20