బొగ్గు మంత్రిత్వ శాఖ
ఒడిశాలోని లఖన్‌పూర్‌లో బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్టు కోసం బీసీజీసీఎల్, ఎంసీఎల్ మధ్య కీలక భూ లీజు ఒప్పందం
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 6:08PM by PIB Hyderabad
ఒడిశాలోని లఖన్‌పూర్‌లో ఏర్పాటు కానున్న బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టు కోసం భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (భారత బొగ్గు వాయువీకరణ, రసాయనాల సంస్థ-బీసీజీసీఎల్), మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) మధ్య కీలక భూ లీజు ఒప్పందం కుదిరింది. న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందాన్ని దేశ బొగ్గు గ్యాసిఫికేషన్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక పరిణామంగా భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 2,000 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను బొగ్గు నుంచి ఉత్పత్తి చేయనున్నారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గ్యాసిఫికేషన్ సాంకేతికతను ఉపయోగించనున్న దేశంలోనే మొదటి ప్రాజెక్టు కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ఇంధన, రసాయన రంగాల్లో విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, స్వదేశీ ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతికి నిదర్శనంగా నిలవనుంది.
మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ పరిధిలోని సుమారు 350 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇటీవల తీసుకువచ్చిన విప్లవాత్మక విధాన సంస్కరణల వల్ల బొగ్గు నిక్షేపాలున్న భూములను గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల కోసం వినియోగించే అవకాశం కలిగింది. ఇది దేశంలోని అపారమైన బొగ్గు వనరులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడానికి, బొగ్గు రంగం విస్తరణకు దోహదపడుతుంది.
బొగ్గు గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద ఈ ప్రాజెక్టుకు రూ.1,350 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రాజెక్టు పనులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో వేగం పుంజుకున్నాయి. ప్రధాన ఎల్‌ఎస్‌టీకే ప్యాకేజీలలో ఎల్‌ఎస్‌టీకే-1, ఎల్‌ఎస్‌టీకే-2లను బీహెచ్‌ఈఎల్ దక్కించుకోగా.. ఎల్‌ఎస్‌టీకే-3, ఎల్‌ఎస్‌టీకే-4 ప్యాకేజీలను లార్సెన్ టూబ్రో సంస్థ దక్కించుకున్నది. సరిహద్దు గోడల నిర్మాణం, చెట్ల లెక్కింపు వంటి ప్రాంత అభివృద్ధి పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి.
భూ లీజు ఒప్పంద కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా బొగ్గు రంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. బొగ్గు రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. దేశంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని.. అయితే ఆ వనరులను కేవలం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా, భారీ స్థాయిలో బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి కేంద్ర కేబినెట్ రూ. 8,500 కోట్లు కేటాయించిందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 7 ప్రాజెక్టులను ఖరారు చేయగా, అందులో మూడింటికి భూమి పూజ కూడా పూర్తయిందని తెలిపారు. సుమారు రూ.25,000 కోట్ల పెట్టుబడితో ఎంసీఎల్, బీసీజీసీఎల్ మధ్య కుదిరిన ఈ భూ లీజు ఒప్పందం.. బీసీజీసీఎల్ మొదటి స్వదేశీ ప్రాజెక్టుగా నిలుస్తుందని తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక విప్లవాత్మక మార్పు కానుందని, దీనివల్ల విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గి, విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి సాంకేతికతలను అందిపుచ్చుకుంటూనే, స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. దీనిని పర్యావరణ , భారీ పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖల సమన్వయంతో ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా అమలు చేయాలని, వీలైతే నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేయాలని పరిశ్రమలు, భాగస్వామ్య పక్షాలను ఆయన కోరారు.
బీసీజీసీఎల్, ఎంసీఎల్ మధ్య జరిగిన ఈ భూ లీజు ఒప్పందం దేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుందని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ అభివర్ణించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ఆత్మనిర్భరత దిశగా అడుగులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, మన దేశీయ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలని తెలిపారు.
ప్రాజెక్టు అమలుకు అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు, పనిని కేటాయిస్తూ అధికారిక లేఖ, టెండర్ ప్రక్రియలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని శ్రీ దత్ తెలిపారు. ఇది ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో కూడిన స్వదేశీ సాంకేతిక అభివృద్ధికి ఒక గొప్ప నమూనాగా నిలుస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే భాగస్వామ్యులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య పటిష్టమైన సమన్వయం ఉండాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా బీసీజీసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ప్రాజెక్టు అమలులో పారదర్శకతను పెంచడం, సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం, భాగస్వామ్య పక్షాలతో సమన్వయం మెరుగుపరచడం ఈ వెబ్‌సైట్ ప్రధాన ఉద్దేశ్యం. ప్రాజెక్టుకు చెందిన తాజా సమాచారం, టెండర్ల వివరాల కోసం ఇది ఒక కేంద్ర వేదికగా పనిచేస్తుంది.
ఈ భూ లీజు ఒప్పందం వల్ల ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం అవుతాయని, నిర్దేశించిన గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. లఖన్‌పూర్ బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ తయారు చేసే పారిశ్రామిక ప్రాజెక్టు.. సాంకేతిక ప్రగతికి, విధానపరమైన సంస్కరణలకు, దేశ స్వయం సమృద్ధి పోరాటానికి చేస్తున్న ప్రయత్నాలకు ఒక నిదర్శనం. దేశ దీర్ఘకాలిక పారిశ్రామిక వృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి కూడా తోడ్పడుతుంది.
మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇలాంటి స్వదేశీ ప్రాజెక్టులు దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రాజెక్టు వినూత్న ఆవిష్కరణలు, వనరుల సమర్థ వినియోగం, సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. ఇది దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో కీలకంగా నిలవనుంది.
***
(రిలీజ్ ఐడి: 2248106)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24