సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ సహకార విధానం-2025 అమలును వేగవంతం చేసేందుకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ సదస్సు నిర్వహణ


గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ "సహకార్ సే సమృద్ధి" దార్శనికతను క్షేత్రస్థాయిలో వేగంగా అమలు చేయటంపై కేంద్రం, రాష్ట్రాలు, నిపుణుల చర్చలు

సహకార సంఘాలను దేశ ఆర్థిక వృద్ధికి రెండో ఇంజిన్‌గా తీర్చిదిద్దే సమగ్ర, భవిష్యత్ ప్రణాళికను అందించే జాతీయ సహకార విధానం-2025

సహకార రంగాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని కేంద్ర సహకార శాఖ సహాయమంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్ పిలుపు

పీఏసీఎస్ కంప్యూటరీకరణ, వికేంద్రీకృత నిల్వ, సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యత

ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాల తోడ్పాటును మూడు రెట్లు పెంచే వ్యూహాలపై నిపుణుల చర్చ

చివరి లబ్ధిదారుడికి కూడా తక్కువ వడ్డీకి రుణాలు అందించటంలో సమర్థవంతంగా పని చేసే సహకార రంగం

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2026 4:46PM by PIB Hyderabad

గౌరవ ప్రధానమంత్రి "సహకార్ సే సమృద్ధి" దార్శనికతను వేగవంతం చేయటానికి, జాతీయాభివృద్ధికి కీలక ఇంజిన్‌గా సహకార రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో నేడు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో "జాతీయ సహకార విధానం-2025 అమలు మార్గాలు, భవిష్యత్ కార్యాచరణ" ఇతివృత్తంతో జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ, "త్రిభువన్" సహకార విశ్వవిద్యాలయం (టీఎస్‌యూ) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ నూతన విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయటంపై దేశవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తలు, సహకార సంస్థల ప్రతినిధులు, నిపుణులు, భాగస్వాములు పాల్గొని చర్చించారు.

భారత సామాజిక-ఆర్థిక వ్యవస్థలో సహకార ఉద్యమం కీలక ఆధారంగా నిలిచిందని, దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాలను శక్తిమంతం చేయటంలో కీలక పాత్ర పోషించిందని కేంద్ర సహాయమంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్ తెలిపారు. మారుతున్న కాలం, పెరుగుతున్న గ్రామీణాభివృద్ధి కాంక్ష, మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జాతీయ సహకార విధానం-2025 సమగ్ర, భవిష్యత్ ప్రణాళికతో రోడ్‌మ్యాప్‌ను అందిస్తుందని ఆయన చెప్పారు. దేశ ఆర్థికవృద్ధికి రెండో ఇంజిన్‌గా సహకార రంగం నిలిచేలా ఈ విధానం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సహకార సంఘాల ద్వారా సమ్మిళిత అభివృద్ధిని వేగవంతం చేయటం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నూతనోత్తేజం అందించటం, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో గణనీయమైన సహకారాన్ని అందించటమే ఈ విధాన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

 

దేశవ్యాప్తంగా 17 సమావేశాలు, 4 ప్రాంతీయ కార్యశాలలు నిర్వహించిన 48 మంది సభ్యుల జాతీయ కమిటీ అందించిన సూచనల మేరకు, సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఈ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర సహకార శాఖ సహాయమంత్రి వెల్లడించారు. ఈ విధానంలోని కీలక అంశాల గురించి వివరిస్తూ.. సహకార సంస్థల మూలాలను బలోపేతం చేయటం, సహకార సంఘాలను విస్తరించటం, క్రీయాశీలక వ్యాపార వ్యవస్థను అభివృద్ధి చేయటం, పారదర్శకమైన, వృత్తిపరమైన నిర్వహణను నిర్ధారించటం, సభ్యుల ప్రయోజానాలే కీలకంగా వ్యవహరించటం, నూతన రంగాలకు విస్తరించటంతో పాటు యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయటానికి సొంత సహకార విధానాలను రాష్ట్రాలు రూపొందించుకోవాలని సూచించారు.

జాతీయ సహకార విధానం-2025కి అనుగుణంగా సహకార మంత్రిత్వ శాఖ చేపట్టిన పలు విప్లవాత్మక మార్పులను శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పీఏసీఎస్‌లను బహుముఖ ఆర్థిక యూనిట్లుగా మార్చటం, అవి 25కు పైగా కార్యకలాపాలను నిర్వహించేలా వీలు కల్పించడం, "త్రిభువన్" సహకార విశ్వవిద్యాలయ స్థాపన, శ్వేత విప్లవం 2.0 ప్రారంభం, జాతీయ సహకార డాటాబేస్ ఏర్పాటు, సహకార ర్యాంకింగ్ వ్యవస్థ, భారత్ టాక్సీ వంటి వినూత్న కార్యక్రమాలున్నాయని తెలిపారు. నూతన విధానాన్ని నిర్ణీత కాలవ్యవధిలో సమర్థవంతంగా అమలు చేయటానికి ఈ సదస్సు కీలకంగా మారుతుందని, సహకార రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు

ఈ సందర్భంగా సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భుటానీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 80,000లకు పైగా పీఏసీఎస్‌ల డిజిటలీకరణ జరుగుతున్నట్లు తెలిపారు. వీటిని బహుళ ప్రయోజనకర, వ్యాపార ఆధారిత, సమర్థవంతమైన సంస్థలుగా మార్చటమే దీని లక్ష్యమని చెప్పారు. పీఏసీఎస్‌ స్థాయిలో నిల్వ సౌకర్యాల వికేంద్రీకరణ, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడటం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించటం, రవాణా ఖర్చులను తగ్గించటం వంటివి మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతలని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ ప్రత్యేక ఉపన్యాసమిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థకు సహకార రంగం అందించే మద్దతును మూడు రెట్లు పెంచే వ్యూహాలను తెలిపారు. సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధికి శక్తిమంతమైన సాధనాలుగా సహకార సంస్థలు ఎదుగుతాయని చెప్పారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు డైరెక్టర్ శ్రీ సతీష్ మరాఠే మాట్లాడుతూ.. సమాజంలోని చివరి లబ్దిదారుడికి తక్కువ వడ్డీకే రుణాలను అందించటంలో సహకార రంగం సమర్థవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.


 

ఈ సదస్సులో భాగంగా డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి ఇంజిన్లుగా పీఏసీఎస్‌లను బలోపేతం చేయటం, సభ్యుల విద్య, యువత, మహిళల భాగస్వామ్యం, సేంద్రీయ ఉత్పత్తుల విపణిలో నాయకత్వం, సహకార క్రెడిట్, బ్యాంకింగ్ వంటి వివిధ అంశాలపై ఇతివృత్తాల వారీగా చర్చలు జరిగాయి. బ్రేక్ అవుట్ సెషన్లు, బహిరంగ చర్చల ద్వారా విధానాల అమలుకు సంబంధించి ఆచరణాత్మక సిఫార్సులను అందించగా.. భవిష్యత్ కార్యాచరణపై ముగింపు సమావేశంలో చర్చలు జరిగాయి.

జాతీయ సహకార విధానం-2025ని సమర్థవంతంగా అమలు చేయటంలో ఈ జాతీయ సదస్సు ముఖ్య వేదికగా నిలిచింది. ఇది సహకార రంగాన్ని మరింత పారదర్శకంగా, సాంకేతికతతో, ప్రజాహిత వ్యవస్థగా బలోపేతం చేస్తుందని, తద్వారా “సహకార్ సే సమృద్ధి” దార్శనికత సాకార ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆశిస్తున్నారు.


(రిలీజ్ ఐడి: 2247065) సందర్శకుల సూచీ సంఖ్య : : 76
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Gujarati