సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
దేశాలతో సాంస్కృతిక, నాగరిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా కార్యక్రమాలు
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2026 1:10PM by PIB Hyderabad
సాంస్కృతిక ఒప్పందాలను కుదుర్చుకోవడం, సాంస్కృతిక ఆదానప్రధాన కార్యక్రమాలు, సాంస్కృతిక సహకారంపై అవగాహన ఒప్పందాలు మొదలైనవాటితోపాటు జీ20, బ్రిక్స్, ఎస్‌సీవో, సార్క్ వంటి బహుపాక్షిక సాంస్కృతిక వేదికలకు ఆతిథ్యమివ్వడం, వాటిలో భాగస్వామ్యం వహించడం ద్వారా... సాంస్కృతిక శాఖ భారతీయ కళలకు, సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పిస్తూ విదేశాలతో సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ భాగస్వామ్య పథకాన్ని కూడా నిర్వహించిన సాంస్కృతిక శాఖ.. దాని ద్వారా విదేశాల్లో భారతీయ పండుగలను నిర్వహించడంతోపాటు, భారత రాయబార కార్యాలయాల ద్వారా వివిధ దేశాల్లో ఉన్న భారత్ - విదేశీ మిత్ర సాంస్కృతిక సమాజాలకు గ్రాంట్లను అందిస్తోంది.
అంతేకాకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ అయిన భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్) కూడా సాంస్కృతిక కేంద్రాల ద్వారా విదేశాల్లో భారతీయ సంస్కృతికి ప్రాచుర్యం కల్పిస్తోంది.
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘జ్ఞాన భారతం’ అనే జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాతప్రతుల పునరావిష్కరణ, సంరక్షణ, డిజిటలీకరణలతోపాటు.. సజీవ వైజ్ఞానిక వనరులుగా భవిష్యత్ తరాలకు జాతీయ డిజిటల్ భాండాగారంలో వాటిని అందుబాటులో ఉంచడం కోసం దీన్ని ప్రారంభించారు. క్రమబద్ధమైన సర్వే - ప్రామాణీకరణ, వైజ్ఞానిక సంరక్షణ, డిజిటలీకరణ, ప్రచురణలతోపాటు జాతీయ డిజిటల్ భాండాగారాన్ని (నేషనల్ డిజిటల్ రిపోజిటరీ - ఎన్డీఆర్) ఏర్పాటు చేయడం ద్వారా.. దేశంలోని రాతప్రతుల పరంపరను సంరక్షించడం, పునరుజ్జీవింపజేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. పరిశోధన, విద్యా పరమైన ప్రయోజనాలతోపాటు ప్రజల భాగస్వామ్యం కోసం కూడా అవి అందుబాటులోకి వస్తాయి.
ఇతర దేశాలతో కలిసి ఉమ్మడి కార్యక్రమాలను ఐసీసీఆర్ నిర్వహిస్తుంది. విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు/ సంబంధిత అధికారులతో సంప్రదింపుల ద్వారా.. అక్కడి విశ్వవిద్యాలయాల్లో భారతీయ అధ్యయన పీఠాలను ఐసీసీఆర్ ఏర్పాటు చేస్తుంది. ఈ భారతీయ అధ్యయన పీఠాలు భారతీయ నాగరికత అధ్యయనంపై విదేశీ యువతను ప్రోత్సహించడంతోపాటు.. భారత సాంస్కృతిక వారసత్వం పట్ల లోతైన అవగాహనను కలిగిస్తాయి. అదేవిధంగా ప్రపంచ స్థాయి విద్యా, మేధోపరమైన, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. గత మూడేళ్లుగా వివిధ కళారూపాలకు చెందిన 210 సాంస్కృతిక బృందాలను ఐసీసీఆర్ పలు దేశాలకు పంపింది. ఏటా 192 దేశాలకు చెందిన విద్యార్థులకు యోగా, ఆయుర్వేదం సహా.. భారత్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ స్థాయి చదువుల కోసం 21 పథకాల కింద 4000కు పైగా ఉపకార వేతనాలను ఐసీసీఆర్ మంజూరు చేస్తుంది.
రాతప్రతులు, ప్రాచీన పత్రాలు, అరుదైన పుస్తకాలు, ఆడియో-విజువల్ మెటీరియల్, చారిత్రక విలువ కలిగిన రికార్డులు సహా.. అంతర్జాతీయ ప్రాధాన్యమున్న లిఖిత ప్రతుల వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం ‘యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రామ్’ లక్ష్యం. ఈ వారసత్వాన్ని కాపాడడంలో అంతర్జాతీయ సహకారాన్ని, ఉమ్మడి కృషి ని కూడా ఇది ప్రోత్సహిస్తుంది. మన భగవద్గీత, నాట్యశాస్త్రం వంటి గ్రంథాలు ఇటీవలే ఈ జాబితాలో చేరడం దీనికి నిదర్శనం.
పరస్పర అవగాహనను ప్రోత్సహించడానికి, ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ సాంస్కృతిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఐసీసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు దోహదపడతాయి.
లోక్‌సభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2246913)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15