శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో విశేష కృషిని గౌరవించేందుకు ‘రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్‌ 2026’ నామినేషన్లను ప్రారంభించిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 28 MAR 2026 5:06PM by PIB Hyderabad

శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించేందుకు ప్రతిష్టాత్మకమైన ‘రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2026’ కోసం భారత ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. ఈ అవార్డుల ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు అధ్యక్షతన.. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలికి చెందిన ఆర్‌వీపీ సచివాలయం నిర్వహిస్తోంది. 

దేశ శాస్త్రీయ రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేస్తూ దేశ పురోభివృద్ధికి తోడ్పడిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలను రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం గౌరవిస్తుంది. వ్యవసాయ శాస్త్రం, అణుశక్తి, జీవ శాస్త్రాలు,రసాయన శాస్త్రం, రక్షణ సాంకేతికత, భూ శాస్త్రం,ఇంజనీరింగ్ శాస్త్రాలు, పర్యావరణ శాస్త్రం, గణితం, కంప్యూటర్ సైన్స్, వైద్యం, భౌతిక శాస్త్రం, అంతరిక్షం, శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణలు, ఇతర విభాగాలతో సహా విస్తృత శ్రేణి రంగాలలో నామినేషన్లను (స్వీయ నామినేషన్లతో సహా) ఆహ్వానిస్తున్నారు. 

ఆర్‌వీపీ-2026 పురస్కారాలు నాలుగు విభిన్న విభాగాల్లో అందిస్తారు. 

·       విజ్ఞాన్ రత్న (వీఆర్‌): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జీవితకాలం చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డు ఇస్తారు.

·       విజ్ఞాన్ శ్రీ (వీఎస్‌): సంబంధిత రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ గుర్తింపునిస్తారు.

·       విజ్ఞాన్ యువ-శాంతి స్వరూప్ భట్నాగర్ (వీవై-ఎస్‌ఎస్‌బీ): అసాధారణ ప్రతిభ కనబరిచిన యువ శాస్త్రవేత్తలను (45 ఏళ్ల వయస్సు వరకు) ప్రోత్సహించడానికి ఈ అవార్డును అందజేస్తారు.

·       విజ్ఞాన్ టీమ్ (వీటీ): పరిశోధనల్లో సమష్టి ప్రతిభ కనబరిచిన ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పరిశోధకుల బృందానికి ఈ అవార్డు అందిస్తారు.

 స్వీయ నామినేషన్లతో సహా అన్ని నామినేషన్లను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అవార్డుల వేదిక (https://awards.gov.in) ద్వారా 28 మార్చి 2026 నుంచి 11 మే 2026 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. 

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ‘‘శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో అత్యున్నత ప్రతిభను పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం నిదర్శనం. దేశాన్ని ప్రపంచ విజ్ఞాన నాయకుడిగా మార్చడంలో కృషి చేస్తున్న మన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తల అంకితభావాన్ని, పరిశోధన స్ఫూర్తిని ఈ అవార్డులు గౌరవిస్తాయి. సమాజ పురోభివృద్ధికి తోడ్పడుతూ, దేశానికి స్ఫూర్తినిచ్చే అర్హులైన అభ్యర్థులను నామినేట్ చేయడంలో సంస్థలు, తోటి నిపుణులు, వ్యక్తులు చురుగ్గా పాల్గొనాలని నేను కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. 

దేశంలోని శాస్త్రీయ ప్రతిభకు విస్తృత గుర్తింపు లభించేలా చూసేందుకు, నామినేషన్ల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, వ్యక్తులను మంత్రిత్వ శాఖ కోరింది. 

ఈ అవార్డుల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. దేశ శాస్త్రీయ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పురస్కారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. 

‘‘రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనేది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు, మన దేశంలో అత్యున్నత ప్రతిభను, ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి మన దేశం కట్టుబడి ఉందనడానికి ఇది ఒక నిదర్శనం’’అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ‘‘మనం ‘వికసిత్ భారత్’ దిశగా కృషి చేస్తున్న తరుణంలో స్థానిక నైపుణ్యం ద్వారా ప్రపంచ సవాళ్లను పరిష్కరిస్తున్న మన పరిశోధకులు, సాంకేతిక నిపుణుల అవిశ్రాంత కృషిని గుర్తించాలి. అంతరిక్ష శాస్త్రం నుంచి వ్యవసాయ శాస్త్రం వరకు 14 విభిన్న రంగాల్లో ఈ అవార్డులను అందజేస్తున్నాం. దీనివల్ల ప్రతి రంగంలోనూ ప్రభావవంతమైన పరిశోధనలకు తగిన గుర్తింపు లభిస్తుంది.’’ 

‘‘విజ్ఞాన శాస్త్రంలో గొప్పతనాన్ని’’ గుర్తించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయని మంత్రి పేర్కొన్నారు. స్వీయ నామినేషన్లతో కూడిన మరింత సమగ్రమైన, పారదర్శకమైన, కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత అర్హులైన ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. 

మరింత సమాచారం, వివరణాత్మక మార్గదర్శకాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వేదికను సందర్శించాలని లేదా న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌-హెచ్‌డీజీ వద్ద ఉన్న ఆర్‌వీపీ అవార్డు సచివాలయాన్ని సంప్రదించాలని కోరారు.

 

***


(రిలీజ్ ఐడి: 2246608) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi