రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

తుంగుస్కా గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ... ‘పి8ఐ’ విమానాల (డిపో స్థాయి) తనిఖీ కోసం ₹858 కోట్ల విలువైన కాంట్రాక్టులపై రక్షణ మంత్రిత్వశాఖ సంతకం

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 3:28PM by PIB Hyderabad

తుంగుస్కా గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ కొనుగోళ్లతోపాటు ‘పి8ఐ’ దీర్ఘ శ్రేణి సముద్ర నిఘా విమానాల తనిఖీ (డిపో స్థాయి) కోసం ₹858 కోట్ల విలువైన కాంట్రాక్టులపై రక్షణ మంత్రిత్వ శాఖ ఇవాళ న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్-2లో సంతకాలు చేసింది.

తుంగుస్కా గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ

భారత సైన్యం కోసం ₹445 కోట్ల విలువైన తుంగుస్కా గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థల కొనుగోలు  కాంట్రాక్టుపై రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో రష్యా సంస్థ ‘జేఎస్‌సి రోసోబోరోనెక్స్‌పోర్ట్‌’తో సంతకాల ప్రక్రియ పూర్తయింది. శత్రు విమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు సహా వైమానిక దాడుల నుంచి భారత్‌ బహుళ అంచెల గగనతల రక్షణ సామర్థ్యాన్ని ఈ అత్యాధునిక క్షిపణులు మరింత మెరుగుపరుస్తాయి. మొత్తం మీద ఇండో-రష్యన్ వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుంది.

పి8ఐ విమానాల తనిఖీ

‘బయ్‌ ఇండియన్’ కేటగిరీ కింద 100 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో భారత నావికా దళం కోసం ఉద్దేశించిన ‘పి8ఐ’ దీర్ఘ శ్రేణి సముద్ర నిఘా విమానాల తనిఖీ (డిపో స్థాయి) కోసం ₹413 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో భారత్‌లోని బోయింగ్ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ ‘బోయింగ్ ఇండియా డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌’తో రక్షణ శాఖ ప్రతినిధులు ఒప్పందం ఖరారు చేసుకున్నారు. స్వయం సమృద్ధ భారత్‌, ‘మేక్ ఇన్ ఇండియా’పై కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా దేశీయ ‘ఎంఆర్‌ఓ’ (నిర్వహణ, మరమ్మతు,  ఓవరాల్) కేంద్రంలో ‘పి8ఐ’ విమానాల డిపో స్థాయి నిర్వహణకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2246494) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi