వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ ర్యాంకింగ్‌లలో ఐసీఏఆర్‌ సంస్థల సరికొత్త రికార్డు.. దేశ వ్యవసాయ ఉన్నత విద్యలో కీలక మైలురాయి


సబ్జెక్ట్ వారీగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌-2026లో ఐసీఏఆర్ కు చెందిన రెండు డీమ్డ్ విశ్వవిద్యాలయాల చారిత్రాత్మక అరంగేట్రం

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 4:01PM by PIB Hyderabad

వికసిత్‌ భారత్ కలను సాకారం చేసే దిశగా.. భారతీయ వ్యవసాయ విద్యా సంస్థలు క్యూఎస్‌ ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ (సబ్జెక్ట్ వారీగా) 2026లో తొలిసారిగా స్థానం సంపాదించి సరికొత్త చరిత్రను సృష్టించాయి. 2025 డిసెంబర్‌లో జరిగిన ప్రధాన కార్యదర్శుల సదస్సులో భారత ప్రధానమంత్రి పేర్కొన్న ‘నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి’ ప్రాధాన్యతను ఈ ఘనత ప్రతిబింబిస్తోంది.

ఈ జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా పరిశోధన విద్య, విస్తరణ వ్యవస్థ (ఎన్‌ఏఆర్‌ఈఈఎస్‌)లో భాగంగా ప్రపంచ స్థాయి, బహుళ విభాగ, పరిశోధనాత్మక విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ విశ్లేషణ సంస్థ క్యూఎస్‌ క్వాక్వరెల్లి సైమండ్స్ మార్చి 25న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌లు ఈ సమష్టి కృషికి నిదర్శనంగా నిలిచాయి. 2026 విడత కోసం ప్రపంచవ్యాప్తంగా 1,900 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలకు చెందిన 21,000 పైగా విద్యా కార్యక్రమాలను విశ్లేషించారు. విద్యాపరమైన కీర్తి, ఉపాధి కల్పనలో గుర్తింపు, పరిశోధనా సూచనలు, అంతర్జాతీయ భాగస్వామ్యాల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు.

భారత వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలోని రెండు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాయి.బరేలీలోని ఐసీఏఆర్‌ భారత పశు పరిశోధన సంస్థ, పశువైద్య శాస్త్ర విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 51-100 ర్యాంకింగ్ శ్రేణితో నిలిచింది. ఈ విభాగంలో ప్రపంచ అత్యుత్తమ 100 సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ విశ్వవిద్యాలయం ఇదే కావడం విశేషం. న్యూఢిల్లీలోని ఐసీఏఆర్‌-భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, వ్యవసాయం, అటవీ విభాగంలో 151-200 ర్యాంకింగ్ శ్రేణితో అంతర్జాతీయ వేదికపై అరంగేట్రం చేసింది. తద్వారా భారత్‌లోని మేటి విద్యాసంస్థల సరసన ఇది నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా విశ్లేషించిన 475 విశ్వవిద్యాలయాల్లో వ్యవసాయం, అటవీ విభాగంలో భారత్‌ నుంచి 10 విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. ఐఏఆర్ఐతో పాటు 151-200 ర్యాంకింగ్ శ్రేణిలో బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ ఖరగ్‌పూర్ నిలిచాయి. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం 201-250 శ్రేణిలో చోటు సంపాదించింది. హిసార్‌కు చెందిన చౌదరి చరణ్ సింగ్ హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా తొలిసారిగా 301-350 శ్రేణిలో తొలిసారిగా ప్రవేశించింది. 

ఐసీఏఆర్‌కు చెందిన డీమ్డ్ విశ్వవిద్యాలయాలు మొదటిసారిగా ఈ జాబితాలో చేరడం వ్యవసాయ-ఆహార, ఆరోగ్య వ్యవస్థలలో అవి చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనమని డీఏఆర్‌ఈ కార్యదర్శి, ఐసీఏఆర్‌ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్‌ జాట్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రాల్లో ఎంతో పోటీ ఉన్నందున కేవలం పరిశోధన నైపుణ్యంపైనే కాకుండా సామాజిక ప్రభావాన్ని బట్టి కూడా అంచనా వేస్తారు. అలాంటి తరుణంలో ఈ విశ్వవిద్యాలయాల విజయం ప్రత్యేకంగా ప్రశంసనీయం. ప్రాథమిక పరిశోధనలు, క్షేత్రస్థాయి పనులు, పంటలు-పశువుల అభివృద్ధి, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం వంటి జాతీయ కార్యక్రమాలలో  ఐసీఏఆర్-ఐఏఆర్ఐ, ఐవీఆర్ఐ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటికున్న బలమైన పాత విద్యార్థుల వ్యవస్థ, భాగస్వాములనమ్మకం వల్ల వీటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.

వికసిత్‌ భారత్ వైపు దేశం పయనిస్తున్న తరుణంలో ఐసీఏఆర్‌ సంస్థలకు దక్కిన ఈ అంతర్జాతీయ గుర్తింపు ఒక కొత్త శకానికి నాంది. మన దేశ వ్యవసాయ ఉన్నత విద్య ప్రపంచంతో పోటీ పడటమే కాకుండా, విజ్ఞానం, ఆవిష్కరణల్లో, మానవ వనరుల అభివృద్దిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని ఇది నిరూపిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2246491) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Punjabi