ఔషధాల విభాగం
azadi ka amrit mahotsav

జనరిక్ మందుల సరఫరా

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 4:27PM by PIB Hyderabad

ప్రజలందరికీ నాణ్యమైన జనరిక్ మందులను తక్కువ ధరల్లో అందించేందుకు ప్రభుత్వం ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను (జేఏకే) ఏర్పాటు చేశారు. ఇక్కడ మందుల ధరలు బ్రాండెడ్ మందుల కంటే సుమారు 50% నుంచి  80% వరకు తక్కువగా ఉంటాయి. 28.02.2026 నాటికి ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 18,646 జనౌషధి కేంద్రాలు ప్రారంభమయ్యాయి.

మధ్యప్రదేశ్ లోని ఖజురహో లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 38 జనౌషధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో కట్నీ జిల్లాలో 9, పన్నా జిల్లాలో 4, ఛతర్‌పూర్ జిల్లాలో 25 కేంద్రాలు ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ) ప్రాథమిక అనుమతితో పాటు రాష్ట్ర డ్రగ్ లైసెన్సింగ్ అధికారుల నుంచి అవసరమైన లైసెన్సులు పొందిన తర్వాతే ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చారు. 

గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశవ్యాప్తంగా మొత్తం 4,142 జనౌషధి కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఎంఆర్పీ ధరల ప్రకారం మొత్తం రూ. 2,022.47 కోట్ల విక్రయాలు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో మందుల కొరతకు (స్టాక్-అవుట్) సంబంధించి ఎటువంటి ప్రధాన ఫిర్యాదులు  నమోదు కాలేదు.

ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కింద 2,110 మందులు, 315 శస్త్రచికిత్స పరికరాలు, వైద్య వినియోగ వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గుండె సంబంధిత, క్యాన్సర్ నివారణ, మధుమేహం, ఇన్ఫెక్షన్ నిరోధక, అలర్జీ నిరోధక, జీర్ణకోశ సంబంధిత మందులు, న్యూట్రాస్యూటికల్స్ వంటి అన్ని ప్రధాన చికిత్సా విభాగాలు ఉన్నాయి. ల్యాబ్ రీజెంట్స్, వ్యాక్సిన్లు మినహా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్ఎల్ఈఎం)లో ఉన్న దాదాపు అన్ని జనరిక్ మందులను ఈ జాబితాలో చేర్చారు.

ప్రస్తుతం పీఎంబీఐ ఉత్పత్తి జాబితాలో దీర్ఘకాలిక వ్యాధులు, అసంక్రమిత వ్యాధుల (ఎన్సీడీ) రోగుల కోసం 850 పైగా మందులు అందుబాటులో ఉన్నాయి. క్షయ (టీబీ) నివారణ మందుల కోసం 2021 సంవత్సరంలో  టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రారంభమైంది. ఉచితంగా మందులు అందించే లక్ష్యంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రచారం చేపట్టి క్షయ రోగులందరి పేర్లను నమోదు చేసింది. పీఎంబీఐ 100 పైగా జనౌషధి కేంద్రాలను సర్వే  చేసి తక్కువ డిమాండ్,  పై పేర్కొన్న ప్రచార కార్యక్రమం ద్వారా ఉచితంగా అందుబాటులో ఉండటం కారణంగా క్షయ నివారణ మందులను ఈ జాబితాలో చేర్చకూడదని నిర్ణయించింది.

జనౌషధి కేంద్రాలలో మందుల సరఫరా, లభ్యత, కోసం ఈ క్రింద చర్యలు అమలులో ఉన్నాయి.

  1. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐదు గిడ్డంగులు, 41మంది పంపిణీదారులు  కలిగిన అత్యాధునిక సమాచార సాంకేతికత ఆధారిత సరఫరా వ్యవస్థ  అందుబాటులో ఉంది.

  2. సెప్టెంబర్ 2024 నుంచి, అత్యధికంగా అమ్ముడయ్యే 100 రకాల మందులు, మార్కెట్లో వేగంగా విక్రయమయ్యే మరో 100 రకాల జనరిక్ మందుల నిల్వలను ప్రోత్సహించే చర్యలు చేపట్టారు. ఈ 200 రకాల మందుల నిల్వలను నిర్వహించే జనౌషధి కేంద్రాల యజమానులకు, వారు ఉంచే నిల్వల ఆధారంగా నెలవారీ ప్రోత్సాహకాలను అందిస్తారు.

  3. సాధారణంగా వాడే వస్తువుల లభ్యతను నిర్ధారించడానికి, ఈ పథకాన్ని అమలు చేసే ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా 400 రకాల వేగంగా విక్రయమయ్యే ఉత్పత్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. వీటికి ఉన్న డిమాండ్‌ను నిరంతరం అంచనా వేస్తుంది. అంతేకాకుండా, ఆటోమేషన్ ద్వారా కొనుగోలు ప్రక్రియను మెరుగుపరచడానికి, ఈ అంచనా పద్ధతిని డిజిటలైజ్ చేసే చర్యలు కూడా తీసుకున్నారు.

ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకం స్వయం ఉపాధికి ఒక బలమైన మార్గంగా నిలుస్తోంది. ఇది స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా, వివిధ స్థాయిల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ పథకం పరిధిని మరింత విస్తరించడానికి మార్చి 2027 చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం జనౌషధి కేంద్రాల సంఖ్యను 25,000 కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జనౌషధి కేంద్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఒక ఫ్రాంచైజీ వంటి నమూనాను అనుసరిస్తోంది. దీని కోసం వ్యక్తిగత పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, ట్రస్టులు, సంస్థలు, ప్రైవేట్ కంపెనీల నుంచి నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డీఫార్మా లేదా బీఫార్మా  విద్యార్హత కలిగిన ఏ వ్యక్తి అయినా లేదా అటువంటి విద్యార్హత కలిగిన వ్యక్తిని ఫార్మాసిస్ట్‌గా నియమించుకున్న ఏ సంస్థ అయినా జనౌషధి కేంద్రాన్ని తెరవడానికి అర్హులు. సంబంధిత రాష్ట్ర లైసెన్సింగ్ అధికారి నుంచి డ్రగ్ లైసెన్స్ పొందడం దీనికి తప్పనిసరి. మధ్యప్రదేశ్‌ లోని అన్ని జిల్లాలు  సహా దేశంలోని అన్ని జిల్లాల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల వారు www.janaushadhi.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ ఈరోజు లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2246490) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी