వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ. 2.16 లక్షల కోట్ల పైగా పెట్టుబడులను రాబట్టి, రూ.20.41 లక్షల కోట్ల ఉత్పత్తిని సాధించడంతో పాటు 14.39 లక్షల ఉద్యోగాలను సృష్టించిన పీఎల్ఐ పథకాలు

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 4:41PM by PIB Hyderabad

పెట్టుబడులను ప్రోత్సహించడానికి, ఆవిష్కరణలను పెంపొందించడానికి, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి భారత్ ను తయారీ, రూపకల్పన (డిజైన్), ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చడానికి భారత ప్రభుత్వం 25 సెప్టెంబర్ 2014న 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం, మేక్ ఇన్ ఇండియా 2.0 వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు అవుతున్న 15 తయారీ రంగాలు సహా మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తోంది. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ఉన్న రంగాల జాబితాను అనుబంధం-I లో జతచేశారు.

'మేక్ ఇన్ ఇండియా'  కింద తీసుకున్న ఇతర ప్రధాన చర్యలలో స్టార్టప్ ఇండియా, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్, జీఐఎస్ ఆధారిత ల్యాండ్ బ్యాంక్, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి (ఎఫ్డీఐ) విధాన సంస్కరణలు ఉన్నాయి. వీటితో పాటు మల్టీమోడల్ మౌలిక సదుపాయాల సమగ్ర ప్రణాళిక కోసం పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్, ప్రధాన ప్రాజెక్టుల ఏర్పాటులో అడ్డంకులను తొలగించడానికి ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు వంటివి చేపట్టారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, నిబంధనల భారాన్ని తగ్గించడం, కార్మిక చట్టాల హేతుబద్ధీకరణ, వస్తు సేవల పన్ను (జీఎస్టి) అమలు కూడా ఇందులో భాగమే. ప్రభుత్వ కొనుగోలు ఉత్తర్వులు, ఫేజ్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ (పీఎంపీ) ద్వారా స్వదేశీ తయారీని పెంచడానికి విధానపరమైన చర్యలు తీసుకున్నారు.

'మేక్ ఇన్ ఇండియా' లో భాగంగా 14 కీలక రంగాలలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ)  పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులో భారీ ఎలక్ట్రానిక్స్ తయారీ (ఎల్ఎస్ఈఎం), ఐటీ హార్డ్‌వేర్, ఔషధాలు, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు, అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీలు ఉన్నాయి. అలాగే సోలార్ పీవీ మాడ్యూల్స్, టెలికాం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తులు, ఆహార శుద్ధి, వస్త్రాలు, స్పెషాలిటీ స్టీల్, వైట్ గూడ్స్, డ్రోన్లు, డ్రోన్ విడిభాగాలు ఉన్నాయి. వీటి ఉత్పత్తిని, అమ్మకాలను పెంచడానికి ఈ పథకం ద్వారా ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. గుర్తించిన రంగాలలో కొత్త పెట్టుబడులకు పీఎల్ఐ పథకాలు మార్గం సుగమం చేశాయి. అలాగే తయారీ సామర్థ్యాల విస్తరణకు ఇవి ఎంతో తోడ్పడ్డాయి.

31 డిసెంబర్ 2025 నాటికి పీఎల్ఐ పథకాలు రూ.2.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ పథకాల కింద వచ్చిన పెట్టుబడులు రూ. 20.41 లక్షల కోట్లకు పైగా అదనపు ఉత్పత్తి, విక్రయాలకు దారితీశాయి. అంతేకాకుండా, ఈ పథకాల ద్వారా 14.39 లక్షలమందికి పైగా ప్రత్యక్ష,  పరోక్ష ఉపాధి కల్పించాయి. పీఎల్ఐ పరిధిలోకి వచ్చే మొత్తం 14 రంగాలలో ఇప్పటివరకు 836 దరఖాస్తులు ఆమోదం పొందాయి.

భారతదేశంలోని వివిధ రంగాలపై పీఎల్ఐ  పథకాల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయ తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో, ఎగుమతులను పెంచడంలో, ఉపాధి కల్పనలో, పలు వ్యూహాత్మక రంగాలలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఈ పథకాలు గణనీయమైన పాత్ర పోషించాయి. గత మూడేళ్లలో వచ్చిన పెట్టుబడులు, పెరిగిన ఉత్పత్తి ఉపాధి కల్పనకు సంబంధించిన పూర్తి వివరాలను అనుబంధం-IIలో పొందుపరిచారు. అయితే, పీఎల్ఐ కింద రాష్ట్రాల వారీగా డేటాను కేంద్రీకృత స్థాయిలో ప్రత్యేకంగా నిర్వహించడం లేదు.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కింద పేర్కొన్న వివిధ పథకాలు, కార్యక్రమాలు, విధానపరమైన చర్యల ద్వారా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అండగా నిలుస్తోంది. 

  1. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ): పీఎంఈజీపీ కింద కొత్త సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు 35% వరకు మార్జిన్ మనీ లభిస్తుంది. వ్యవసాయేతర రంగాలలో తయారీ యూనిట్ల కోసం రూ. 50 లక్షల వరకు, సేవా రంగ యూనిట్ల కోసం రూ. 20 లక్షల వరకు ప్రాజెక్ట్ వ్యయం ఉన్న కొత్త పరిశ్రమలకు ఈ పథకం వర్తిస్తుంది

  2. సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ పథకం (సీజీటీఎంఎస్ఈ):  ఈ పథకం ద్వారా ఎటువంటి హామీ  లేకుండానే రుణాలు పొందే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకం కింద ఇచ్చే రుణాలకు రూ. 10 కోట్ల వరకు గ్యారెంటీ కవరేజీ లభిస్తుంది.

  3. స్వావలంబన భారత్ నిధి: ఎంఎస్ఎంఈ రంగంలో రూ. 50,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడిని అందించడానికి ఈ నిధిని ఏర్పాటు చేశారు. ఇందులో భారత ప్రభుత్వం రూ.10,000 కోట్లు కేటాయించగా, మిగిలిన రూ.40,000 కోట్లు ప్రైవేట్ ఈక్విటీ లేదా వెంచర్ క్యాపిటల్ ఫండ్ల ద్వారా సమీకరిస్తారు. 2026-27 బడ్జెట్‌లో ఈ నిధి కోసం అదనంగా రూ.2000 కోట్ల మద్దతును ప్రభుత్వం ప్రకటించింది. 2021లో ప్రారంభించిన ఈ నిధిని మరింత బలోపేతం చేయడం ద్వారా సూక్ష్మ పరిశ్రమలకు అవసరమైన పెట్టుబడి నిరంతరం అందేలా చూడటం దీని ప్రధాన ఉద్దేశం.

  4. డిజిటల్ ఇండియా:  ఈ కార్యక్రమంలో భాగంగా, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వివిధ కీలక సేవలను అందిస్తోంది. ముఖ్యంగా ఒక వినియోగ వస్తువుగా డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనను, డిమాండ్‌ ఆధారిత నిర్వహణ, సేవలను, పౌరులు, ఎంఎస్ఎంఈల డిజిటల్ సాధికారతను ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

  5. ఎంఎస్ఎంఈలు రకరకాల డిజిటల్ వేదికల ద్వారా డిజిటల్ చెల్లింపులు కూడా జరుపుతున్నాయి. 

రాష్ట్రాల వారీగా వివిధ రంగాలలో సమగ్ర అభివృద్ధిని సాధించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం, ఈశాన్య రాష్ట్రాల కోసం ఉన్నతి,  జమ్మూ కాశ్మీర్ కోసం కొత్త కేంద్ర రంగ పథకం, స్టార్టప్ ఇండియా వంటి పలు కీలక పథకాలను అమలు చేస్తోంది. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని  కల్పించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశం.

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ఐసీడీపీ) కింద భారతదేశం అంతటా గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక ప్రాంతాలు, కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీని ఎదుర్కోగల తయారీ కేంద్రాలను, పెట్టుబడి గమ్యస్థానాలను నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఇప్పటివరకు సుమారు 20 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. దీనికి తోడు, రాష్ట్ర ప్రభుత్వాలు,  ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులను వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో 306 ప్లగ్-అండ్-ప్లే  పారిశ్రామిక పార్కులు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  మరో 20 ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కులను, స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఉపాధి కల్పనను పెంచడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం కోసం ఉన్నతి (ఉత్తర పూర్వ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్) పథకం పరిశ్రమలకు చేయూతనందిస్తోంది. ఈ పథకం కింద పరిశ్రమలకు ప్రధానంగా మూడు రకాల ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సెంటివ్ (సీఐఐ), క్యాపిటల్ ఇంట్రెస్ట్ సబ్‌వెన్షన్ (సీఐఎస్), మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఎంఎస్ఎల్ఐ) వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. 

జమ్మూ కాశ్మీర్ పారిశ్రామిక అభివృద్ధి కోసం కొత్త పెట్టుబడులను ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం రూ. 28,400 కోట్ల ఆర్థిక వ్యయంతో 'కొత్త కేంద్ర రంగ పథకం (ఎస్సీఎస్ఎస్), 2021'ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సెంటివ్ (సీఐఐ), క్యాపిటల్ ఇంట్రెస్ట్ సబ్‌వెన్షన్ (సీఐఎస్), గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (జీఎస్టీఎల్ఐ), వర్కింగ్ క్యాపిటల్ ఇంట్రెస్ట్ సబ్‌వెన్షన్ (డబ్ల్యూసీఐఎస్) వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. 

ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి, అన్ని రంగాలలో సామాజిక భద్రతను కల్పించడానికి ప్రభుత్వం ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకాన్ని కూడా ఆమోదించింది. ఈ పథకం ముఖ్యంగా తయారీ రంగానికి ప్రాధాన్యతనిస్తుంది. రూ.99,446 కోట్ల భారీ వ్యయంతో రూపొందించిన  ఈఎల్ఐ  పథకం, రాబోయే రెండేళ్ల కాలంలో దేశంలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 1.92 కోట్ల మంది లబ్ధిదారులు మొదటిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే వారు ఉండటం విశేషం.

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడం, ఉద్యోగ సన్నద్ధతను మెరుగుపరచడం, భారతదేశంలోని అగ్రశ్రేణి కంపెనీలు, సంస్థలలో నిర్మాణాత్మక ఇంటర్న్‌షిప్‌ల ద్వారా వృత్తిపరమైన అనుభవాన్ని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని అమలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ మొదటి విడతలో  1.81 లక్షలమందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, భాగస్వామ్య కంపెనీలు 60,000మందికి పైగా అభ్యర్థులకు 82,000 పైగా ఇంటర్న్‌షిప్ ఆఫర్లను ఇచ్చాయి. రెండవ విడతలో  2.14 లక్షలమంది పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, భాగస్వామ్య కంపెనీలు 71,000మంది పైగా అభ్యర్థులకు 83,000 పైగా ఇంటర్న్‌షిప్ ఆఫర్లను ఇచ్చాయి.

పెట్టుబడులను సులభతరం చేయడానికి, వివిధ రంగాలలో వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, దేశీయ తయారీని పెంచడం కోసం ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన చర్యలలో నేషనల్ సింగిల్ విండో సిస్టమ్, జీఐఎస్ఆధారిత ల్యాండ్ బ్యాంక్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధాన సంస్కరణలు, మల్టీమోడల్ మౌలిక సదుపాయాల సమగ్ర ప్రణాళిక కోసం పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్, ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటులో అడ్డంకులను తొలగించడానికి ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ వంటివి ఉన్నాయి.

వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద ఈరోజు రాజ్యసభలో ఈ వివరాలు తెలిపారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2246485) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , हिन्दी