రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘రిఫామ్ ఎక్స్‌ప్రెస్’ కింద అయిదు కొత్త సంస్కరణలను ప్రకటించిన భారతీయ రైల్వే... సరుకు రవాణా, నిర్మాణం, ప్రయాణికుల సౌకర్యంపై దృష్టి


· ఇకపై రైలు బయలుదేరేందుకు 30 నిమిషాల ముందు వరకూ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే అవకాశం.. త్వరలో అందుబాటులోకి వెసులుబాటు

· అంచనాలతో చివరి నిమిషంలో చేసే బుకింగులను అరికట్టి, నిజంగా అవసరమున్న ప్రయాణికులకు అదనపు ఖర్చు లేకుండా టిక్కెట్లు అందించడం లక్ష్యంగా రైల్వే రీఫండ్‌లు

· ఉప్పు, వాహనాల రవాణా కోసం ప్రత్యేక కంటైనర్లను రూపొందించగలిగేలా ప్రస్తుత ఆటోమొబైల్ పరిశ్రమ

· పైనుంచి లోడింగ్, పక్కనుంచి డిశ్చార్జ్ చేసే ఏర్పాటుతో.. తుప్పును తట్టుకుని నిలిచే స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లను ప్రవేశపెట్టిన రైల్వే... ఉప్పు రవాణాలో వాటాను పెంచుకోవడం లక్ష్యం

· ప్రాజెక్టు నాణ్యత, జవాబుదారీతనం, సకాలంలో పూర్తయ్యేలా చూసేందుకు నిర్మాణ నిబంధనల్లో ఏడు కీలక మార్పుల ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 24 MAR 2026 5:42PM by PIB Hyderabad

  భారతీయ రైల్వేలో 2026లో సంస్కరణలను చేపట్టాలన్న సంకల్పానికి అనుగుణంగా.. అయిదు కొత్త సంస్కరణలను ఆమోదించినట్టు కేంద్ర రైల్వే, సమాచార - ప్రసార, ఎలక్ట్రానిక్స్ - సమాచార సాంకేతికతా శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈ రోజు ప్రకటించారు. ఈ కొత్త సంస్కరణల ఆమోదంతో 2026 సంవత్సరానికి గాను మొత్తం సంస్కరణల సంఖ్య తొమ్మిదికి చేరింది.

ప్రస్తుతం కొనసాగుతున్న ‘రిఫామ్ ఎక్స్‌ప్రెస్’ కార్యక్రమంలో భాగంగా నాలుగు సంస్కరణలను ఇప్పటికే ప్రకటించగా, తాజాగా మరో అయిదు కొత్త సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్టు శ్రీ అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ అయిదు కొత్త సంస్కరణల్లో రెండు సరుకు రవాణాకు, ఒకటి నిర్మాణానికి సంబంధించినవి కాగా, మరో రెండు ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించినవిగా ఉన్నాయి.

ఉప్పు రవాణాలో సంస్కరణ

అయిదో సంస్కరణ ప్రధానంగా ఉప్పు రవాణాపై దృష్టి సారిస్తుంది. ప్రపంచంలో ఉప్పు ఉత్పత్తి, ఎగుమతుల్లో అతిపెద్ద దేశాల్లో ఒకటిగా భారత్ ఉందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్‌లు ఉప్పు ఉత్పత్తిలో ప్రధాన రాష్ట్రాలుగా ఉన్నాయన్నారు. దేశంలో ఏటా ఉత్పత్తి అయ్యే దాదాపు 35 మిలియన్ టన్నుల ఉప్పులో దాదాపు 9.2 మిలియన్ టన్నుల వరకు రైల్వే ద్వారా రవాణా అవుతోందని చెప్పారు. ఈ రంగంలో రైల్వేలకు గొప్ప అవకాశాలున్నాయని దీన్ని బట్టి స్పష్టమవుతోందని ఆయన వివరించారు.

పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే ఉప్పు రవాణాలో రైల్వేల వాటా దాదాపు 25 శాతంగా ఉండగా, ఆహారం కోసం వినియోగించే ఉప్పు రవాణాలో అది దాదాపు 65 శాతంగా ఉందని కేంద్ర మంత్రి వివరించారు. అంతేకాకుండా రైల్వేల ద్వారా జరిగే మొత్తం ఉప్పు రవాణాలో 62 శాతం వరకు.. 1,000 నుంచి 2,500 కిలోమీటర్ల మధ్య జరుగుతోందని, ఈ సుదీర్ఘమైన దూరం ఇది రైలులో రవాణాకు సానుకూలాంశంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఉప్పు ఉత్పత్తిదారులు, రవాణాదారులతో సమగ్ర సంప్రదింపుల ద్వారా.. రవాణాలో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లను గుర్తించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వ్యాగన్ల రూపకల్పన ఉప్పు రవాణాకు అనుకూలంగా లేకపోవడం, ఉప్పు వల్ల వ్యాగన్లు తుప్పు పట్టడం, ఓపెన్ వ్యాగన్లపై టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ నీటి చెమ్మలు రావడం, అనేక దశల్లో సరుకును మార్చడం వల్ల ఖర్చులు పెరగడంతోపాటు నష్టం వాటిల్లుతోందని ఈ అధ్యయనంలో గుర్తించినట్టు ఆయన వివరించారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం.. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన కంటైనర్లను వాడతారు. వీటిలో పై నుంచి సరుకును నింపి పక్క భాగాల నుంచి బయటికి పంపగల వ్యవస్థను అభివృద్ధి చేశారు. తుప్పు పట్టకుండా ఉండేందుకు స్టెయిన్‌లెస్ స్టీలుతో ఈ కంటైనర్‌ను తయారు చేశారు. ఇందులో పైన లోడ్ చేయడానికి అనువైన ఫ్లాపులనూ, పక్క భాగాల నుంచి బయటకు పంపేలా హైడ్రాలిక్ యంత్రాంగాన్నీ అమర్చారు. దీంతో గమ్యస్థానానికి చేరుకున్న అనంతరం సరుకును సులభంగా ట్రక్కుల్లోకి చేర్చవచ్చు.

ఈ కంటైనర్లను నేరుగా ఉప్పు ఉత్పత్తి కేంద్రాల వద్దే ఉంచి లోడింగ్ చేయవచ్చని కేంద్ర మంత్రి వివరించారు. వీటిని ఎత్తి కంటైనర్ రైళ్లపైకి లోడ్ చేసే వీలుంటుంది. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత అవసరాన్ని బట్టి అన్‌లోడ్ చేసి, ఈ కంటైనర్లను గిడ్డంగులు లేదా గోదాముల వద్ద ఉంచవచ్చు. ఈ విధానం వల్ల రవాణాలో ఎంతో వెసులుబాటు లభిస్తుందనీ, వివిధ రవాణా మార్గాల మధ్య సరుకు బదిలీ సులభతరమవుతుందనీ, సరుకు వృథా తగ్గుతుందనీ ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ వర్గాల నుంచి కూడా దీనికి మంచి స్పందన లభించిందన్నారు.

ఆటోమొబైల్ రవాణాలో సంస్కరణ

భారత ఆటోమొబైల్ మార్కెట్ ఏటా దాదాపు 31 మిలియన్ యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో ప్యాసెంజర్ వాహనాల సంఖ్య దాదాపు 5 మిలియన్లు. ప్యాసెంజర్ వాహనాల రవాణాలో రైల్వేల భాగస్వామ్యం 24 శాతంగా ఉంది. ఇప్పటికీ అత్యధిక శాతం ఆటోమొబైల్ వాహనాల రవాణా రోడ్డు మార్గాల ద్వారానే జరుగుతోందని ఇది సూచిస్తోంది.

పరిశ్రమ వర్గాల నుంచి అందిన అభిప్రాయం ఆధారంగా రైల్వే రవాణాలో రూపకల్పన, నిర్వహణ పరంగా ఎదురవుతున్న కొన్ని ప్రధాన అడ్డంకులను కేంద్ర మంత్రి వివరించారు. దేశంలోని ప్రధాన ఆటోమొబైల్ ఉత్పత్తి కేంద్రాలైన గుజరాత్‌లోని మహేసనా, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని చించ్‌వాడ్, బిదాది, ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ, తమిళనాడులోని మెల్‌పాక్కం, వాలాజాబాద్, హర్యానాలోని గుర్గావ్ వద్ద గల ఫరూఖ్‌నగర్‌లకు ప్రస్తుతం రైల్వే సేవలు అందుతున్నాయి. గతంలో పాత ప్యాసెంజర్ కోచ్‌లను ఆటోమొబైల్ క్యారియర్ వ్యాగన్లుగా మార్చడం వంటి ప్రయత్నాలు జరిగాయని, కొత్త మార్గాలను ప్రవేశపెడుతున్నామని ఆయన చెప్పారు. అయితే, అసలు సమస్య ఆటోమొబైల్ క్యారియర్ వ్యాగన్ల రూపకల్పనలోనే ఉనట్లు తర్వాతి సంప్రదింపుల ద్వారా వెల్లడైందన్నారు.

ప్రస్తుత వ్యాగన్ డిజైన్లు కేవలం సింగిల్-స్టాక్‌కో లేదా డబుల్-స్టాక్ కాన్ఫిగరేషన్లకో మాత్రమే పరిమితమై ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు. దీనివల్ల రవాణాలో వెసులుబాటు తక్కువగా ఉందన్నారు. అనేక రైల్వే మార్గాల్లో సొరంగాలు, వంతెనల వల్ల పరిమితులున్నాయనీ, రైల్వే శాఖ ప్రామాణిక కొలతల నియమావళి (షెడ్యూల్ ఆఫ్ డైమెన్షన్స్) ప్రకారం కొన్ని రకాల వ్యాగన్లు ఈ మార్గాల్లో ప్రయాణించడానికి వీలు పడదని తెలిపారు.

ఈ సమస్యలను పరిష్కరించే దిశగా ఓ కీలక సంస్కరణను శ్రీ అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. పరిశ్రమకు వెసులుబాటు కల్పిస్తూ.. ప్రత్యేక వ్యాగన్ డిజైన్‌ల రూపకల్పన చేసుకోవచ్చని పేర్కొన్నారు. తయారీదారులు ఇప్పుడు నిర్దిష్ట ప్రారంభ - గమ్యస్థాన మార్గాల ఆధారంగా అధిక సామర్థ్యంతో వ్యాగన్‌లను రూపొందించుకోవచ్చు.

గతంలో చేపట్టిన టోకు సిమెంటు విధాన (బల్క్ సిమెంట్ పాలసీ) సంస్కరణల ప్రభావాన్ని మంత్రి వివరిస్తూ.. ఈ మార్పుల వల్ల రైల్వే లోడింగ్‌లో తక్షణమే భారీ వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. రైలు మార్గం ద్వారా రవాణా అయిన బల్క్ సిమెంట్ పరిమాణం 2025 సెప్టెంబరులో దాదాపు 37,000 టన్నులు ఉండగా, 2026 జనవరి నాటికి అది దాదాపు 95,000 టన్నులకు పెరిగిందని తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు ఉప్పు, ఆటోమొబైల్ రవాణా రంగాల్లో సంస్కరణలు కూడా ఆయా రంగాల్లో రైల్వే ద్వారా సరుకు రవాణా వాటాను విశేషంగా పెంచుతాయని ధీమా వ్యక్తం చేశారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2246477) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , हिन्दी , Marathi , Gujarati , Odia