జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణలో రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శుల ప్రాంతీయ సదస్సు


అధ్యక్షత వహించిన జలవనరులు, నదీ అభివృద్ధి- గంగా పునరుజ్జీవన విభాగం కార్యదర్శి శ్రీ వీ.ఎల్. కాంతారావు

ప్రస్తుతం కొనసాగుతున్న పథకాల అమలుపై సదస్సు సమీక్ష

జల రంగంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసే చర్యలపై చర్చ

నాడు పోస్టు చేయడమైనది: 26 MAR 2026 4:50PM by PIB Hyderabad

జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జలవనరులు, నదీ అభివృద్ధి - గంగా పునరుజ్జీవన విభాగం (డీఓడబ్ల్యూఆర్, ఆర్‌డీ- జీఆర్) కార్యదర్శి శ్రీ వీ.ఎల్. కాంతారావు అధ్యక్షతన తెలంగాణలోని డాక్టర్ ఎం.సీ.ఆర్.హెచ్.ఆర్.డీ ఇనిస్టిట్యూట్‌లో 'రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శుల ప్రాంతీయ సదస్సు' జరిగింది. ఈ సదస్సులో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన నీటి వనరుల శాఖ ఉన్నతాధికారులు ఒకే వేదికపైకి వచ్చి జల రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రోజంతా జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీలోని డీఓడబ్ల్యూఆర్, ఆర్‌డీ- జీఆర్ అధికారులు.. ఈ విభాగం పరిధిలోని 15 ప్రధాన సంస్థల అధిపతులు కూడా పాల్గొన్నారు.

పాల్గొన్న రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రస్తుత శాఖాపరమైన పథకాల అమలు తీరును సమీక్షించడం,  ఆయా రాష్ట్రాల్లో విభాగం పరిధిలోని సంస్థలు చేపట్టిన పనులను పరిశీలించడం, కొనసాగుతున్న పథకాలు లేదా ప్రాజెక్టులు - అంతరాష్ట్ర అంశాలకు సంబంధించిన రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల సమస్యలను అర్థం చేసుకోవడం, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ అంశాలపై వివరణాత్మక చర్చలు జరపడం.. అనే లక్ష్యాలతో ఈ సదస్సును నిర్వహించారు. 

ఈ సదస్సులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జలవనరుల రంగంలో పథకాల అమలు స్థితిగతులు, కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఉన్న అంచనాలు- ఎదుర్కొంటున్న అడ్డంకులను వివరించారు. ప్రాధాన్యత కలిగిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కొనసాగుతున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి కావాల్సిన అవసరాన్ని, కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉన్న సమన్వయ లోపాలను తగ్గించాల్సిన ప్రాముఖ్యతను డీఓడబ్ల్యూఆర్, ఆర్‌డీ- జీఆర్ కార్యదర్శి ప్రధానంగా చెప్పారు. తదుపరి ఆర్థిక సంఘం కాలానికి సంబంధించి డీఓడబ్ల్యూఆర్, ఆర్‌డీ- జీఆర్ పథకాల సవరణ, సంస్కరణల్లో చురుగ్గా పాల్గొనాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆయన పిలుపునిచ్చారు.

సాధారణ పథకాలతో పాటు వరదను అంచనా వేసే కార్యకలాపాలు.. డీఓడబ్ల్యూఆర్, ఆర్‌డీ- జీఆర్ జారీ చేసిన కీలక మార్గదర్శకాల అమలుపై కూడా చర్చించారు. ముఖ్యంగా పూడిక నిర్వహణ, తీరప్రాంతాల్లో ఉప్పునీటి ప్రవేశం, ఆనకట్ట భద్రతా చట్టం నిబంధనల అమలు.. 'జల్ సంచయ్ జన్ భాగీదారీ' వంటి అంశాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు. ఈ కీలకమైన మార్గదర్శకాలను ప్రాధాన్యత ప్రతిపాదికన సత్వరమే అమలు చేయాలని పాల్గొన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. 

ముగింపు ప్రసంగంలో కార్యదర్శి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని జలవనరుల స్థిరమైన, సమర్థవంతమైన అభివృద్ధి కోసం సమగ్ర వ్యూహాలను రూపొందించడం, అమలు చేయడంలో ఈ సమావేశానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా జలవనరుల ప్రాజెక్టులు- పథకాల ప్రణాళిక, అభివృద్ధి, నిర్వహణ కోసం పూర్తి స్థాయి మద్దతును అందించడానికి తమ శాఖ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2245744) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi