జాతీయ మానవ హక్కుల కమిషన్
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఫిబ్రవరి మధ్య కాలం నుంచి ఇప్పటి వరకు కల్తీ పాలు తాగి
16 మంది మృతి చెందారన్న వార్తా కథనాన్ని సుమోటోగా తీసుకున్న భారత ఎన్‌హెచ్‌ఆర్‌సీ
రెండు వారాల్లోగా ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ
బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు వివరాలు, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం చెల్లించి ఉంటే
వాటి వివరాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశం
నాడు పోస్టు చేయడమైనది:
26 MAR 2026 11:27AM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా లాలాచెరువు, చౌడేశ్వరీ నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగటం వల్ల ఫిబ్రవరి మధ్య నుంచి ఇప్పటి వరకు 16 మంది మరణించినట్లు మీడియాలో వచ్చిన వార్తా కథనాలను భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. మీడియా కథనం ప్రకారం.. ఒకే లక్షణాలతో బాధపడుతున్న నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాలల్లో విషపూరిత రసాయనమైన ఇథిలీన్ గ్లైకాల్‌ను కలవటం వల్ల శరీరంలోని పలు అవయవాల పనితీరు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నర్సాపురం గ్రామంలోని ఒక డెయిరీలో ఈ కల్తీ జరగ్గా.. ఆ డెయిరీ ద్వారా పరిసర ప్రాంతాల్లోని దాదాపు 100 ఇళ్లకు పాల సరఫరా అవుతాయి.
వార్త కథనంలోని అంశాలు నిజమైతే, బాధితుల మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని కమిషన్ తెలిపింది. రెండు వారాల్లోగా ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు వివరాలు, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం చెల్లించి ఉంటే, వాటి వివరాలను నివేదికలో పొందుపరచాలని కమిషన్ ఆదేశించింది.
మార్చి 23, 2026 నాటి మీడియా నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి నెల మధ్య కాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బాధితులు కడుపునొప్పి, వాంతులు, మూత్రం రాకపోవటం, మూత్రపిండాల పనితీరులో లోపం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు, చిన్న పిల్లలే ఉన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2245656)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15