హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కశ్మీరీ వలస కుటుంబాల కోసం సంక్షేమ, గృహనిర్మాణ సహాయక చర్యలు

నాడు పోస్టు చేయడమైనది: 25 MAR 2026 3:36PM by PIB Hyderabad

భద్రతా సంబంధిత వ్యయ విధానం,  ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ (పీఎండీపీ) కింద కాశ్మీరీ వలస కుటుంబాలకు ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సహాయక చర్యలు ఈ కింది విధంగా ఉన్నాయి.

1.      సహాయక విభాగం కింద నమోదు చేసుకున్న వలస కుటుంబాలకు నెలకు ఒక వ్యక్తికి రూ.3,250 చొప్పున నగదు సహాయం అందుతోంది. ఒక కుటుంబానికి నెలకు గరిష్టంగా రూ. 13,000  వరకు ఈ సహాయం లభిస్తుంది.

2.      కాశ్మీరీ వలసదారులకు ఒక వ్యక్తికి నెలకు 9 కిలోల బియ్యం, 2 కిలోల గోధుమ పిండి, ఒక కుటుంబానికి నెలకు కిలో చక్కెర చొప్పున ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నారు. జమ్మూ వలసదారులకు ఒక వ్యక్తికి నెలకు 9 కిలోల గోధుమ పిండి, 2 కిలోల బియ్యం, ఒక కుటుంబానికి కిలో చక్కెర చొప్పున అందిస్తున్నారు.

3.      జమ్మూలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కాశ్మీరీ వలస కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన నివాస శిబిరాలు, ఫ్లాట్ల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం చేపడుతోంది.

4.      కాశ్మీరీ వలస యువత కోసం ప్రత్యేకంగా 6,000 ఉద్యోగాలను కేటాయించారు. ఈ పోస్టులకు ఇప్పటివరకు 5,896 (98.26 శాతం) మంది అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

5.      ఇతర కార్యక్రమాలు..

·         కాశ్మీరీ వలసదారుల సౌకర్యార్థం నమోదు, వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ కోసం ఆన్‌లైన్ సేవలను ప్రారంభించారు.  ఇందులో నివాస ధ్రువీకరణ పత్రం, వెనుకబడిన ప్రాంత నివాసి ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, వలసదారు ధ్రువీకరణ పత్రం జారీ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.

·         ఆధార్ అనుసంధానం-ప్రత్యక్ష నగదు బదిలీ: పారదర్శకంగా, సమర్థవంతంగా ఉపశమన నిధుల (నగదు సహాయం) బదిలీ చేసేందుకు  ఆధార్ అనుసంధానాన్ని అమలు చేశారు. దీనివల్ల ఎటువంటి ఆలస్యం లేకుండా, నిజమైన లబ్ధిదారులకు నిధులు నేరుగా, తక్షణమే బదిలీ అవుతున్నాయి.

·         దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వలసదారుల సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ఫిర్యాదుల పరిష్కార శిబిరాలను ఏర్పాటు చేశారు.

·         కాశ్మీరీ సంస్కృతి, భాషను ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యం, క్రీడల పట్ల అవగాహన పెంచేందుకు సామాజిక-సాంస్కృతిక కార్యక్రమాలు, శిబిరాలను నిర్వహిస్తున్నారు.

·         ప్రభుత్వానికి చెందిన స్మార్ట్ పీడీఎస్ వేదికలోని ఎన్ఎఫ్ఎస్ఏ డేటాబేస్‌తో వలసదారుల రేషన్ కార్డులను అనుసంధానించారు.

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ప్రస్తుతం పనిచేస్తున్న లేదా భవిష్యత్తులో నియమితులయ్యే కాశ్మీరీ వలస ఉద్యోగుల కోసం కాశ్మీర్ లోయ అంతటా 20 వేర్వేరు ప్రాంతాలలో 6,000 తాత్కాలిక  నివాసాల  నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంజూరైన 6,000 తాత్కాలిక నివాసాల్లో ఇప్పటివరకు 4,112 నివాసాల నిర్మాణం పూర్తయింది. వీటిలో 3,257 నివాసాలను కేటాయించారు.

నేడు రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2245347) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी