రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
సకాలంలో ఎరువులు అందుబాటులోకి వచ్చేలా రవాణాను క్రమబద్దీకరించిన ప్రభుత్వం
ఎరువుల ట్యాగింగ్‌లో అవకతవకలకు పాల్పడితే ఈసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 8:58PM by PIB Hyderabad
వ్యవసాయ సీజన్లో రాష్ట్రాలకు ఎరువులు సకాలంలో చేరుకొనేలా రవాణా, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం సమగ్ర చర్యలను చేపట్టింది. ప్రతి పంట కాలానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యవసాయం, రైతు సంక్షేమ విభాగం సంప్రదింపులు జరుపుతుందనీ, రాష్ట్రాల వారీగా, నెలవారీగా ఎరువుల అవసరాలను అంచనా వేస్తుందనీ రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా ఎస్ పటేల్ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. ఈ అంచనాల ఆధారంగా ఎరువుల విభాగం నెలవారీ ఎరువుల సరఫరా ప్రణాళికను జారీ చేసి, లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తుంది.
రాయితీ ఎరువుల రవాణాను సమీకృత ఎరువుల నిర్వహణ వ్యవస్థ (ఐఎఫ్ఎంఎస్) ద్వారా ఆన్‌లైన్లో పర్యవేక్షిస్తారు. సకాలంలో ఇండెంట్‌ను పంపించేలా తయారీదారులు, దిగుమతిదారులతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. సరిపడినన్ని రైలు వ్యాగన్లను అందుబాటులో ఉంచడం, ఎరువుల రవాణాకు ప్రాధాన్యమివ్వడంపై రైల్వే మంత్రిత్వ శాఖతో క్రమం తప్పకుండా సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. డిమాండు- సప్లయి మధ్య అంతరాన్ని పూడ్చడానికి, తగినన్ని ఎరువులను అందుబాటులో ఉండేలా భరోసా ఇవ్వడానికి ముందస్తు దిగుమతులు చేపడతారు. రాష్ట్రాల్లో పంపిణీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చేపడతాయి.
ప్రస్తుత రబీ 2025-26 సీజన్లో యూరియా, డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకే లాంటి ఎరువులు అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. యూరియా సబ్సిడీ పథకం కింద, 45 కేజీల బస్తాకు రూ.242 చొప్పున గరిష్ఠ చిల్లర ధరకు (నీమ్ కోటింగ్ ఛార్జీలు, వర్తించే పన్నులు మినహాయించి) రైతులకు చట్టబద్ధంగా లభిస్తుంది. రవాణా ఖర్చు, మార్కెట్ ధర మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సబ్సిడీ రూపంలో తయారీదారులు, దిగుమతిదారులకు అందిస్తారు.
వీటితో పాటుగా, 01.04.2010 నుంచి వర్తించే విధంగా ఫాస్పేట్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులకు పోషకాధారిత రాయితీ (ఎన్‌బీఎస్) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్‌బీసీ విధానం పరిధిలో రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచేందుకు వాటిలోని పోషక విలువల ఆధారంగా సీజన్లో పీవోఎస్ వద్ద జరిగే అమ్మకాలపై తయారీదారు/దిగుమతిదారుకు సబ్సిడీ లభిస్తుంది. ముఖ్యమైన ఎరువులు, ముడి సరకులకు సంబంధించిన అంతర్జాతీయ ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ధరల్లో హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే వాటిని పీ అండ్ కే ఎరువులకు వార్షిక/ద్వైవార్షిక ప్రాతిపదికన ఎన్‌బీఎస్ ధరలను నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటుంది. తద్వారా రైతులుకు అందుబాటు ధరలకే పీ అండ్ కే ఎరువులు సరఫరా అయ్యేలా హామీ ఇస్తుంది. అదే విధంగా, ఈ ఎరువులు అందుబాటులో ఉండేలా చూసేందుకు మెట్రిక్ టన్నుకు రూ.3,500 చొప్పున ధర ఉండేలా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. దీనిలో ఫ్యాక్టరీ నుంచి పొలానికి సరఫరా చేయడానికి అయిన ఖర్చు, అంతర్జాతీయ ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల ఎదురయ్యే లాభనష్టాలు, ఎంఆర్‌పీపై విధించిన జీఎస్టీ, నికర ఎంఆర్‌పీపై 4 శాతం చొప్పున ఇచ్చే రిటర్ను (ఎంఆర్‌పీ-జీఎస్టీ) భాగమై ఉన్నాయి. ఖరీఫ్ 2025, రబీ 2025-26 సీజన్లలో ఎన్‌బీఎస్ సబ్సిడీకి అదనంగా దిగుమతి చేసుకున్న, దేశీయంగా ఉత్పత్తి చేసిన డీఏపీ, దిగుమతి చేసుకున్న టీఎస్పీకి కూడా ఇది వర్తిస్తుంది.
ఎరువులతో పాటు ఇతర నిత్యావసరం కాని ఉత్పత్తులను తరలించడం లేదా అనుబంధ విధానంలో చేయడంపై మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. నిత్యావసర వస్తువుల చట్టం – 1955 ప్రకారం ఎరువులను నిత్యవసర వస్తువుగా ప్రకటించి, ఎరువుల నియంత్రణ ఉత్తర్వు – 1985 ప్రకారం అమల్లోకి తీసుకువచ్చారు. అక్రమాలకు పాల్పడే వారిపై ఈసీ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఎరువుల అధిక ధరలు/ట్యాగింగ్‌కు సంబంధించి ఎరువుల విభాగానికి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. వీటిపై నిత్యావసర వస్తువుల చట్టం – 1955, ఎరువుల నియంత్రణ ఉత్తర్వు 1985 ప్రకారం చర్యలు తీసుకుంటారు.
అదే విధంగా ఎరువులతో కలసి ఇతర ఉత్పత్తులను తరలించడాన్ని లేదా ట్యాగ్ చేయడాన్ని ఎరువుల విభాగం ప్రోత్సహించదు. ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనవద్దని ఎరువుల సంస్థలకు తగిన ఆదేశాలను జారీ చేసింది. ఇలాంటి కార్యకలాపాలను నివారించడానికి నిబంధనలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
ఎరువులను సమర్థవంతంగా రవాణా చేయడం, సరసమైన ధరలకు అందరికీ అందుబాటులో ఉంచడంతో పాటు చట్టవ్యతిరేకమైన పద్ధతుల నుంచి రైతులకు భద్రత అందించేలా ప్రభుత్వం కనబరుస్తున్న చిత్తశుద్ధిని ఈ చర్యలు తెలియజేస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2245045)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8