గనుల మంత్రిత్వ శాఖ
జాతీయ డీఎంఎఫ్ రెండు రోజుల సదస్సు ముగింపు
ప్రధానమంత్రి శ్రీ మోదీ దార్శనికతకు ప్రతిబింబమే డీఎంఎఫ్
గనుల తవ్వకంతో ప్రభావితమైన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: జి. కిషన్ రెడ్డి
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 9:23PM by PIB Hyderabad
జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డీఎంఎఫ్) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు ప్రతిబింబమని, గనుల తవ్వకం వల్ల ప్రభావితమైన ప్రజలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ‘డీఎంఎఫ్ సదస్సు-2026’ ముగింపు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "డీఎంఎఫ్‌తో సంబంధం ఉన్న అధికారులు అందరూ గనుల ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలి" అని సూచించారు.
గనుల తవ్వకం ప్రభావిత ప్రాంతాల్లో పారదర్శకత, జవాబుదారీతనం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ... ఈ రెండు రోజుల సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ముగిసింది.
నేటి చర్చలు డీఎంఎఫ్ పోర్టల్, డేటా ఆధారిత ప్రణాళికలపై ప్రధానంగా దృష్టి సారించాయి. నిజ-సమయ పర్యవేక్షణ, పారదర్శకత కోసం డీఎంఎఫ్ పోర్టల్ 2.0 ప్రదర్శనతో పాటు, రాష్ట్రాలు తమ క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నాయి. లక్షిత కార్యక్రమాల కోసం పీఎంకేకేకేవై కింద బేస్‌లైన్ సర్వేలు, ప్రభావ అంచనా, ప్రాధాన్య రంగాల్లో గరిష్ట సామర్థ్యాన్ని సాధించడం... జాప్యాన్ని తగ్గించడానికి నిధుల విడుదల, పారదర్శకతను కొనసాగించడం... ఆడిట్‌లు, సమాచార వెల్లడి, సామాజిక భాగస్వామ్యం ద్వారా సుస్థిర పాలనకు ప్రాధాన్యతమివ్వడం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.
మోడల్ జిల్లాలు, ర్యాంకింగ్ భావన ప్రధానంగా జవాబుదారీతనం, మెరుగైన ఫలితాలను ప్రోత్సహించడానికి మోడల్ డీఎంఎఫ్ జిల్లాలను అభివృద్ధి చేయడం, పనితీరు ఆధారిత ర్యాంకింగ్‌లను ప్రవేశపెట్టడం గురించి ప్రస్తావించారు.
డీఎంఎఫ్ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం కోసం ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడింది.
డీఎంఎఫ్ ప్రాజెక్టుల అమలు సమాజ కేంద్రితమై ఉండాలని ఉన్నత నాయకత్వం స్పష్టం చేసింది.
గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, అన్ని డీఎంఎఫ్ ప్రాజెక్టులను స్థానిక సమాజాల అవసరాలు, ఆందోళనలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ ప్రణాళికను రూపొందించి, అమలు చేయాలని స్పష్టం చేశారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణాత్మక, గణనీయమైన, ప్రభావవంతమైన అభివృద్ధిని నిర్ధారించడం కోసం జిల్లా స్థాయి ప్రయత్నాలను నీతి ఆయోగ్ మోడల్ జిల్లా విధానంతో అనుసంధానించాల్సిన ప్రాముఖ్యతను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
డీఎంఎఫ్ నిధుల పారదర్శక, జవాబుదారీ, సమర్థ వినియోగాన్ని నిర్ధారించడానికి కేంద్ర, రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సూచించారు. ప్రజల జీవితాల్లో నిజమైన, సానుకూల, స్పష్టమైన మెరుగుదలను అందించే పథకాలకు ప్రాధాన్యమివ్వాలని ఆయన పేర్కొన్నారు. మెరుగైన పాలన, ఫలితాల-ఆధారిత అమలు ద్వారా మైనింగ్ ప్రభావిత వర్గాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గనుల ప్రభావానికి గురైన ప్రజల సంక్షేమం కోసం డీఎంఎఫ్ నిధులను పూర్తిస్థాయిలో, సమర్థంగా వినియోగించాలని పునరుద్ఘాటించారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక 'ఆధునిక గ్రామాన్ని' అభివృద్ధి చేయాలనే దార్శనికతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది ప్రగతికి ఒక ప్రమాణంగా నిలుస్తుందని, ఇతర ప్రాంతాల్లో ఇలాంటి అభివృద్ధికి ఇది స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు.
ఈ ఆదర్శ గ్రామాల జీవన నాణ్యతలో స్పష్టమైన మెరుగుదలను సాధించాలని, గనుల తవ్వకం కార్యకలాపాల ప్రయోజనాలు నేరుగా ప్రజలకు చేరేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రభావవంతమైన, సుస్థిరమైన అభివృద్ధిని సాధించడానికి జిల్లా స్థాయిలో అంకితభావంతో, నిరంతరం కృషి చేయాలని శ్రీ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2244844)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6