పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రక్షణ అధికారులకు ‘కార్పొరేట్ పాలనలో డైరెక్టర్ సర్టిఫికేషన్ కోర్సు’ నాలుగో బ్యాచ్ శిక్షణ విజయవంతం


· రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ రీసెటిల్మెంట్ (డీజీఆర్)తో సంయుక్తంగా కార్యక్రమం పూర్తిచేసిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ (ఐఐసీఏ)

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2026 8:47PM by PIB Hyderabad

గురుగ్రామ్‌లోని మనేసర్‌లోగల ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్ (ఐఐసీఏ) సంస్థ ‘కార్పొరేట్ పాలనలో డైరెక్టర్ సర్టిఫికేషన్ కోర్సు’లో రక్షణ రంగ అధికారుల నాలుగో బ్యాచ్‌ శిక్షణను ఈ నెల 20న విజయవంతంగా పూర్తిచేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్మెంట్ (డీజీఆర్‌)తో సంయుక్తంగా ‘ఐఐసీఏ’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ రెండు వారాల కార్యక్రమంలో భారత సాయుధ దళాల్లోని మూడు విభాగాల నుంచి 30 మంది సీనియర్ అధికారులు శిక్షణ పొందారు. ‘ఐఐసీఏ’లో 2024 ఆగస్టు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా 4 బ్యాచ్‌లలో మొత్తం 120 మంది అధికారులు శిక్షణ పొందారు.

సాయుధ దళాల్లో అధికారుల నాయకత్వ అనుభవాన్ని కార్పొరేట్ రంగ అవసరాలకు తగినట్లు మలచుకునేలా శిక్షణ ఇవ్వడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందులో భాగంగా కంపెనీలను నియంత్రించే చట్టాలు, నియంత్రణ చట్రాలు, స్వతంత్ర డైరెక్టర్ల బాధ్యతలు, ఆర్థిక పర్యవేక్షణ, ముప్పు నిర్వహణ, ‘ఇఎస్‌జీ’ సూత్రాలు సహా విశ్వసనీయ విధులపై వారికి అవగాహన కల్పిస్తారు.

అనుభవజ్ఞులు, ప్రస్తుతం ఈ రంగంలోగల స్వతంత్ర డైరెక్టర్లతో సంభాషణ తదితరాల ద్వారా ఈ కార్యక్రమం కార్పొరేట్ నాయకత్వ వాస్తవాలపై శిక్షణార్థులలో అనుభవపూర్వక అవగాహనను పెంచింది.

శిక్షణానంతరం మార్చి 19న నిర్వహించిన సర్టిఫికెట్ ప్రదానోత్సవంలో రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మాజీ సైనికుల సంక్షేమ శాఖ (డీఈఎస్‌డబ్ల్యూ) కార్యదర్శి శ్రీమతి సుకృతి లిఖి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘ఐఐసీఏ’ డైరెక్టర్ జనరల్-సీఈవో శ్రీ జ్ఞానేశ్వర్ కుమార్ సింగ్ దీనికి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా శ్రీ సింగ్‌ మాట్లాడుతూ- ఈ కార్యక్రమం కింద శిక్షణార్థి అధికారులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన సహా అనుభవజ్ఞులైన కార్పొరేట్ రంగ అగ్రగాములు, నిపుణులు, సహచరులతో వృత్తిగత సంబంధం ఏర్పరచుకునే అవకాశం లభిస్తుందన్నారు. ప్రస్తుత బాధ్యతల నుంచి వారు కార్పొరేట్ పాత్రలోకి మారినపుడు ఈ అనుభవపూర్వక శిక్షణ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా కార్పొరేట్ పాలన నాణ్యతను పెంచడంలో భాగంగా ‘ఐఐసీఏ’తో పాటు తమలోతాము పరస్పర సంబంధాలు నెరపాల్సిందిగా ఇప్పటిదాకా శిక్షణ పొందిన రక్షణ అధికారులందరికీ ఆయన సూచించారు.

రక్షణ అధికారుల పదవీ విరమణానంతరం వారికోసం అర్థవంతమైన మార్గాల అన్వేషణలో ‘ఐఐసీఏ’, ‘డీజీఆర్‌’ మధ్య సహకారాన్ని ‘డీఈఎస్‌డబ్ల్యూ’ కార్యదర్శి శ్రీమతి సుకృతి లిఖి ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా కార్పొరేట్ పాలన సంబంధిత బాధ్యతలపై విజ్ఞానం, విస్తృత అవగాహన రెండూ కల్పించేలా ‘ఐఐసీఏ’ పోషిస్తున్న పాత్రను ఆమె కొనియాడారు.

ఈ కార్యక్రమం విస్తృత జాతీయ సంకల్పం ‘వికసిత భారత్-2047’లో భాగమని ఆమె అభివర్ణించారు. కార్పొరేట్ పాలన పాత్రలో అనుభవజ్ఞులైన సైనికాధికారుల ప్రవేశం వృత్తిపరమైన మార్పిడికి పరిమితం కాదని, అది జాతీయ సేవను కొనసాగించడమేనని పేర్కొన్నారు. క్రమశిక్షణ, వ్యూహాత్మక దృక్పథం, నిజాయితీ, నిబద్ధత వంటి అనేక ఉత్తమ నాయకత్వ లక్షణాలను వీరు కార్పొరేట్ రంగంలోకి తెస్తారని గుర్తుచేశారు. తద్వారా మరింత బలమైన సంస్థలను, బాధ్యతాయుత వ్యవస్థలను రూపొందించడంలో తమవంతు సహకారం అందిస్తారని చెప్పారు. ప్రగతిశీల, పటిష్ఠ భారత దేశం కోసం ఇవి రెండూ అత్యావశ్యక మూలస్తంభాలని తెలిపారు.

 ‘ఐఐసీఏ’ స్కూల్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ విభాగాధిపతి, కార్యక్రమ సంచాలకుడైన డాక్టర్ నీరజ్ గుప్తా తొలుత సర్టిఫికేషన్‌ కోర్సు నేపథ్యాన్ని వివరించారు. ఇందులో భాగమైన వివిధ కార్యకలాపాలకు ‘ఐఐసీఏ’ ప్రిన్సిపల్ రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ అనిందితా చక్రవర్తి నాయకత్వం వహించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2244272) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी