హోం మంత్రిత్వ శాఖ
విపత్తుల నిర్వహణలో శ్రేష్ఠత్వాన్ని గుర్తిస్తున్న సుభాష్ చంద్ర బోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్
• విపత్తులను నిరోధించే, విపత్తులను ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యే, విపత్తులకు ప్రతిస్పందించే,
విపత్తుల నుంచి తిరిగి తేరుకునేలా దేశ శక్తియుక్తుల్ని పటిష్ఠపరిచే అత్యుత్తమ పద్ధతుల్నీ, మార్గదర్శక కృషినీ
పది మందికీ చాటిచెప్పడానికే ఈ అవార్డు
• ఏడాది పొడవునా నామినేషన్లు సమర్పించవచ్చు.. దరఖాస్తుల్ని నేషనల్ అవార్డ్‌స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి... స్వీయ నామినేషన్‌నీ, మూడో పక్షం నామినేషన్‌కీ అవకాశం
నాడు పోస్టు చేయడమైనది:
23 MAR 2026 5:02PM by PIB Hyderabad
సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జనవరి 23న ప్రకటించే ‘సుభాష్ చంద్ర బోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్’ ఒక ప్రతిష్ఠాత్మక జాతీయ గౌరవం. విపత్తుల నిర్వహణ రంగంలో వ్యక్తులు, సంస్థలందించే అమూల్య సేవలను గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నారు. విపత్తులను నిరోధించే, విపత్తులను ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యే, విపత్తులకు ప్రతిస్పందించే, విపత్తుల నుంచి తిరిగి తేరుకునేలా దేశ శక్తియుక్తుల్ని పటిష్ఠపరిచే అసాధారణ కృషినీ, సర్వోత్తమ పద్ధతుల్నీ లోకానికి వెల్లడించాలనే సంకల్పంతో ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
విపత్తుల నిరోధం, విపత్తు ప్రసరించే ప్రభావాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టడం, విపత్తును సమర్థంగా ఎదుర్కోవడానికి సన్నద్ధం కావడం, విపత్తు వేళల్లో తగిన విధంగా ప్రతిస్పందన చర్యలు తీసుకోవడం, సహాయ-పునరావాస చర్యలు, పునర్నిర్మాణం, పరిశోధన, నూతన ఆవిష్కరణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల కల్పన, సమాజాన్ని చైతన్యపరచడం, సామర్థ్యాలను పెంపొందించే చర్యలు సహా విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ అసాధారణ సేవలను అందించే వర్గాల్ని ఈ పురస్కారం గుర్తిస్తుంది. నూతన ఆవిష్కరణలనూ, ఉత్తమ పద్ధతులనూ వెన్ను తట్టి ప్రోత్సహించడం, సురక్షిత విపత్తు వేళ ఆటుపోటులకు తట్టుకుని నిలిచేదిగా భారత్ ను తీర్చిదిద్దే దిశగా తోడ్పడాల్సిందిగా వ్యక్తులకూ, సంస్థలకూ స్ఫూర్తిని అందించడం ఈ అవార్డు లక్ష్యాలు. విపత్తు నష్టభయాన్ని తగ్గించడంతో పాటు మానవతాపూర్వక ప్రతిస్పందనల్లో అసాధారణ ప్రయత్నాలను గుర్తించి పండగ చేసుకోవడం కోసం ఈ పురస్కారాన్ని ఉద్దేశించారు. ఇది విజయవంతమైన నమూనాలను లోకానికి వెల్లడి చేయడంలోనూ, జాతీయ విపత్తు విరుచుకుపడే సందర్భాల్లో మరింత ఎక్కువ మందికి ప్రేరణ ఇవ్వడానికి ఈ అవార్డు దోహదం చేస్తుంది.
పురస్కార కేటగిరీలు
• వ్యక్తి పరంగా - ప్రశంస పత్రం, పతకం
• సంస్థ పరంగా - ప్రశంస పత్రం, ఫలకం
ఎవరు దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఎవరిని నామినేట్ చేయొచ్చు?
అర్హత కలిగిన నామినీలు ఎవరెవరంటే
• వ్యక్తులు
• సంస్థలు
• జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సంస్థలు
• జిల్లా అధికారులు
• పరిశోధన, విద్యా సంస్థలు
• ప్రభుత్వేతర సంస్థలు, పౌర సమాజ సంస్థలు
• ప్రయివేట్ రంగ సంస్థలు
భారతీయ పౌరులతో పాటు సంస్థలూ ఈ పురస్కారానికి అర్హమైనవే.
నామినేషన్ ప్రక్రియ
• నామినేషన్లను సంవత్సరమంతా స్వీకరిస్తారు
• దరఖాస్తుల్ని జాతీయ పురస్కారాల పోర్టల్ https://awards.gov.in ద్వారా ఆన్‌లైన్లోనే సమర్పించాలి.
• స్వీయ నామినేషన్‌నూ, అలాగే థర్డ్-పార్టీ నామినేషన్లను కూడా అనుమతిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2244210)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15