|
గనుల మంత్రిత్వ శాఖ
కేంద్ర గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన 23.. 24 తేదీల్లో జాతీయ ‘డీఎంఎఫ్’ సదస్సు-2026
నాడు పోస్టు చేయడమైనది:
22 MAR 2026 12:20PM by PIB Hyderabad
కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈ నెల 23, 24 తేదీల్లో న్యూఢిల్లీలోని ‘స్కోప్ కన్వెన్షన్ సెంటర్’లో జాతీయ జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డీఎంఎఫ్) సదస్సు-2026ను నిర్వహిస్తుంది. “ఏడీపీ/ఏడీపీ ప్రాంతాల్లో జిల్లా ఖనిజ నిధుల సద్వినియోగం” ప్రధానాంశంగా నిర్వహించే ఈ సదస్సును కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రిత్వశాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే, కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారు. గనుల తవ్వక ప్రభావిత జిల్లాలు... ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం (ఏడీపీ), ఆకాంక్షాత్మక సమితుల కార్యక్రమ (ఏబీపీ) ప్రాంతాల్లో ‘డీఎంఎఫ్’ నిధులను సమర్థంగా, ఫలితాలు రాబట్టేలా మెరుగ్గా వినియోగించడానికి ఈ సదస్సు ప్రాధాన్యమిస్తుంది. ఇందులో భాగంగా అంతర-ప్రభుత్వ సమన్వయ బలోపేతం, విధాన సంస్కరణల నిర్దేశం వంటివి ఈ శిఖరాగ్ర సదస్సు లక్ష్యాలు.
డీఎంఎఫ్ ప్రణాళిక-అమలు-పర్యవేక్షణ సంబంధిత సవాళ్లు, ఉత్తమ పద్ధతులు, సంస్కరణలపై చర్చించే దిశగా ఈ రెండు రోజుల శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, నీతి ఆయోగ్, ఇతర భాగస్వాములు సహా ఉన్నతాధికారులందర్నీ ఇది ఒకే వేదికపైకి తెస్తుంది.
ఈ శిఖరాగ్ర సదస్సుకు ముందుగా రాష్ట్ర-జిల్లా స్థాయి దృక్కోణాలపై దృష్టి సారించడం కోసం గనుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక సంప్రదింపుల కార్యక్రమం నిర్వహించింది. ఈ మేరకు లక్ష్యాలు-నేపథ్య రంగాలపై రూపొందించిన వివరణ పత్రాన్ని ఈ ఏడాది జనవరిలో ‘డీఎంఎఫ్’ రాష్ట్రాలతోపాటు ఏడీపీ, ఏబీపీ ప్రాంతాల్లోని 306 ‘డీఎంఎఫ్’ జిల్లాలు సహా నీతి ఆయోగ్‌కు పంపింది. ఆ తర్వాత గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రాలు/జిల్లాలతో ఆన్‌లైన్ ద్వారా జాతీయ స్థాయి సంప్రదింపులు సహా ఫిబ్రవరిలో తదుపరి సమావేశాలను నిర్వహించారు. రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు, రాష్ట్ర సంబంధిత శాఖలతో రాష్ట్ర స్థాయి అంతర్గత చర్చలను కూడా చేపట్టారు. అటుపైన కీలక సవాళ్లు, ఆచరణీయ సిఫారసులు, డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన సమర్థ చర్యల ఉదాహరణలను ప్రముఖంగా వివరిస్తూ తాము సమీకరించిన సమాచారాన్ని రాష్ట్రాలు అందజేశాయి.
ఈ సమాచారం ఆధారంగా మంత్రిత్వ శాఖ రూపొందించిన సమగ్ర తుది పత్రం శిఖరాగ్ర సదస్సులో చర్చలకు ప్రధాన సూచన పత్రంగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఏడీపీ, ఏబీపీ ప్రాంతాల్లో నిధుల సద్వినియోగంపై సదస్సు దృష్టి సారిస్తుంది. పరిపాలన, పారదర్శకత, సమన్వయం, ప్రభావ అంచనా, పనితీరు వంటి అంశాలు ప్రధాన చర్చనీయాంశలుగా ఉంటాయి. రాష్ట్రాల ప్రతినిధులు, నీతి ఆయోగ్, ‘బైశాగ్-ఎన్’ అధికారులు తమ అభిప్రాయాలను సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రతినిధులందరి మధ్య వివిధ అంశాలపై చర్చలు కొనసాగుతాయి.
ఈ సదస్సు నేపథ్యంలో రాష్ట్రాలన్నిటా ‘డీఎంఎఫ్’ వనరుల ద్వారా పొందిన నిధులతో విజయవంతంగా పూర్తిచేసిన ప్రాజెక్టులు, ఉత్తమ పద్ధతులను ప్రస్ఫుటం చేసే ప్రదర్శన (ఎగ్జిబిషన్) ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్యం, పోషణ, నీటి సరఫరా, విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, పునరుత్పాదక విద్యుత్తు, మౌలిక సదుపాయాలు వంటి ప్రాధాన్య రంగాల్లో అమలు చేసిన కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. గనుల తవ్వకం ప్రభావిత-ఆకాంక్షిత ప్రాంతాలలో సార్వజనీన ప్రగతి సాధనలో ‘డీఎంఎఫ్’ నిధుల పాత్రను ఈ ప్రదర్శన చాటుతుంది.
సంస్కరణల ప్రాధాన్యంపై ఏకాభిప్రాయ సాధనకు, జాతీయ అభివృద్ధి కార్యక్రమాలతో సమన్వయం పెంచడానికి, సుస్థిర-సమ్మిళిత అభివృద్ధి కోసం ‘డీఎంఎఫ్’ నిధుల వినియోగం మెరుగు తదితరాలకు జాతీయ ‘డీఎంఎఫ్’ సదస్సు-2026 దోహదం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2243577)
|